మీరు తాగే పాలు గేదె నుంచి వచ్చినవేనా..?
Hyderabad Milk Adulteration: హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నంలో కెమికల్స్‌తో పాలు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు పాలు తయారు చేస్తున్న విధానం చూసి అధికారులు ఆశ్చర్యపోయారు.

Hyderabad Milk Adulteration: పొద్దున్నే నిద్రలేవగానే ఇంటి ముందు పాలవాడి కోసం ఎదురుచూడటం చాలామంది ఇళ్లలో నిత్యకృత్యం. పాల క్యాన్‌తో అపార్ట్మెంట్ ముందుకు వచ్చిన పాలవాడిని చూడగానే ఒక్కొక్కరుగా బయటకు వచ్చి క్యూ కడతారు. ఫ్రెష్ పాలు.. స్వచ్ఛమైన గేదె పాలు.. ఫామ్ నుంచి నేరుగా తీసుకొచ్చిన పాలు అంటూ పాలవాడు చెప్పే మాటలను నమ్మి లీటర్ల కొద్దీ పాలు కొనుగోలు చేస్తుంటాం. ఆ పాలతోనే పిల్లలకు పాలు పట్టిస్తాం. పెద్దలకు కాఫీలు, టీలు తయారు చేస్తాం. కానీ మనం ఎంతో నమ్మకంతో తాగుతున్న ఆ పాలు నిజంగానే గేదె నుంచి వచ్చాయా.. లేక రసాయనాలతో తయారైన కల్తీ పాలా అన్న అనుమానం ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను కలవరపెడుతోంది.
కెమికల్స్‌తో పాలు తయారు చేస్తున్న గ్యాంగ్
పాలు అంటే స్వచ్ఛతకు ప్రతీక. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ నిత్యం ఉపయోగించే ఆహార పదార్థం. అలాంటి పాలలోనే కల్తీ జరుగుతోందన్న విషయం ఆందోళన కలిగిస్తోంది. బయటకు చూడటానికి తెల్లగా, పాలలాగే కనిపిస్తున్నా.. వాటి వెనుక ఏ పదార్థాలు కలిశాయో వినియోగదారులకు తెలియని పరిస్థితి నెలకొంది. పాలవాడు చెప్పే మాటలు నమ్మి కొనుగోలు చేస్తున్న కుటుంబాలు తెలియకుండానే కల్తీ పాల బారిన పడుతున్నాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారంలో కల్తీ పాల తయారీ కేంద్రం వెలుగులోకి వచ్చింది. కల్తీ పాలు తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఎస్వోటీ పోలీసులు రంగంలోకి దిగారు. సదరు కేంద్రంపై దాడులు నిర్వహించి అక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని బయటపెట్టారు. హైడ్రోజన్ పెరాక్సైడ్, పాలపొడి కలిపి కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
100 లీటర్ల కల్తీ పాలు స్వాధీనం
పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 100 లీటర్ల కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 35 పాలపొడి ప్యాకెట్లను కూడా గుర్తించి సీజ్ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. నిత్యం ప్రజలు వినియోగించే పాల పేరుతో ఇలాంటి కల్తీ వ్యవహారం సాగుతుండటం కలకలం రేపుతోంది. ప్రతిరోజూ ఉదయం ఇంటికి వచ్చే పాల క్యాన్‌ను చూసి అది స్వచ్ఛమైన పాలేనని నమ్మడం సహజం. కానీ పోచారంలో బయటపడిన ఘటన ఆ నమ్మకంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. పాలు కొనుగోలు చేస్తున్నప్పుడు వాటి నాణ్యతపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తుచేస్తోంది. ముఖ్యంగా పిల్లలకు, కుటుంబ సభ్యులకు అందించే పాలు కల్తీకి గురైతే ఎంతటి ఆందోళన కలుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు గేదె పాలు, ఫ్రెష్ పాలు అంటూ నమ్మకంగా కొనుగోలు చేసిన పాల వెనుక ఇలాంటి అక్రమాలు ఉన్నాయా అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. తెల్లగా కనిపించే ప్రతి ద్రవం స్వచ్ఛమైన పాలు కాదనే చేదు నిజాన్ని పోచారంలో వెలుగుచూసిన ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
ఆలోచించి పాలు పోయించుకోండి
బయట నుంచి పాలు తెచ్చుకునే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు పాటించాలి. పాలు కొనుగోలు చేసే ముందు వాటి నాణ్యత, స్వచ్ఛతను పరిశీలించుకోవాలి. పాలు కల్తీ అయ్యాయేమో, వాటిలో నీళ్లు లేదా ఇతర పదార్థాలు కలిశాయేమో గమనించాలి. పాలు తీసుకొచ్చే పాత్రలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకు నమ్మకమైన వ్యక్తులు లేదా డెయిరీల నుంచి మాత్రమే పాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా ఇబ్రహీంపట్నంలో తయారు చేసిన పాలు తాగితే ప్రాణాలు పోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.



