Delhi Traders Letter to Rahul Gandhi: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో నవంబర్ 1న నిరసన ర్యాలీ నిర్వహించేందుకు సర్వం సిద్ధమవుతోంది. ఈ సభకు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి సుమారు పది లక్షల మంది హాజరవుతారని ఇండియా కూటమి నేతలు అంచనా వేస్తున్నారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరగనున్న ఇండియా కూటమి సభపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సభకు సంబంధించిన ఏర్పాట్లను కాంగ్రెస్ నేతలు పర్యవేక్షిస్తుండగా.. జనసమీకరణలో నేతలు తలమునకలై ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) ఢిల్లీ ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. ఢిల్లీలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభపై మరోసారి పునరాలోచించాలని వ్యాపారులు కోరారు.

10 లక్షల మంది.. 20 వేల వాహనాలు: వ్యాపారులు

ఢిల్లీలో చేపట్టబోయే కార్యక్రమానికి పది లక్షల మంది హాజరైతే.. సుమారు 20 వేల వాహనాలు రహదారులపైకి వస్తాయని రాహుల్ గాంధీకి (Rahul Gandhi) రాసిన లేఖలో వ్యాపారులు పేర్కొన్నారు. లక్షలాది మంది ప్రజలు ఢిల్లీలోకి వస్తే తాము వ్యాపారాలు ఎలా చేసుకోవాలని ప్రశ్నించారు. దీపావళి పండుగ సీజన్‌లో సుమారు రూ.10 వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని.. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నిరసన ర్యాలీని వాయిదా వేయాలని కోరారు. అక్టోబర్ 10 తర్వాత నిరసన ర్యాలీ నిర్వహిస్తే వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతుందని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అభిప్రాయపడింది. లేదంటే ఢిల్లీలో నిర్వహించాలనుకుంటున్న ఇండియా కూటమి ర్యాలీ వేదికను మార్చుకోవాలని లేఖలో కోరింది. రాంలీలా మైదానానికి సమీపంలోనే అత్యంత రద్దీగా ఉండే సెంట్రల్ ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాలు ఉన్నాయని పేర్కొంది.

“వ్యాపార సమయాల్లో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడతాయి”

దీపావళి సమయంలో ఢిల్లీలో వ్యాపారులకు ఇది కీలకమైన సమయమని రాహుల్ గాంధీకి (Rahul Gandhi) రాసిన లేఖలో ప్రస్తావించారు. రాంలీలా మైదానానికి సమీపంలో చాందినీ చౌక్, సదర్ బజార్, చావ్రీ బజార్, కశ్మీరీ గేట్‌తో పాటు అనేక వ్యాపార సముదాయాలు ఉన్నాయని తెలిపారు. ఇండియా కూటమి చేపట్టనున్న ర్యాలీ వల్ల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ పేర్కొంది. వ్యాపారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంటే ఎంతోమందికి మేలు జరుగుతుందని అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే.. ఢిల్లీలోని వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని రాహుల్ గాంధీ (Rahul Gandhi) సోమవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దేశంలోని యువత ఓట్లను జ్ఞానేశ్ కుమార్ తొలగిస్తున్నారని.. దీనివల్ల అనేక మందికి అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేస్తే సమస్య పరిష్కారమవుతుందని తన పోస్టులో పేర్కొన్నారు.

శివుడి చిత్రాన్ని పోస్ట్ చేసిన రాహుల్ గాంధీ

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన పోస్టు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎస్‌ఐఆర్ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘంతో వివాదం కొనసాగుతున్న వేళ.. శివుడికి ప్రతీకగా భావించే మూడు అడ్డగీతల విభూతి, నిలువుగా ఉన్న ఎర్రటి కుంకుమ రేఖతో కూడిన చిత్రాన్ని ఆయన పంచుకున్నారు. “ఇవి శివుని సంకల్పం, జ్ఞానం, క్రియ అనే మూడు శక్తులకు ప్రతీకలని పండితులు చెబుతుంటారు” అని పేర్కొన్నారు. ఈ పోస్టుకు సంస్కృతంలో “సత్యం శివం సుందరం” అనే వ్యాఖ్యను జోడించారు. అంతేకాకుండా, అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దాఖలైన పరువు నష్టం కేసులో సుల్తాన్‌పూర్ కోర్టు రాహుల్ గాంధీని నిర్దోషిగా ప్రకటించింది. కోర్టు తీర్పును ఉద్దేశించే రాహుల్ ఈ పోస్టు చేశారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.