Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో హౌస్‌లో పోటీ తీవ్రంగా పెరిగింది. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, మనస్పర్థలు, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో వర్షిణి, త్రిగుణ్ మధ్య మరోసారి పాత వివాదం తెరపైకి రాగా.. చివరి కెప్టెన్సీ టాస్క్‌లో దేబ్జానీ విజేతగా నిలిచింది. దీంతో ఈ సీజన్‌కు చివరి కెప్టెన్‌గా ఆమె ఎంపికైంది.

త్రిగుణ్ మాటలతో బాధపడిన వర్షిణి.. కన్నీళ్లతో ఆవేదన

గతంలో త్రిగుణ్ తనను ఉద్దేశించి చేసిన క్యారెక్టర్ వ్యాఖ్యలు వర్షిణిని మరోసారి కలచివేశాయి. ఈ విషయాన్ని గుర్తుచేసుకున్న ఆమె.. అసలు తాను ఎలాంటి తప్పు చేశానని తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడావంటూ త్రిగుణ్‌ను ప్రశ్నించింది. బయటైనా, హౌస్‌లో అయినా తాను అలాంటి పనులు చేయడం ఎప్పుడైనా చూశావా అని నిలదీసింది. తన క్యారెక్టర్ గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నిస్తూ భావోద్వేగానికి గురైంది. మరోవైపు త్రిగుణ్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. వర్షిణి వ్యక్తిత్వాన్ని తప్పుబట్టే ఉద్దేశం తనకు లేదని, ఫ్రెండ్‌షిప్ విషయంలో ఆమె వ్యవహరించిన తీరును ఉద్దేశించే అలా మాట్లాడానని చెప్పాడు. అయినప్పటికీ వర్షిణి మనసులోని బాధ మాత్రం తగ్గలేదు.త్రిగుణ్‌తో వాదన అనంతరం వర్షిణి తన బాధను ముకేశ్ గౌడతో పంచుకుంది.దీంతో ఈ ఎపిసోడ్‌లో వర్షిణి ఎమోషనల్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

చివరి కెప్టెన్సీ టాస్క్‌లో దేబ్జానీ విజయం

మరోవైపు హౌస్‌లో చివరి కెప్టెన్సీ పోటీ కూడా ఉత్కంఠగా సాగింది. ముందుగా తుది కెప్టెన్సీ టాస్క్‌లో పాల్గొనే కంటెస్టెంట్‌ను ఎంపిక చేసేందుకు రామ్ ప్రసాద్, ముకేశ్, త్రిగుణ్, వంశీ మధ్య పోటీ నిర్వహించారు. ఇందులో రామ్ ప్రసాద్ విజయం సాధించి తదుపరి దశకు అర్హత సాధించాడు. ఆ తర్వాత ఆర్కే, రామ్ ప్రసాద్, సుధీర్, నరేష్, శివ కుమార్, దేబ్జానీ, అమన్ మధ్య అసలైన కెప్టెన్సీ పోటీ జరిగింది. ఒక్కో రౌండ్‌లో ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ వచ్చారు. చివరికి దేబ్జానీ, ఆర్కే మాత్రమే మిగిలారు. ఈ సమయంలో హౌస్‌లోని ఇతర సభ్యులు దేబ్జానీకి మద్దతు పలకడంతో ఆమె విజయం ఖరారైంది. దీంతో బిగ్ బాస్ తెలుగు 10 సీజన్‌కు చివరి కెప్టెన్‌గా దేబ్జానీ నిలిచింది. చివరి కెప్టెన్సీని దక్కించుకోవడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఈ వారం ఎలిమినేషన్ ఎవరికి..? డేంజర్ జోన్‌లో ముగ్గురు

ఇక ఈ వారం ఎలిమినేషన్‌పై కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బయటకు వస్తున్న ప్రైవేట్ ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం వంశీ, వర్షిణి మధ్య ఎలిమినేషన్ పోటీ ఉండే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అయితే రామకృష్ణ కూడా డేంజర్ జోన్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓటింగ్ లెక్కలను బట్టి చూస్తే వర్షిణి, వంశీ, రామకృష్ణలలో ఒకరు ఈ వారం హౌస్‌ను వీడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ వారం ఎలిమినేషన్‌లో ఎవరు బయటకు వెళ్తారు..ఫైనల్‌కు చేరుకునే కంటెస్టెంట్లు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.