త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు.. కసరత్తులు చేస్తున్న ఈసీ
Five State Assembly Elections: త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు ఈసీ కసరత్తు. జనవరిలో షెడ్యూల్ విడుదలకు అవకాశం. ఫిబ్రవరి-మార్చిలో పోలింగ్‌కు ఏర్పాట్లు.. యూపీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి

Five State Assembly Elections: దేశ రాజకీయాలను ప్రభావితం చేయనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్, పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించింది. వచ్చే ఏడాది జనవరి ప్రథమ లేదా ద్వితీయార్థంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి-మార్చి నెలల్లో పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసేలా ఈసీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
SIR, EVMల తనిఖీలపై ప్రత్యేక దృష్టి
ఎన్నికల నిర్వహణకు కీలకమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియతో పాటు ఈవీఎంల తనిఖీలను ఎన్నికల సంఘం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఈ నెలాఖరు చివరిలో లేదా.. డిసెంబర్ నెలలో ఐదు రాష్ట్రాల్లో సీఈసీ జ్ఞానేష్‌కుమార్, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు పర్యటించనున్నట్లు సమాచారం. పర్యటన ముగిసిన వెంటనే ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల జోరు పెరిగింది. షెడ్యూల్ విడుదలకు సంకేతాలు కనిపిస్తుండటంతో రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
యూపీ ఎన్నికలే ప్రధాన ఆకర్షణ.. బీజేపీకి సవాలుగా మారనున్న ఫలితాలు
ఐదు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై అత్యంత ఆసక్తి నెలకొంది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీ ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కీలక ప్రాంతాల్లో బీజేపీ ఓటమి పాలవడం ఆ పార్టీకి రాజకీయంగా సవాలుగా మారింది. ఈ పరిణామాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్లేందుకు ఈ ఫలితాలు ఊతమిచ్చాయి. మరోవైపు అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ సర్వే రిపోర్టులు సిద్ధం చేయగా.. కాంగ్రెస్, మిత్రపక్షాలతో సీట్ల పంపకాలపై అఖిలేష్ యాదవ్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం..
ఐదు రాష్ట్రాల్లో హోరాహోరీ పోరు
ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్‌లలో అధికారాన్ని తిరిగి దక్కించుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉంది. పంజాబ్‌లో అధికారాన్ని కాపాడుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్ తిరిగి పుంజుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. పంజాబ్‌లో ఇప్పటికే నలబై మంది అభ్యర్థులతో ఆప్ తొలి జాబితాను విడుదల చేసింది. అందులో పలువురు మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే కొంతమందికి సీట్లు నిరాకరించడంతో.. వారంత బీజేపీ గూటికి చేరుతున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ సైతం పంజాబ్‌లో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే రాష్ట్రాల్లో రాజకీయ వేడి పెరగడంతో రాబోయే ఎన్నికలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. మరోవైపు SIR వ్యవహారంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు సంచలనంగా మారాయి. గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.



