AP Municipal Election Counting: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు వెలువడుతున్న ఫలితాల్లో పలు మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శిస్తుండగా, మరికొన్ని చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. దీంతో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. 13 మున్సిపల్ కార్పొరేషన్లలో 10 చోట్ల తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు సమాచారం. మరోవైపు పుంగనూరు మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఈ విజయంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కుప్పం మున్సిపాలిటీలోనూ టీడీపీ అభ్యర్థులు విజయాలు సాధించారు. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం 36 వార్డుల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు.

విజయవాడలో ఆలస్యంగా కౌంటింగ్ ప్రారంభం

విజయవాడలో వర్షం కారణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ రెండు గంటల ఆలస్యంగా ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రారంభమైన అనంతరం పలు డివిజన్లలో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు లయోలా కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని మేయర్ స్వతంత్ర అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావు సందర్శించారు. అక్కడి ఏర్పాట్లపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కూడా సరిగా లేవని, ఏర్పాట్లు ఏమాత్రం బాగోలేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్ కేంద్రాల పరిస్థితి పశువుల సావిడిలా ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.

తునిలో నాలుగు వార్డుల ఫలితాలు వెల్లడి

కాకినాడ జిల్లా తుని పురపాలక సంఘ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు నాలుగు వార్డుల ఫలితాలు ప్రకటించారు. ఇందులో మూడు వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, ఒక వార్డులో కూటమి అభ్యర్థి గెలుపొందారు. డోన్ మున్సిపాలిటీలో వెలువడిన వార్డుల ఫలితాల్లో టీడీపీ, వైసీపీ అభ్యర్థులు సమానంగా విజయాలు సాధించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 1, 2, 4, 5, 6 వార్డుల్లో గెలుపొందగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 3, 7, 8, 9 వార్డుల్లో విజయం సాధించారు. దీంతో ఇక్కడ ఇరు పార్టీల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.

నందికొట్కూరు, ఉయ్యూరులో వైసీపీ ఆధిక్యం

మరోవైపు నందికొట్కూరు, ఉయ్యూరు మున్సిపాలిటీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుండటంతో తుది ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో కొన్ని ప్రాంతాల్లో కూటమి అభ్యర్థులు పైచేయి సాధిస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వైసీపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే కొద్దీ మరిన్ని ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో ఏ మున్సిపాలిటీలో ఏ పార్టీ పట్టు సాధించనుందన్నది తుది ఫలితాల అనంతరం స్పష్టత రానుంది.