Police Gun Firing Accused Hemanth: రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఉన్మాది ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన ఘటన ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిందితుడిని హేమంత్‌ని ఎన్‌కౌంటర్ చేయాలని విద్యార్థినులు, యువత, ప్రజాసంఘాలు, మహిళలు డిమాండ్ చేసిన నేపథ్యంలో.. పోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన హేమంత్‌కు అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. శనివారం నాడు ఉదయం సమయంలో స్కూల్లోకి రంపంతో వెళ్లిన నిందితుడు హేమంత్.. నేరుగా పదోతరగతి గదిలోకి వెళ్లి విద్యార్థినిపై దాడికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన మరో విద్యార్థినిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.

రాప్తాడు ఘటనలో లోకేశ్‌ మార్క్‌ చూపించారా..?

బెంగళూరు మణిపాల్ ఆస్పత్రికి రాప్తాడు బాలికను తరలించిన తర్వాత మంత్రి లోకేశ్ స్వయంగా ఆస్పత్రి నిర్వాహకులతో మాట్లాడారు. విద్యార్థినికి అవసరమైన సాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని భరోసా కల్పించారు. అంతేకాకుండా నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని బాలిక తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. అయితే బాలికకు సుధీర్ఘమైన ఆపరేషన్లు చేసిన తర్వాత ప్రాణాపాయం నుంచి బయటపడింని తెలిసిన వెంటనే లోకేశ్ యాక్షన్‌లోకి దిగారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి చట్టం ప్రకారం శిక్షించాలని అనంతపురం జిల్లా పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అందులో భాగంగా అనంతపురం జిల్లా ఆత్మకూరు అడవుల్లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ప్రత్యేక బలగాలు ఆత్మకూరు అడవిని జల్లెడపట్టిన పోలీసులు ఉన్మాది హేమంత్‌ను గుర్తించారు. అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై రాళ్ల దాడి చేయడంతో పాటు.. సీఐపై పదునైన కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు హేమంత్ రెండుకాళ్లపై కాల్పులు జరిపారు. ఆరు బుల్లెట్లు దిగడంతో చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రి వద్ద బాలిక బంధువులతో పాటు స్థానికులు పెద్దఎత్తున చేరుకున్నారు. హేమంత్‌ను ఎన్‌కౌంటర్ చేయాలంటూ నినాదాలు చేశారు.

మణిపాల్ వైద్యులు సంతోషకర వార్తను అందించారు: మంత్రి లోకేష్

బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రి వైద్యులు ఎంతో సంతోషాన్ని కలిగించే వార్తను అందించారని మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా తెలిపారు. రాప్తాడులో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని, వైద్యుల సూచనలను అర్థం చేసుకుని స్పందిస్తోందని వెల్లడించారు. బాలిక ఆరోగ్యం మెరుగుపడుతోందన్న వార్త తనకే కాకుండా, ఆ విద్యార్థిని త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ ఎంతో ఊరటనిచ్చే శుభవార్త అని పేర్కొన్నారు. బాలిక త్వరగా పూర్తిగా కోలుకుని, మళ్లీ చిరునవ్వులతో మన ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు నారా లోకేశ్‌ తెలిపారు.

బాలిక కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలి: జగన్

రాప్తాడు ఉన్మాది దాడి ఘటనలో తీవ్రంగా గాయపడి, బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత విద్యార్థినిని మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పడం సంతోషంగా ఉందన్నారు. వెంటనే బాలిక కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. బాలిక వైద్యానికి ప్రభుత్వం తరఫున సాయం అందించకపోతే తామే అందిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో గంజాయి, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయని ఆరోపించారు. ప్రభుత్వ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విమర్శించారు. స్కూల్లోకి రంపం తీసుకువచ్చాడంటే శాంతిభద్రతలు ఏ విధంగా క్షీణించిపోయాయో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోందని, ఇదేనా రెడ్‌బుక్ రాజ్యాంగం అంటూ జగన్ ప్రశ్నించారు.

