Two Helicopters Collide in Nepal: హిమాలయ పర్వత సానువుల్లో మరో విషాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో నిత్యం సందడిగా ఉండే నేపాల్‌లోని సోలుఖుంబు ప్రాంతంలో రెండు హెలికాప్టర్లు ప్రమాదానికి గురయ్యాయి. ఫెరిచే హెలిప్యాడ్‌పై దిగేందుకు సిద్ధమవుతున్న సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఒక భారతీయ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో హెలిప్యాడ్ పరిసరాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మంగళవారం ఉదయం ల్యాండింగ్‌కు కొద్ది క్షణాల ముందు రెండు హెలికాప్టర్ల రోటర్లు ఒకదానికొకటి తగలడంతో ప్రమాదం సంభవించినట్లు సమాచారం. ఫిష్‌టెయిల్ ఎయిర్‌కు చెందిన హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న భారతీయుడు వసంత్ కుమార్ బలరామరామడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదే హెలికాప్టర్‌లో ఉన్న భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ పౌరుడు శైలేష్ క్రిష్ణ పటేల్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను మెరుగైన వైద్యం కోసం కాఠ్మూండుకు తరలించారు. మరోవైపు ఎయిర్ డైనాస్టీకి చెందిన హెలికాప్టర్ పైలట్ కూడా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు.

పరుగులు తీసిన టూరిస్టులు

రెండు హెలికాప్టర్లు తమ కళ్ల ముందే ప్రమాదానికి గురికావడంతో హెలిప్యాడ్ సమీపంలో ఉన్నవారు ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మృతుడి స్వస్థలం భారత్‌లోని ఏ రాష్ట్రమనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నేపాల్‌లో హెలికాప్టర్ సేవలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఎవరెస్ట్ సహా హిమాలయ పర్వత ప్రాంతాలను సందర్శించే పర్యాటకులు, పర్వతారోహకుల రవాణాతో పాటు నిత్యావసర సరుకుల సరఫరా, అత్యవసర వైద్య తరలింపులకు కూడా వీటినే ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే ఎత్తైన పర్వతాలు, ఇరుకైన లోయలు, అకస్మాత్తుగా మారిపోయే వాతావరణం విమాన ప్రయాణాలకు తీవ్ర సవాళ్లుగా మారుతున్నాయి. ఇదిలా ఉంటే, ఇటీవల ఉత్తరాఖండ్‌లోని చమోలీ ప్రాంతంలోనూ ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బద్రీనాథ్ నుంచి దేహ్రాదూన్‌కు వెళ్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడంతో పైలట్ సహా ఆరుగురు మృత్యువాత పడ్డారు. వరుసగా చోటుచేసుకుంటున్న ఈ ఘటనలు పర్వత ప్రాంతాల్లో హెలికాప్టర్ ప్రయాణాల భద్రతపై మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి.