Amit Shah in Hyderabad: కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఐటీసీ కాకతీయ హోటల్‌కు చేరుకున్న ఆయన పార్టీకి చెందిన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడంతో పాటు, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి అవసరమైన ప్రణాళికలను ఆయనకు అందజేసినట్లు సమాచారం. అంతేకాకుండా, త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ బీజేపీలో నేతల మధ్య విభేదాలను పక్కనపెట్టి, పార్టీ పటిష్టత కోసం పనిచేయాలని అమిత్ షా స్పష్టం చేసినట్లు కమలం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అమిత్ షా పాదయాత్రకు సర్వం సిద్ధం

పర్యటనలో భాగంగా జగ్జీవన్‌రామ్ విగ్రహం నుంచి ఎంజే మార్కెట్ వరకు అమిత్ షా పాదయాత్ర నిర్వహించనున్నారు. ‘లోక్‌తంత్ర బచావో- అరాచకత హటావో’ నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పాదయాత్ర ముగిసిన అనంతరం ఎంజే మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ సభకు బీజేపీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పాదయాత్ర జరిగే మార్గంతో పాటు బహిరంగ సభ ప్రాంగణంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తును కట్టుదిట్టం చేశారు. మరోవైపు, గత రెండు రోజులుగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై అమిత్ షా తన ప్రసంగంలో స్పందిస్తారా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ విమర్శలకు ఆయన ఎలాంటి కౌంటర్ ఇస్తారు..? ప్రతిపక్షాలపై ఏ అంశాలను ప్రస్తావిస్తారు…? తెలంగాణ, జాతీయ రాజకీయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు..? అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

అమిత్ షాను కలిసిన మెగాస్టార్ చిరంజీవి

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో బస చేసిన అమిత్ షాను చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి కలిశారు. ఈ సందర్భంగా సుమారు అరగంట పాటు అమిత్ షాతో చిరంజీవి ప్రత్యేకంగా చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ భేటీలో ప్రధానంగా సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలు, ఇటీవల విడుదలైన సినిమాలు, ప్రేక్షకుల నుంచి వాటికి లభిస్తున్న స్పందనతో పాటు తన తదుపరి ప్రాజెక్టుల గురించి చిరంజీవి వివరించినట్లు తెలుస్తోంది. అలాగే రామ్‌చరణ్ సినిమా కెరీర్, రాబోయే చిత్రాల గురించి కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. అమిత్ షాతో చిరంజీవి, రామ్‌చరణ్ భేటీ కావడం ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సమావేశం మర్యాదపూర్వక భేటీగానే జరిగినట్లు తెలుస్తోంది.

 

సీఈసీని మోదీ, అమిత్ షా కాపాడుతున్నారు: రాహుల్ గాంధీ

ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన ఇండియా కూటమి సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీ, అమిత్ షా, ఎన్నికల కమిషన్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను ప్రధాని మోదీ, అమిత్ షా ఇద్దరూ కలిసి కాపాడుతున్నారని ఆరోపించారు. ఆయన రాజీనామా చేసే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ పేరుతో దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను అన్యాయంగా తొలగించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓటర్ల హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేసినప్పుడే దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లూ సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని ప్రధాని మోదీ, అమిత్ షా రాజకీయాలు చేశారని విమర్శించారు. ఇప్పుడు ఏకంగా ఎన్నికల కమిషన్‌ను తమ గుప్పెట్లో పెట్టుకొని ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. అదానీ, అంబానీల ఆస్తులను పెంచేందుకే దళితులు, యువత, సామాన్య ప్రజల ఓట్లను తొలగిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును కాపాడేందుకు ఇండియా కూటమి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీ జీవితంలో ప్రధాని కాలేరు: అమిత్ షా

మరోవైపు, చండీగఢ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ తన జీవితంలో ఎప్పటికీ ప్రధాని కాలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాక్ పార్లమెంటులు నిర్వహించుకుంటూ, వాటిలో తానే ప్రధానమంత్రినని భావించి సంతోషపడాలంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన తప్పిదాలను ముందుగా రాహుల్ గాంధీ తెలుసుకోవాలని అమిత్ షా హితవు పలికారు. ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితాల సవరణపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని విమర్శించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ అంశంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అయితే, ప్రజా సమస్యలపై చర్చించాల్సిన ప్రతిపక్ష నేతలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ పనితీరుపై అనవసరమైన ఆరోపణలు చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని విమర్శించారు.