పగవాడికి కూడా వద్దు నెతన్యాహు కష్టం!

నెతన్యాహుకు ఏం కష్టం. చిటికేస్తే పలికే ట్రంప్ ఉన్నాడు. చూసి రమ్మంటే కాల్చివచ్చే మెరికల్లాంటి ఐడీఎఫ్ కమాండోలున్నారు. కానీ టైమ్ బ్యాడ్. ఇంటగెలిచి రచ్చ గెలవమన్నారు. కానీ రచ్చ గెలుస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంట ఓడుతున్నారు. ఓటమి అంచుల్లో ఉన్నారు. ఇరాన్ మెడలు వంచాలన్నా, పాలస్తీనా పీక పట్టుకోవాలన్నా, లెబనాన్‌ని లెంపకాయ కొట్టాలన్నా ముందు పదవి ఉండాలి కదా. ఇప్పుడాయన పదవే గాల్లో దీపంలా ఉంది. ఏ అరబ్ దేశాలమీద విషం కక్కుతున్నాడో, ఆ అరబ్ పార్టీల దయాదాక్షిణ్యాలమీదే నెతన్యాహు భవిష్యత్తు ఆధారపడి ఉండడం విధిరాత కాకపోతే ఇంకేంటి!
ఇజ్రాయెల్ పార్లమెంట్ నెసెట్కి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. నెతన్యాహు నాయకత్వంలోని లికుడ్ పార్టీతో పాటు నెతన్యాహు కూడా ఓడిపోవడం ఖాయమనుకున్నారు. కానీ చావుతప్పి కన్నులొట్టబోయినట్లు నెతన్యాహు బయటపడ్డారు. కానీ మెజార్టీకి కావాల్సిన 61 సీట్లకు 8 సీట్లదూరంలో 53 దగ్గరే ఆగిపోయింది లికుడ్ పార్టీ. ఐడీఎఫ్ మాజీచీఫ్ గడి ఐసెన్‌కోట్ నేతృత్వంలోని లెఫ్టిస్ట్ పార్టీ 48 సీట్లు గెలిచింది. దీంతో ఇజ్రాయెల్‌లో అధికార విపక్షకూటములకు 19 సీట్లు గెలిచిన అరబ్ పార్టీల బ్లాక్ కీలకమైపోయింది.
నెతన్యాహు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా ఉంది. ఎందుకంటే ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. హమాస్ నాయకులకు సీక్రెట్‌గా ఫండ్స్ అందించాడనే అభియోగాలున్నాయి. రెండు అవినీతి కేసులు కోర్టు విచారణలో ఉన్నాయి. 2023 అక్టోబరు 17న ఇజ్రాయెల్‌పై హమాస్ భీకరదాడికి పరోక్ష కారకుడనే ఆరోపణలు నెతన్యాహు మీద ఉన్నాయి. ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వస్తే జైలుకెళ్లాల్సి రావచ్చు. మరోవైపు అరబ్పార్టీలతో కలిసి ఐసెన్‌కోట్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటూ ప్రజలు వీధుల్లోకొస్తున్నారు. నెతన్యాహు రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు.
మన ‘ఫాదర్ ల్యాండ్’లో రాజ్యాంగ సంక్షోభం తలెత్తిందనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్‌కి అసలు రాజ్యాంగమే లేదు. కోర్టు తీర్పులే అక్కడ శిలాశాసనం. నెతన్యాహు మరోసారి అధికారంలోకి రావాలంటే మరో 8 సీట్లు కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అరబ్ పార్టీల మద్దతు తీసుకునే అవకాశమే లేదు. ఇక నెతన్యాహుని తీవ్రంగా వ్యతిరేకించే ఐసెన్ కోట్ సంకీర్ణ ప్రభుత్వంలో చేరే అవకాశాలు లేవు. దీంతో ‘సహజ న్యాయసూత్రాలు’ ఇజ్రాయెల్ భవిష్యత్తుని నిర్ణయించబోతున్నాయి.



