“సీజేపీ ఉద్యమానికి పాకిస్థాన్ నుంచి నిధులు”
Pakistan funding CJP: కాక్రోచ్ జనతాపార్టీ చేస్తున్న ఉద్యమానికి పాకిస్థాన్ నుంచి నిధులు అందుతున్నాయంటూ కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

Pakistan funding CJP: కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాల వెనుక విదేశీ నిధులు ఉన్నాయా..? ఢిల్లీలో ఆ పార్టీ చేపట్టిన ఆందోళనలకు పాకిస్థాన్ నుంచి డబ్బులు అందాయా..? తాజాగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ (Jitendra Singh) చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన ఉద్యమాలకు పాకిస్థాన్ నుంచి నిధులు అందాయంటూ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. విదేశాల్లోని ఎన్జీవో సంస్థల నుంచి వచ్చిన నిధులకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశీ నిధులతో పనిచేస్తున్న కొన్ని ఎన్జీవో సంస్థలు డీప్ స్టేట్ ఆపరేటివ్‌లుగా వ్యవహరిస్తూ భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నాయని జితేంద్ర సింగ్ విమర్శించారు. పాకిస్థాన్‌తో పాటు ఇతర దేశాల నుంచి వస్తున్న నిధుల వ్యవహారాన్ని అభిజీత్ దీప్కే, అశుతోష్ రాంకాలు పర్యవేక్షిస్తున్నారని ఆరోపించారు. అభిజీత్ దీప్కేకు అమెరికా నుంచి నిధులు అందుతుండగా, అశుతోష్ రాంకాకు పాకిస్థాన్ నుంచి నిధులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఆరోపణలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి.
#WATCH | Bengaluru | Union Minister Dr Jitendra Singh says, “There is enough evidence to show that they are being funded by unauthorised sources, by anti-India NGOs, and anti-India organisations within and outside the country. The foreign-funded NGOs, deep state operatives and anti-Indiaforces are manufacturing this narrative…Abhijeet Dipke has been receiving funds from USA-based donors, Ashutosh Ranka, paid by Pakistani politicians…”
(03.11)
— ANI (@ANI) November 4, 2026
కేంద్రమంత్రి ఆరోపణలపై సీజేపీ ఎదురుదాడి
మరోవైపు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ (Jitendra Singh) చేసిన వ్యాఖ్యలపై సీజేపీ (Cockroach Janata Party) నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని ఎక్స్ వేదికగా విమర్శించారు. కేంద్రమంత్రి ఏదైనా చెప్పి తప్పించుకునే పరిస్థితి ఉందని, అందుకే అత్యున్నత పదవుల్లో ఉన్నవారి మాటలకు విలువ లేకుండా పోతోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అభిజీత్ దీప్కే, అశుతోష్ రాంకాలకు ప్రజల్లో విశ్వసనీయత ఉందని సీజేపీ నేతలు పేర్కొన్నారు. తమ ఉద్యమాలపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలను తిప్పికొట్టారు.
ఢిల్లీలో రెండు ఉద్యమాలు చేపట్టిన సీజేపీ
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తొలుత సోషల్ మీడియా వేదికగా యువతలో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ప్రభుత్వ విధానాలు, నిరుద్యోగం, విద్యావ్యవస్థలోని లోపాలపై గళమెత్తుతూ వీధి పోరాటాలకు దిగింది. ఈ క్రమంలోనే ఢిల్లీలో రెండు ప్రధాన ఆందోళనలు నిర్వహించింది. తొలుత 2026 జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన చేపట్టింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, పరీక్షల నిర్వహణలో అవకతవకలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అనంతరం జూలై 20న చలో పార్లమెంట్ పేరుతో మరో భారీ ఉద్యమానికి పిలుపునిచ్చింది. వేలాది మంది యువత ఈ నిరసనలో పాల్గొనగా, పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ నెలలో సీఈసీ జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలంటూ సీజేపీ పిలుపునిచ్చింది. ఢిల్లీలో భారీ ర్యాలీ చేపట్టేందుకు వెళ్లిని అభిజీత్ దీప్కేతో పాటు.. సీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా జంతర్ మంతర్‌లో ఆంక్షలు ఉన్న సమయంలో ఆందోళన చేశారంటూ సౌరవ్ దాస్‌తో పాటు.. పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
రాజకీయంగా మరింత ముదరనున్న వివాదం
సీజేపీ ఉద్యమాల (Cockroach Janata Party) వెనుక విదేశీ నిధులు ఉన్నాయంటూ కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్ నుంచి నిధులు అందుతున్నాయన్న ఆరోపణలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఏమిటి? విదేశీ నిధుల వ్యవహారంలో నిజానిజాలేంటి.. అన్నది తేలాల్సి ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఆరోపణలు, సీజేపీ నేతల ఎదురుదాడితో ఈ వివాదం రానున్న రోజుల్లో మరింత ముదిరే అవకాశముంది.



