Central Minister Affair Rumours: కేంద్ర మాజీ మంత్రి ఎల్‌. మురుగన్‌ (L. Murugan) రాజీనామా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా తాను కేంద్ర మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే, ఆయన రాజీనామా వెనుక కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అంశాలు ఉన్నాయనే ఊహాగానాలు కూడా వినిపించాయి. సెంట్రల్ కేబినెట్ రీషఫల్‌భాగంగా కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయనతో రాజీనామా చేయించారని ఢిల్లీ వర్గాలు కోడై కూశాయి. మరికొంతమంది మాత్రం తమిళనాడులో ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారంటూ చెప్పుకొచ్చారు. అయితే ఎల్‌. మురుగన్ రాజీనామాకు మాత్రం ఒక చిన్న మెసేజ్‌ ఆయన రాజకీయ జీవితానికి ఎండ్ కార్డ్ వేసేలా చేసిందంటూ పలువురు ఆరోపిస్తున్నారు.

హీరోయిన్‌కు పర్సనల్ మెసేజ్‌

ఎల్‌. మురుగన్‌కు కోయంబత్తూరుకు చెందిన ఓ రాజకీయ మధ్యవర్తితో సంబంధాలు ఉన్నాయంటూ కొన్ని వర్గాల్లో ప్రచారం ఉంది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రిగా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన మురుగన్‌కు  (L. Murugan) బాలీవుడ్‌ సినీ ప్రముఖులతో (Bollywood Heroine) పరిచయాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓ ప్రముఖ బాలీవుడ్‌ నటికి ఆయన వ్యక్తిగతంగా సందేశాలు పంపినట్లు, తనను కలవాలని కోరడంతోపాటు కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తానని చెప్పినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ సందేశాలపై సదరు నటి ఢిల్లీలోని పెద్దలకు ఫిర్యాదు చేశారని, దీంతో పార్టీ అధిష్ఠానం మురుగన్‌ రాజీనామాకు సూచించడంతో ఆయన రాజీనామా చేసినట్లు ఢిల్లీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వివాదానికి రాజకీయ రంగు పులుముకోకముందే ఎల్‌.మురుగన్‌తో రాజీనామ చేస్తే సమస్యకు ఎండ్ కార్డ్ వేసినట్లు భావించిన బీజేపీ అధిష్టానం రాజీనామా చేయించినట్లు సమాచారం..

రాజీనామాకు రాజకీయ కారణాలేనా..?

2026 అక్టోబర్‌ 13న ఎల్‌. మురుగన్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తూ కేంద్ర మంత్రివర్గ బాధ్యతల నుంచి తనను తప్పించాలని, రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకునేందుకు అనుమతించాలని కోరారు. తమిళనాడుకు తిరిగి వెళ్లి పార్టీ కార్యకర్తలతో కలిసి పనిచేయడం, రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడం, 2029 లోక్‌సభ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడం తన లక్ష్యమని ఆయన వెల్లడించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన మంత్రి పదవికి చేసిన రాజీనామాను ఆమోదించారు. మరోవైపు, కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశాలు, తమిళనాడు బీజేపీలో ఆయన రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి వంటి అంశాలు కూడా ఆయన రాజీనామాపై చర్చకు కారణమయ్యాయి. తమిళనాడు తరఫున కేంద్రమంత్రిగా ఉన్న ఏకైక వ్యక్తి ఎల్‌. మురుగన్ (L.Murugan) మాత్రమే. ఇప్పుడు ఆయన రాజీనామాతో కేంద్ర మంత్రివర్గంలో తమిళనాడు తరఫున ప్రాతినిధ్యం లేదు.

ఎల్‌.మురుగన్ రాజకీయ ప్రస్థానం

ఎల్‌. మురుగన్‌ తమిళనాడులోని ఓ సాధారణ కుటుంబం నుంచి రాజకీయాల్లో ఎదిగారు. ఆయన తల్లిదండ్రులు రోజువారీ కూలీలుగా పనిచేసేవారు. విద్యార్థి దశలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ABVP)తో అనుబంధం ఏర్పరచుకున్న ఆయన, అనంతరం బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. 2017 నుంచి 2020 వరకు జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌ (NCSC) ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. 2020 మార్చి 12న బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆ సమయంలో రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలను విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ధారాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన, డీఎంకే అభ్యర్థి ఎన్‌. కయల్విళి చేతిలో 1,393 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2021 జూలైలో కేంద్ర మంత్రివర్గంలో సహాయ మంత్రిగా చేరారు. సమాచార, ప్రసార శాఖతోపాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ బాధ్యతలు నిర్వహించారు. 2024లో మధ్యప్రదేశ్‌ నుంచే మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2030 వరకు కొనసాగాల్సి ఉంది.

రెండుసార్లు ఓటమి పాలైన మురుగన్ (L. Murugan)

2024 లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని నీలగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మురుగన్‌, (L. Murugan) డీఎంకే నేత రాజా చేతిలో ఓడిపోయారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అవినాశి నియోజకవర్గం నుంచి పోటీ చేసి, టీవీకే అభ్యర్థి ఎస్‌. కమలి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల పరాజయాలు కూడా ఆయన రాజకీయ భవిష్యత్తుపై చర్చకు కారణమయ్యాయంటూ తమిళనాడులో చర్చ జరుగుతోంది. అయితే, ఆయన రాజీనామా చుట్టూ రాజకీయ ఊహాగానాలు కొనసాగుతున్నప్పటికీ, బాలీవుడ్‌ నటికి పర్సనల్ మెసేజ్‌ పంపిన వ్యవహారమే ఇందుకు కారణమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి..