Janasena MPTC Candidate Dies: ఎన్నికల సందడి.. ఓట్ల లెక్కింపు ఉత్కంఠ.. గెలుపోటములపై ఆశలు, ఎదురుచూపులు.. ఇలా గ్రామమంతా ఎన్నికల వాతావరణంలో ఉండగా, తూర్పుగోదావరి జిల్లాలోని ఓ కుటుంబంలో మాత్రం తీరని విషాదం అలుముకుంది. ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన గారపాటి దివ్య అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూడాల్సిన సమయంలో ఆమె మరణవార్త కుటుంబ సభ్యులను, గ్రామస్థులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దేవరపల్లి మండలం దుమంతునిగూడేనికి చెందిన గారపాటి దివ్య జనసేన పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న ఆమె గురువారం పోలింగ్ ముగిసిన అనంతరం అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను రాజమండ్రిలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించడంతో కొంత కోలుకున్నట్లు భావించి రాత్రి ఇంటికి తీసుకువచ్చారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

అయితే విధి మరోలా తలచింది. ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే దివ్య మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను తిరిగి రాజమండ్రి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. దివ్య మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించడంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. దివ్య భర్త శ్రీనివాస్ కూడా జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. అయితే ఈ దంపతులకు నాలుగు నెలల పసిబిడ్డతో పాటు మరో కుమారుడు ఉన్నారు. అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన వయసులో ఉన్న చిన్నారికి తల్లి దూరమవడం పలువురిని కలచివేస్తోంది. పిల్లల భవిష్యత్తు, కుటుంబం ఎదుర్కోబోయే పరిస్థితులను తలుచుకుని గ్రామస్థులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

గ్రామస్తులను కలవరపెడుతున్న దివ్య మరణం

ఒకవైపు ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుండగా, మరోవైపు దివ్య మరణవార్త గ్రామాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. ఓట్ల లెక్కింపుతో వెలువడాల్సిన ఫలితాల కోసం ఎదురుచూస్తున్న కుటుంబానికి ఇంతలోనే తీరని లోటు ఎదురైంది. గెలుపోటముల సంగతి పక్కనపెడితే, తమతో కలిసి నడిచిన వ్యక్తి ఇక లేరన్న వాస్తవాన్ని గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఇద్దరు చిన్నారులను వదిలి దివ్య దూరమవడం అందరి హృదయాలను కలచివేస్తోంది. ఎన్నికల ఫలితాల సందడి మధ్య దుమంతునిగూడెంలో మాత్రం దివ్య జ్ఞాపకాలు, కుటుంబ సభ్యుల కన్నీళ్లే మిగిలాయి. తిరిగి వస్తుందని ఎదురుచూసే అమ్మ కోసం నాలుగు నెలల పసిబిడ్డకు తెలియని లోటు.. ఆ లోటును జీవితాంతం మోయాల్సిన కుటుంబ సభ్యుల వేదన.. గ్రామాన్ని విషాదంలో ముంచెత్తాయి.