YS Jagan Issues: వైసీపీ అధ్యక్షుడు జగన్ తన మేనకోడలు అంజలిరెడ్డి పెళ్లికి యలహంక ప్యాలెస్‌ను ఇవ్వనంటూ చేస్తున్న వ్యవహారంపై రాజకీయంగా రచ్చ జరుగుతోంది. ఆస్తుల గొడవలు ఎలా ఉన్నా.. కళ్యాణ వేదికపై కక్ష సాధింపులు తగవనే మాట వినిపిస్తోంది. ఇది కేవలం కుటుంబ వివాదం కాదు.. ప్రజాక్షేత్రంలో వైసీపీ (YSRCP) నైతికతకు జరుగుతున్న నష్టం. మేనకోడలి పెళ్లికి భద్రతా కారణాలను సాకుగా చూపడం హాస్యాస్పదమని, పార్టీ పరువు గంగలో కలిసేలా ఉందని సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి. రక్తం పంచుకుని పుట్టిన బంధాలు శాశ్వతం. కానీ జగన్ దీనికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. బంధాల కంటే ఆస్తులే ముఖ్యమనుకుంటే.. పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకం ఎలా నిలబడుతుందనే ప్రశ్న వస్తోంది. సొంత చెల్లిని రోడ్డుకు ఈడ్చి.. మేనకోడలి పెళ్లిని అడ్డుకునేలా వ్యవహరిస్తే.. సమాజం క్షమించదని, కంస మనస్తత్వం రాజకీయ పతనానికి నాంది పలుకుతుందని సొంత పార్టీలోనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఎన్నికలను అడ్డుకోవాలని చూసిన వైసీపీ

రాజకీయాల్లో కాలం కలిసిరానప్పుడు సైలెంట్‌గా ఉండాలి. పరిణామాలు తమకు వ్యతిరేకంగా మారుతున్నాయంటే ఆత్మపరిశీలన చేసుకోవాలి. కాంగ్రెస్‌లో ఇటువంటి నేతలు గతంలో ఎక్కువగా కనిపించేవారు. అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకునే విధంగా వ్యవహరించేవారు. సమయం తమది కానప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియనట్టుగా తమ పని తాము చేసుకునేవారు. అదే కుటుంబం నుంచి, కాంగ్రెస్‌లో తిరుగులేని నేతగా ఎదిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్‌కు (YS Jagan) పరిస్థితులు అంత సానుకూలంగా లేవు. 2024 ఎన్నికల్లో ప్రజలు 11 స్థానాలు ఇచ్చి, ప్రతిపక్ష హోదా దక్కకుండా పక్కన కూర్చోబెట్టారు. ఈ ఇబ్బందికర పరిస్థితి నుంచి వైసీపీ తేరుకుంటోంది. పరాజయానికి అసలైన కారణం ఏమిటో తెలుసుకోకుండా ఈవీఎంలపై నెపం నెట్టి తప్పించుకున్నప్పటికీ.. జగన్ వ్యవహారశైలి పార్టీ నేతలకు ఇప్పటికీ మింగుడుపడడం లేదు. చివరకు స్థానిక ఎన్నికలు జరగకుండా అడ్డుకునేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు, వారే దాడులు చేసి కోర్టుకు ఎక్కిన విషయాన్ని టీడీపీ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లింది. సుప్రీంకోర్టుకు వెళ్లి ఎన్నికలను నాలుగు రోజులు ఆలస్యం చేసింది. కానీ, ఎన్నికలను వైసీపీ అడ్డుకుంటోందన్న అధికార పార్టీ చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది.

జగన్ లేఖపై తీవ్ర విమర్శలు

దీంతో పాటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల కుమార్తె అంజలిరెడ్డి పెళ్లి వేదికను జగన్ (YS Jagan) వివాదాస్పదం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మేనకోడలి పెళ్లిని రాజకీయం చేయడం వైసీపీకి వ్యతిరేకంగా మారుతోంది. నవంబర్ 25న జరిగే వివాహాన్ని బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో చేయొద్దన్న జగన్ ఆదేశంపై రగడ జరుగుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన యలహంక ప్యాలెస్‌లో, తనకు ఇచ్చిన ఇంటిలో వివాహం నిర్వహించాలన్నది షర్మిల నిర్ణయం. వెడ్డింగ్ కార్డుల్లో వివాహ వేదికను యలహంక ప్యాలెస్ అని ముద్రించారు. కానీ, జగన్ (YS Jagan) ఈ ప్యాలెస్ తనదేనని, ఇది అత్త పేరిట ఉందని మొండి వాదనకు దిగారనే విమర్శలు ఉన్నాయి. తన భద్రతా కారణాలతో యలహంక ప్యాలెస్‌లో మేనకోడలి పెళ్లి చేయవద్దని జగన్ షర్మిలకు లేఖ రాశారు. పెళ్లికి వివిధ వర్గాల వ్యక్తులు రావడం, ప్యాలెస్ ఫొటోలు, వీడియోలు తీసి బయటకు పంపితే తన భద్రతకు తీవ్ర ముప్పు కలుగుతుందని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ లేఖపైనా నెటిజన్లు జగన్‌ను తప్పుపట్టారు. వైసీపీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ విషయంలోనూ జగన్‌కు కాలం కలిసిరాలేదు. పగవారు, పరాయివారు కూడా మేనకోడలి పెళ్లికి అడ్డుపడరన్న విమర్శలు జగన్‌కు ఎలా ఉన్నా.. పార్టీ నేతలకు తలనొప్పిగా మారాయి.

ఎన్నికల సమయంలో మేనకోడలి వివాదం

జగన్‌లో రాక్షసత్వం మినహా హుందాతనం లేదనే మాట వినిపిస్తోంది. నిలువెల్లా విషమే ఉందనే వ్యాఖ్యలు ఉన్నాయి. ఫ్యాక్షన్ మనస్తత్వం, రాజకీయాల్లో కక్షలు కార్పణ్యాలు రగిలితే ఆ మంటల్లో చలి కాచుకుని ఆనందించే పైశాచికత్వం జగన్‌లో (YS Jagan) ఉందని విమర్శకులు అంటున్నారు. హుందాగా వ్యవహరించమని సలహాలు ఇస్తున్న పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వినిపిస్తోంది. అన్ని వైపుల నుంచి జగన్‌కు సమస్యలు చుట్టుముట్టాయి. స్థానిక ఎన్నికల సమయంలో మేనకోడలి వివాహాన్ని వివాదాస్పదం చేయడం పార్టీకి నష్టమని వైసీపీ (YSRCP) సీనియర్ నేత విశ్లేషించినట్లు సమాచారం. ఆస్తి కోసం చెల్లిని, తల్లిని కోర్టుకు ఈడ్చారనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. తండ్రి ఆస్తిని చెల్లికి పంచకుండా జగన్ (YS Jagan) వ్యవహరిస్తున్న తీరుపైనా పార్టీలో అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తమవుతోంది. కుటుంబపరమైన బంధాలు, అనుబంధాలు, మమతానురాగాలకు మచ్చగా మారాయనే విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారం జగన్‌కు భవిష్యత్తులోనూ రాజకీయంగా ఇబ్బందులను తెచ్చిపెడుతుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

వైసీపీ నేతల్లో మొదలైన ఆందోళన..?

అందుకే కాలం కలిసిరానప్పుడు సైలెంట్‌గా ఉండాలని, సహనం, ఓర్పుతో వ్యవహరించాలనేది పెద్దల సలహా. కానీ, ఈ మాటలను చెవికెక్కించుకోని జగన్‌కు (YS Jagan) అన్ని విషయాల్లో అనర్థాలు, పరాభవాలే ఎదురవుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా జగన్‌తో పాటు పార్టీకి నష్టమనే మాట వినిపిస్తోంది. మొండిగా, పట్టుదలతో ముందుకు సాగితే 2029 ఎన్నికల్లో నష్టం తప్పదనేది వైసీపీ నేతల విశ్లేషణగా చెబుతున్నారు. అధికారంపై ఆశలు పెట్టుకున్న జగన్ మునగడంతో పాటు తమ అందరినీ ముంచుతున్నారనే ఆవేదన పార్టీ నేతల్లో ఉందని తెలుస్తోంది. జగన్ చేష్టలతో వైసీపీని నమ్ముకుంటే నట్టేట మునిగినట్టేననే ఆందోళన పార్టీ నేతల్లో కనిపిస్తోంది. జగన్ మొండి వైఖరితో వైసీపీ (YSRCP) శ్రేణులన్నీ పార్టీకి దూరమయ్యేలా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మేనకోడలి పెళ్లి వేదికపై జరుగుతున్న రాజకీయం.. రాబోయే రోజుల్లో వైసీపీ పునాదులను కదిలించే సంకేతమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పార్టీ విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోందనే ఆవేదన పార్టీ నేతల్లో ఉంది. దీని నుంచి ఎలా బయటపడాలో తెలియక తలలు పట్టుకుంటున్నారని సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో భవిష్యత్ పరిణామాలను పరిశీలించాల్సి ఉంది.