కర్ణాటక ఎఫెక్ట్.. తెలంగాణ కాంగ్రెస్లో ఎమ్మెల్సీ ఎన్నికల టెన్షన్..!
Telangana Congress MLC Elections: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలపై అధిష్టానం ఫోకస్ పెంచింది. ఓటర్ల నమోదు ప్రక్రియపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరో వారం రోజులు మాత్రమే ఓటరు నమోదుకు గడువు ఉంది.

Telangana Congress MLC Elections: కర్ణాటకలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్లో (Congress) చర్చనీయాంశంగా మారాయి. అక్కడ నాలుగు స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించకపోవడంతో తెలంగాణ నేతల్లో ఆందోళన మొదలైంది. నేతల మధ్య సమన్వయ లోపం, ఓటర్ల నమోదు ప్రక్రియపై నిర్లక్ష్యం ఓటమికి ప్రధాన కారణాలుగా కాంగ్రెస్ అధిష్ఠానం గుర్తించినట్లు సమాచారం. ఇదే పరిస్థితి తెలంగాణలోనూ పునరావృతం కాకుండా ఉండేందుకు పార్టీ నాయకత్వం అప్రమత్తమైంది. త్వరలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
కర్ణాటక ఫలితాల ప్రభావం.. తెలంగాణ నేతల్లో ఆందోళన!
ఇటీవల కర్ణాటకలో జరిగిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress) ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేకపోయింది. డీకే శివకుమార్ వంటి కీలక నేతలు ఉన్నప్పటికీ పార్టీకి ఆశించిన ఫలితాలు దక్కకపోవడంతో ఏఐసీసీ ఈ వ్యవహారంపై సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సమీక్షలో ప్రధానంగా నేతల మధ్య సమన్వయ లోపం, అభ్యర్థుల ఎంపికతో పాటు ఓటర్ల నమోదు ప్రక్రియపై సరైన దృష్టి పెట్టకపోవడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. మరోవైపు బీజేపీ, జేడీఎస్ కూటమి నేతలు ఓటర్ల నమోదు ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో నాలుగు స్థానాలూ ఎన్డీఏ కూటమి ఖాతాలోకి వెళ్లినట్లు కాంగ్రెస్ (Congress) వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ (Congress) అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది.
అభ్యర్థుల ఎంపిక ఓకే.. ఓటర్ల నమోదు సంగతేంటి..?
రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్, ఖమ్మం-నల్గొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సామ రామ్మోహన్రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తంరెడ్డిలను అభ్యర్థులుగా ప్రకటించింది. అయితే ఓటర్ల నమోదు ప్రక్రియకు మరో వారం రోజులే గడువు ఉండటంతో పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు సుమారు 50 శాతం మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు సమాచారం. గ్రామస్థాయి నుంచి ఓటర్ల నమోదును వేగవంతం చేయాలని అభ్యర్థులు కోరుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో నాయకులు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓటర్ల నమోదు ప్రక్రియలో కొందరు కాంగ్రెస్ నాయకులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా గాంధీభవన్ వర్గాల్లో చర్చకు వస్తున్నాయి. ఇప్పటికే రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నమోదును వేగవంతం చేయాలని సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆశించిన స్పందన లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కర్ణాటకలో జరిగిన పొరపాట్లు తెలంగాణలో జరగకుండా చర్యలు..
కర్ణాటకలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ ఓటమి పాలవడంతో తెలంగాణ నేతలపై పార్టీ అధిష్ఠానం ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. ఎలాగైనా రెండు స్థానాలను గెలుచుకోవాలని పార్టీ నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఓటర్ల నమోదు ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని గాంధీభవన్ నుంచి ఎమ్మెల్యేలు, కీలక నాయకులకు ఫోన్లు వెళ్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో ఎదురైన అనుభవాలు తెలంగాణలో పునరావృతం కాకుండా గాంధీభవన్లో ప్రత్యేక వార్రూమ్ ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) హైదరాబాద్కు తిరిగి వచ్చిన తర్వాత రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై మరింత దృష్టి సారించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నేతల మధ్య సమన్వయ లోపం ఎక్కడ ఉందో గుర్తించి, ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటంతో ఈ స్థానంపై కాంగ్రెస్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ హామీలను గ్రాడ్యుయేట్లలోకి తీసుకెళ్లాలని సీఎం సూచన
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు, భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలను గ్రాడ్యుయేట్లకు వివరించాలని సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం. అంతేకాకుండా త్వరలో తీసుకురానున్న ఎంప్లాయ్మెంట్ పాలసీ గురించి కూడా పట్టభద్రులకు వివరించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ప్రతిరోజూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక నాయకులతో జూమ్ సమావేశాలు నిర్వహించి ఎన్నికల సన్నద్ధతను సమీక్షించాలని సీఎం మౌఖికంగా సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్కు (Congress) అప్రమత్తత సంకేతాలుగా మారాయి. ఓటర్ల నమోదు నుంచి ప్రచారం వరకు ప్రతి అంశంపైనా ప్రత్యేక దృష్టి సారిస్తూ, రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలను పార్టీ నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. కర్ణాటకలో ఎదురైన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని తెలంగాణలో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.



