కన్నోళ్లు పోయారు. ఉన్నోళ్లు వదిలేశారు. గాలికి తిరుగుతున్నాడు. మంచీచెడూ చెప్పేవాళ్లు లేరు. బంధువులమ్మాయిపై కన్నేశాడు. చెల్లెలి వరసని తెలిసినా తప్పనే విచక్షణలేదు. చెప్పినా వినేపరిస్థితితో లేడు. ప్రేమాదోమా అని వెంటపడేసరికి పెద్దోళ్లు మందలించారు. అమ్మాయి జోలికొస్తే కాళ్లు విరగ్గొడతామన్నారు. అయినా ఉన్మాదం తలకెక్కిన ఆ పోకిరీగాడు ఎలక్ట్రిక్‌ రంపంతో స్కూలుకు చేరుకున్నాడు. నేరుగా ఆ అమ్మాయి ఉన్న క్లాస్‌రూమ్‌లోకి వెళ్లాడు. టీచర్‌, తోటిపిల్లల కళ్లెదుటే విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు.

గుండెల్లో బుల్లెట్‌ దించితే క్షణాల్లో ప్రాణంపోతుంది. ఉరితాడుకు వేలాడితే కొన్ని నిమిషాల్లో ఊపిరి ఆగిపోతుంది. కానీ ఈ శిక్ష జీవితకాలం గుర్తుంటుంది. జీవితాంతం వెంటాడుతుంది.

రక్తపుమడుగులో కుప్పకూలిన అభంశుభం తెలీని ఆ అమ్మాయి బెంగళూరులో చికిత్సపొందుతోంది. ఆమె ప్రాణాలతో బయటపడ్డా ఆ గాయంమాత్రం జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ స్కూల్‌లో జరిగిన ఈ దారుణంతో రాష్ట్రమంతా నివ్వెరపోయింది. ఆ ఉన్మాదిపై ప్రజల్లో ఆగ్రహంకట్టలు తెంచుకుంది. స్కూల్లో అందరి కళ్లెదుటే జరిగిన ఈ అమానుషాన్ని సభ్యసమాజం జీర్ణించుకోలేకపోయింది. ఈ దారుణానికి పాల్పడ్డ హేమంత్‌ అనేవాడు దొరికాడు. వాడ్ని ఉరితీయాలని జనమంతా డిమాండ్‌ చేస్తున్న టైమ్‌లోనే ఎన్‌కౌంటర్‌ జరిగింది.

కథనం షరామామూలే. తిరగబడ్డాడు. ఆత్మరక్షణకోసం కాల్పలు జరిపారు. కానీ వాడు చచ్చేలా కాదు. చచ్చిబతికేలా. బతికినా చచ్చినవాడిలా పడుండేలా. ఇదికదా అసలైన ఎన్‌కౌంటర్‌ అంటే. ఎందుకంటే వాడు ఇక జీవితకాలం కుంటుకుంటూ బతకాల్సిందే. తన పాపానికి ప్రాయశ్చిత్తంగా జీవితాంతం ఆ వైకల్యంతో ఉండాల్సిందే.  బుల్లెట్‌ గాయాలతో సెప్టిక్‌ అయ్యేలా ఉండటంతో ఓ కాలు తీసేశారు. బాలికపై హత్యాయత్నానికి ఎలాగూ కఠినశిక్ష పడుతుంది. అంటే జైల్లో ఉన్నన్నాళ్లూ ఒంటికాలితో గడపాల్సిందే. బయటికొచ్చాక కూడా ఆ వైకల్యంతో బతకాల్సిందే. గుండెల్లో బుల్లెట్‌ దించితే క్షణాల్లో ప్రాణంపోతుంది. ఉరితాడుకు వేలాడితే కొన్ని నిమిషాల్లో ఊపిరి ఆగిపోతుంది. కానీ ఈ శిక్ష జీవితకాలం గుర్తుంటుంది. జీవితాంతం వెంటాడుతుంది.