Indian Sailor Killed Oman Coast: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తొలగిపోకపోగా.. సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి, గల్ఫ్ ఆఫ్ ఒమన్ పరిసర ప్రాంతాలు ఇప్పుడు ప్రమాదకర యుద్ధ క్షేత్రాలుగా మారుతున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణల ప్రభావం అంతర్జాతీయ నౌకాయాన రంగంపై తీవ్రంగా పడుతోంది. వాణిజ్య నౌకలపై డ్రోన్లు, క్షిపణులు, గుర్తుతెలియని వైమానిక వస్తువులతో దాడులు జరుగుతుండటంతో సముద్ర ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. ఈ పరిణామాల మధ్య ఓమన్ తీరంలో భారతీయ నావికుడి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది.

ఓమన్ తీరంలో భారత నౌకపై దాడి.. ఒకరు మృతి

నవంబర్ 2న ఓమన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న భారతీయ నౌక ‘MSVఅల్ జుసుఫీపై డ్రోన్ దాడి జరిగింది. ఈ నౌకలో మొత్తం 14 మంది భారతీయ నావికులు ఉన్నారు. దాడి కారణంగా నౌకలో తీవ్ర ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘటనలో గుజరాత్‌కు చెందిన గాంధార్ నహీమ్ అజీజ్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన 13 మంది నావికులను ఒమన్ కోస్ట్ గార్డ్ సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ఈ ఘటనపై కేంద్ర ఓడరేవులు, నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాంధార్ నహీమ్ అజీజ్ మృతిపట్ల సంతాపం ప్రకటిస్తూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులందరికీ తక్షణ సహాయం అందించేందుకు భారత నౌకాయాన మంత్రిత్వ శాఖ, ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాయని వెల్లడించారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడంతోపాటు, ప్రాణాలతో బయటపడిన 13 మంది నావికులను భారత్‌కు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

హోర్ముజ్ జలసంధి ఎందుకంత కీలకం..?

హోర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన వాణిజ్యానికి జీవనాడి. పర్షియన్ గల్ఫ్‌ను గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియా సముద్రంతో అనుసంధానించే ఈ ఇరుకైన సముద్ర మార్గం ద్వారా ప్రపంచంలోని భారీ మొత్తంలో చమురు, సహజ వాయువు రవాణా అవుతాయి. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ వంటి దేశాల నుంచి ఇంధన సరఫరాలకు ఈ మార్గం అత్యంత కీలకం. ప్రపంచ చమురు వినియోగంలో దాదాపు ఐదో వంతుకు సమానమైన పరిమాణం సాధారణంగా ఈ జలసంధి మీదుగా రవాణా అవుతుంది. భారత్‌కు కూడా ఈ మార్గం వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యం. గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకునే చమురు, గ్యాస్ సరఫరాలకు అంతరాయం ఏర్పడితే దేశీయ ఇంధన ధరలు, రవాణా ఖర్చులు, పరిశ్రమల ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉంది.

జూన్‌లో మరణించిన విశాఖ వాసి

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ప్రారంభమైన ఇరాన్‌తో ఘర్షణలు సముద్ర భద్రతను తీవ్రంగా దెబ్బతీశాయి. హోర్ముజ్ జలసంధి, పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతాల్లో వాణిజ్య నౌకలు దాడుల ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఒమన్ తీరంలో MT సెట్టెబెల్లో నౌకపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో విశాఖపట్నానికి చెందిన మెరైన్ ఇంజనీర్ పట్నాల సురేశ్ ప్రాణాలు కోల్పోయారు. అమెరికా దళాలు నౌకపై దాడి చేయడంతో ఇంజిన్ రూమ్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేశ్‌తో పాటు డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా కూడా మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో మరణించిన ముగ్గురి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇప్పుడు మరోసారి భారతీయులు ఉన్న నౌకపై దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.