కాక్రోచ్‌లకు అమెరికా నిధులు.. నిజమేనా?
America Funding CJP: కాక్రోచ్ జనతాపార్టీకి అమెరికా నుంచి నిధులు వస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారత్‌లో అశాంతి నెలకోల్పేందుకు అమెరికా నుంచి వస్తున్న నిధులను ఉపయోగిస్తున్నట్లు అమెరికాకు చెందిన ప్రముఖ సింగర్ ఆరోపిస్తున్నారు.

America Funding CJP: వంటగదిలోనైతే ఏ హిట్టో కొడతాం. మరీ చికాకు పెడితే కాలితోనైనా నలిపేస్తాం. కానీ ఆ కాక్రోచ్‌లు ఖతర్నాక్. బొద్దింకల్లా ఎక్కడెక్కడినుంచో చకచకా పాక్కుంటూ అనుకున్నచోటికి వచ్చేస్తారు. రచ్చరంబోలా చేస్తారు. నీట్ పేపర్ లీక్ విషయంలో ధర్మేంద్రప్రధాన్‌తో రాజీనామా చేయించాక కాక్రోచ్‌ల కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇప్పుడు సీఈసీ రాజీనామాకు కాక్రోచ్ జనతాపార్టీ పట్టుబడుతోంది. దేశ రాజధానిపై కాక్రోచ్‌ల దండయాత్రతో చివరికి జంతర్‌మంతర్‌లో నిరసనలకు అవకాశం లేకుండా నోటిఫై చేసేదాకా వచ్చింది.
కాక్రోచ్‌లకి కాంగ్రెస్ పార్టీ మద్దతుంది. బొద్దింకలను ఉసిగొల్పుతోంది ఆమ్ఆద్మీ పార్టీనే అన్న ఆరోపణలున్నాయి. దేశంలో అశాంతి రేపేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్న అధికారపక్షానికి ఇప్పుడో బ్రేకింగ్ న్యూస్ దొరికింది. కాక్రోచ్ జనతాపార్టీకి అమెరికా నుంచి నిధులు అందుతున్నాయని సంచలన ఆరోపణలొస్తున్నాయి. తమ దేశంలోని దాతలు కొందరు కాక్రోచ్‌లకు ఫండ్ అందిస్తున్నారని అమెరికా సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపిస్తున్నారు. సీజేపీ ట్రాప్‌లో పడకుండా భారత్‌లోని యువత శాంతియుతంగా నిరసనలు తెలపాలని మేరీ పిలుపునిచ్చారు.
ఆఫ్రికన్ అమెరికన్ అయిన మేరీ మిల్బెన్ ఇండియన్స్‌కి సుపరిచితురాలు. మన జాతీయగీతంతో పాటు ఓం జై జగదీశ హరే పాటలతో ఇండియాలోనూ ఆమె ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అలాంటి సింగర్ బొద్దింకలతో జాగ్రత్తని హెచ్చరించడం ఆసక్తికర పరిణామం. దేశ అభివృద్ధి, పాలనపై ఇలాంటి పోరాటలు ప్రభావం చూపుతాయంటున్న మేరీ.. భారత్‌లో చదువుకున్న యువత మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైందని ఇన్‌స్టా పోస్ట్‌తో అప్రమత్తం చేస్తున్నారు.