బాలికకు ఏపీ ప్రభుత్వం అండ.. వైద్య చికిత్స కోసం రూ.2 లక్షల సాయం

రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక గోపికకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అండగా నిలిచింది. ఆమె వైద్య చికిత్స కోసం తక్షణ సాయంగా రూ.2 లక్షలు విడుదల చేసింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి ఈ మొత్తాన్ని చెల్లించారు. మరోవైపు మంత్రి సత్యకుమార్ తన వ్యక్తిగత హోదాలో బాధిత కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం పొందుతున్న గోపిక ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. బాలిక రక్తపోటు సాధారణ స్థితికి చేరుకోవడంతో పాటు కిడ్నీల పనితీరు కూడా మెరుగుపడినట్లు వైద్యులు వెల్లడించారు. సకాలంలో స్పందించి బాలిక ప్రాణాలు నిలబెట్టిన అనంతపురం జీజీహెచ్ వైద్య బృందంతో పాటు ప్రస్తుతం చికిత్స అందిస్తున్న బెంగళూరు మణిపాల్ వైద్యులను మంత్రి సత్యకుమార్ అభినందించారు. అనంతపురం జీజీహెచ్ వైద్యుల సేవలను ప్రశంసిస్తూ వైద్య విద్య సంచాలకులు ప్రశంసా పత్రాలు జారీ చేశారు.

హేమంత్ కాలిని తీసేయాల్సిందేనా..?

పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హేమంత్‌కు అనంతపురం ప్రభుత్వాస్పత్రి వైద్యులు చికిత్స అందించారు. హేమంత్ ఆరోగ్యంపై సూపరింటెండెంట్ మల్లీశ్వరి వివరాలు అందించారు.హేమంత్ ఆరోగ్యం బాగుందన్న సూపరింటెండెంట్.. నిందితుడి కాళ్లకు తీసిన ఎక్స్‌రేలో బుల్లెట్ల కనపడలేదని.. నిందితుడి కుడి కాలుకు తీవ్రగాయమైంది రక్త ప్రసరణలేదని . హేమంత్ కుడికాలు రక్త ప్రసరణలేక కుళ్లింది సగం కాలు తొలగించే పరిస్థితి రావచ్చన్నారు. నిందితుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అనస్తీషియా వైద్యుడు పరిశీలిస్తున్నామన్నారు. ఎక్స్‌రే రిపోర్టు, అనస్తీషియా వైద్యుడి నివేదిక పరిశీలించాక కాలు తొలగింపుపై నిర్ణయం తీసుకుంటామని సూపరింటెండెంట్ మల్లీశ్వరి స్పష్టం చేశారు.

ఉన్మాదికి ట్రీట్మెంట్ ఇవ్వొద్దు: బాలిక స్నేహితురాలు

రాప్తాడులో విద్యార్థినిపై అత్యంత పాశవికంగా దాడికి పాల్పడిన నిందితుడికి ఆస్పత్రిలో చికిత్స అందించడంపై బాధితురాలి స్నేహితురాలు లక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన స్నేహితురాలిపై దారుణంగా దాడి చేసిన వ్యక్తికి వైద్యం ఎలా అందిస్తారని ప్రశ్నించింది. ఇలాంటి నిందితులకు చికిత్స అందిస్తే తమలాంటి ఆడపిల్లల పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేసింది. ఉదయం తామంతా తరగతి గదిలో ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని లక్ష్మి తెలిపింది. ఉదయం 10:30 గంటల సమయంలో నిందితుడు ఒక్కసారిగా రంపంతో వచ్చి తన స్నేహితురాలిపై దాడికి పాల్పడ్డాడని కన్నీటిపర్యంతమైంది. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వ్యక్తికి పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారని తెలిసి బాధ కలిగిందని పేర్కొంది. నిందితుడిని అక్కడికక్కడే చంపేసి పాతిపెట్టి ఉంటే సంతోషించేవాళ్లమని లక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు నిందితుడిని చంపకపోతే తానే చంపుతానని వ్యాఖ్యానించింది. ఆస్పత్రిలో నిందితుడికి చికిత్స అందించకూడదని, అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. నిందితుడికి ప్రాణాలు కాపాడే చికిత్స అందించడం కాకుండా కఠిన శిక్ష విధించినప్పుడే తమకు న్యాయం జరిగినట్లవుతుందని ఆవేదన వ్యక్తం చేసింది.