ఖాకీ చాటున కక్కుర్తి..రూ.1.70 లక్షలు స్వాహా
Hyderabad Police Constable Arrested: హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్‌లో చేతివాట ప్రదర్శించిన కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కేసులో నిందితుడి ఫోన్ నుంచి రూ.1.70 లక్షలు ట్రాన్స్ఫర్ చేయించుకోవడంపై అధికారులు విచారణ చేసిన అదుపులోకి తీసుకున్నారు.

Hyderabad Police Constable Arrested: ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు ఉద్యోగి కాస్తా కక్కుర్తికి పాల్పడ్డాడు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులనే తన సొంతానికి వాడుకున్నాడు. సీజ్ చేసిన మొబైల్ ఫోన్‌లోని ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా ఏకంగా రూ.1.70 లక్షలను తన బంధువుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా అదే కేసులో స్వాధీనం చేసుకున్న 12 తులాల బంగారు ఆభరణాలను సైతం తాకట్టు పెట్టినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.
పోలీసు శాఖలో మొదలైన కలవరం
హైదరాబాద్‌లోని మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రవణ్ కుమార్ ఓ కేసు దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌తో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ మొబైల్‌లో ఉన్న ఆన్‌లైన్ బ్యాంకింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకుని రూ.1.70 లక్షలను తన బంధువులకు చెందిన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసినట్లు గుర్తించారు. అదేవిధంగా అదే కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్న 12 తులాల బంగారు ఆభరణాలను కూడా శ్రవణ్ కుమార్ తాకట్టు పెట్టినట్లు విచారణలో వెల్లడైంది. కేసు దర్యాప్తులో భాగంగా భద్రపరచాల్సిన సొత్తును కాపాడాల్సిన బాధ్యతలో ఉన్న కానిస్టేబుల్‌నే ఇలా అక్రమాలకు పాల్పడటం పోలీసు శాఖలో కలకలం రేపింది.
కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
ఈ వ్యవహారంపై మీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆరోపణల నేపథ్యంలో కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతలో ఉన్న పోలీసు సిబ్బందే కేసుల్లో స్వాధీనం చేసుకున్న సొత్తుపై కన్నేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రజల ఆస్తులను రక్షించాల్సిన పోలీసులు ఇలా చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
పెళ్లి పేరుతో మోసం.. ఇన్స్‌స్పెక్టర్ బాలస్వామి అరెస్ట్
తనకు ఇప్పటికే వివాహమైందన్న విషయాన్ని గోప్యంగా ఉంచిన ఓ పోలీస్ సీఐ.. భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న మరో మహిళకు దగ్గరయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి దాదాపు తొమ్మిదేళ్ల పాటు లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. నల్లగొండ జిల్లాకు చెందిన బాధిత మహిళకు 2008లో సాయికుమార్‌తో వివాహమైంది. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగం లభించడంతో 2009లో భర్త, కుమారుడితో కలిసి హైదరాబాద్‌కు వచ్చి సైదాబాద్‌లో నివాసం ఏర్పరుచుకున్నారు. పెళ్లి విషయాన్ని ప్రస్తావించినప్పుడల్లా ఏదో ఒక కారణం చెబుతూ తప్పించుకుంటుండటంతో బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు.. ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్‌లో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న బాలస్వామిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.



