American election results: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు సొంత దేశ ప్రజలు గట్టి షాక్‌ ఇచ్చారు. తన దూకుడు నిర్ణయాలు, వివాదాస్పద విధానాలతో అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ట్రంప్‌కు మధ్యంతర ఎన్నికల ఫలితాలు ఊహించని ఎదురుదెబ్బగా మారాయి. టారిఫ్‌ల విధింపు, ఇరాన్‌తో యుద్ధం, విదేశాంగ విధానంలో అనుసరిస్తున్న వైఖరి, దేశీయంగా తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందనే సంకేతాలు ఈ ఎన్నికల ద్వారా వెలువడ్డాయి. ముఖ్యంగా సంప్రదాయంగా రిపబ్లికన్లకు కంచుకోటలుగా ఉన్న ప్రాంతాల్లోనూ డెమోక్రాట్లు విజయభేరి మోగించడం అమెరికా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. దీంతో ట్రంప్‌కు చెంపదెబ్బ కొట్టినట్లు అయింది. మొన్నటి వరకు తానే రాజు, తానే మంత్రి అన్నట్లు వ్యవహరించిన ట్రంప్‌ సర్కార్‌కు మిడ్‌ టర్మ్‌ ఎన్నికలు స్పీడు బ్రేకర్లు వేశాయి.

కాంగ్రెస్‌లో డెమొక్రాట్ల ఆధిపత్యం

మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌లోనూ ఆధిక్యం సాధించి కాంగ్రెస్‌పై పట్టు సాధించే దిశగా ముందుకెళ్లింది. ఈ పరిణామం ట్రంప్‌ ప్రభుత్వానికి రాజకీయంగా పెద్ద సవాలుగా మారనుంది. ప్రతినిధుల సభలో మెజారిటీ దక్కితే ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలపై విచారణలు చేపట్టేందుకు డెమోక్రాట్లకు అవకాశం లభిస్తుంది. వివిధ కమిటీల ద్వారా ఉన్నతాధికారులను ప్రశ్నించడం, కీలక పత్రాలను కోరడం, అవసరమైతే సమన్లు జారీ చేయడం వంటి అధికారాలను ఉపయోగించుకోవచ్చు. సెనేట్‌లోనూ ఆధిక్యం కొనసాగితే ట్రంప్‌ ప్రతిపాదించే న్యాయమూర్తులు, ఉన్నతస్థాయి అధికారుల నియామకాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. కీలక బిల్లుల ఆమోదం కూడా డెమొక్రాట్ల మద్దతుపైనే ఆధారపడాల్సి రావచ్చు. దీంతో ట్రంప్‌ తన నిర్ణయాలను అమలు చేయడం గతంతో పోలిస్తే కష్టతరంగా మారనుంది.

94 ఏళ్ల చరిత్రను తిరగరాసిన డెమోక్రాట్లు

ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లు విజయాల్లో ప్రత్యేకత ఏమిటంటే.. వారి ప్రభావం సంప్రదాయ రాజకీయ సరిహద్దులను దాటి విస్తరించడం. దక్షిణ కరోలినాలో సెనేట్‌ స్థానాన్ని దక్కించుకోవడం, టెక్సాస్‌లో విజయం సాధించడం పొలిటికల్ అనలిస్టులను ఆశ్చర్యపరిచాయి. 1994 తర్వాత టెక్సాస్‌లో డెమోక్రాట్లకు దక్కిన కీలక విజయంగా దీనిని పేర్కొంటున్నారు. కాన్సాస్‌లోనూ దాదాపు 94 ఏళ్ల తర్వాత డెమోక్రాట్ అభ్యర్థి విజయం సాధించడం చరిత్రాత్మక పరిణామంగా నిలిచింది. వాషింగ్టన్‌ మేయర్‌ ఎన్నికల్లోనూ డెమోక్రాట్ అభ్యర్థి లూయీస్‌ జార్జ్‌ విజయం సాధించినట్లు పేర్కొంటున్నారు. ఈ ఫలితాలు రిపబ్లికన్‌ పార్టీకి అనుకూలంగా ఉండే ప్రాంతాల్లోనూ ఓటర్ల ఆలోచనా విధానంలో మార్పు వస్తోందనే చర్చకు తెరలేపాయి.

ఓటమిని అంగీకరిస్తూనే ట్రంప్‌ సవాల్‌!

ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా వచ్చినప్పటికీ ట్రంప్‌ తనదైన శైలిలో స్పందించారు. ఫలితాలను అంగీకరిస్తానని చెబుతూనే ఎరుపు రంగు టోపీపై వీటో అని రాసి ఉన్న చిత్రాన్ని ట్రూత్‌ సోషల్‌లో పోస్టు చేశారు. కాంగ్రెస్‌లో డెమొక్రాట్లు ఆధిక్యం సాధించినా అధ్యక్షుడిగా తనకున్న వీటో అధికారాన్ని ఉపయోగించుకునేందుకు వెనుకాడబోననే సంకేతాన్ని ఈ పోస్టు ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరో పోస్టులో గెలిచిన, ఓడిన అభ్యర్థుల విజయాపజయాలకు గల కారణాలను రాజకీయ వ్యాఖ్యాతగా విశ్లేషిస్తానని పేర్కొన్నారు. మొత్తానికి ఈ ఎన్నికల ఫలితాలు ట్రంప్‌ పాలనకు ప్రజల నుంచి వచ్చిన హెచ్చరికగా భావించవచ్చని అమెరికా మీడియా కథనాలు కోడై కూస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీకి మధ్యంతర ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడం అమెరికా రాజకీయాల్లో కొత్తేమీ కాకపోయినా, రిపబ్లికన్ల బలమైన ప్రాంతాల్లో డెమోక్రాట్లు విజయం సాధించడం మాత్రం ప్రాధాన్యత నెలకొంది. మధ్యంతర ఎన్నికల ఫలితాలతో ట్రంప్ తన విధానాలను మార్చుకుంటారా..? లేదా..? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది..