AAP Leaders Join BJP: పంజాబ్ రాజకీయాల్లో ఎన్నికలకు ముందే సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. 2027లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్న తరుణంలో పార్టీలో అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అభ్యర్థుల తొలి జాబితా విడుదలైన వెంటనే చోటుచేసుకున్న పరిణామాలు ఆప్ నాయకత్వాన్ని కలవరపెడుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యేల రాజీనామాలు, మరోవైపు కీలక నేతల పార్టీ మార్పులు కేజ్రీవాల్ నాయకత్వానికి పెను సవాలుగా మారాయి. తాజాగా ఆప్‌కు చెందిన ముగ్గురు కీలక నేతలు భారతీయ జనతా పార్టీలో చేరడం పంజాబ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్, హర్మీత్ సింగ్ పఠాన్ మజ్రా, చేతన్ సింగ్ జౌరమజ్రా బీజేపీ కండువా కప్పుకున్నారు. వీరిలో హర్మీత్ సింగ్ పఠాన్ మజ్రా సనౌర్ నియోజకవర్గానికి, చేతన్ సింగ్ జౌరమజ్రా సమానా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో ఐపీఎస్‌గా పని చేసిన కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ అమృత్‌సర్ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరి చేరికతో పంజాబ్‌లో బీజేపీ తన రాజకీయ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

తొలిజాబితా విడుదలతో అసమ్మతి

ఆప్ విడుదల చేసిన అభ్యర్థుల తొలి జాబితా కారణంగానే పలువురు ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరినట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. 2027 అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్ శనివారం 40 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరోసారి ధురి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్‌కు కోటక్‌పురా టికెట్ కేటాయించారు. జైలులో ఉన్న మంత్రి సంజీవ్ అరోరాకు లూధియానా వెస్ట్ స్థానం కేటాయించడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ జాబితాలో సనౌర్ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్ మజ్రా, సమానా ఎమ్మెల్యే చేతన్ సింగ్ జౌరమజ్రాలకు చోటు దక్కలేదు. అంతేకాకుండా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కొత్త ఇన్‌చార్జ్‌లను నియమించడంతో తమకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కవనే సంకేతాలు అందుకున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. దీంతో పలువురు MLAలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి మరీ బీజేపీలో చేరారు.

పార్టీ మారేందుకు సిద్ధమైన 30 మంది ఎమ్మెల్యేలు..?

మరోవైపు కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ పార్టీ నాయకత్వంతో విభేదాల నేపథ్యంలో గతంలోనే సస్పెన్షన్‌కు గురయ్యారు. తాజాగా ఆయన కూడా పార్టీని వీడి బీజేపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. పంజాబ్‌లో డ్రగ్స్, గ్యాంగ్‌స్టరిజం, అవినీతి వంటి సమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ప్రస్తావించడం రాజకీయంగా చర్చకు దారితీసింది. చేతన్ సింగ్ జౌరమజ్రా గతంలో భగవంత్ మాన్ మంత్రివర్గంలో పనిచేశారు. అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయనకు పదవి దక్కలేదు. దీంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. మరోవైపు పఠాన్ మజ్రా కూడా ప్రభుత్వ వ్యవహారాలు, పార్టీ నాయకత్వంతో విభేదాల కారణంగా న్యూస్ హెడ్‌లైన్స్‌లో నిలిచారు. అంతేకాకుండా మరో 15 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారంటూ జౌరమజ్రా చేసిన వ్యాఖ్యలు ఆప్‌ను మరింత కలవరపెడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీని వీడితే ప్రమాదం ఉందని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఆప్ నేతలు చెబుతున్నారు.

ఎన్నికల అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న పార్టీలు

పంజాబ్‌లో ఆప్‌కు ఎదురవుతున్న ఈ పరిణామాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశముంది. మరోవైపు బీజేపీ ఆప్‌లోని అసంతృప్త నేతలను ఆకర్షిస్తూ తన రాజకీయ బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ కూడా ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఎన్నికలకు ముందే సొంత ఎమ్మెల్యేలు పార్టీని వీడటం, అభ్యర్థుల ఎంపికపై అసమ్మతి వ్యక్తం కావడం మాత్రం ఆప్ నాయకత్వానికి వార్నింగ్ బెల్‌గా మారింది. రాబోయే రోజుల్లో మరికొందరు నేతలు పార్టీని వీడతారా..? లేక కేజ్రీవాల్, భగవంత్ మాన్ అసంతృప్తులను బుజ్జగించి పరిస్థితిని చక్కదిద్దుతారా..? అన్నది ఆసక్తికరంగా మారింది. 2027 పంజాబ్ ఎన్నికలకు ముందే పంజాబ్ రాజకీయాలు మరింత వేడి పుట్టిస్తున్నాయి.

వచ్చే ఫిబ్రవరిలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు

వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి ఐదేళ్లు పూర్తికానున్న నేపథ్యంలో పంజాబ్‌లో ఎన్నికల సందడి మొదలుకానుంది. ఈ క్రమంలో ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఎన్నికలను ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇప్పటికే జిల్లాల వారీగా కలెక్టర్లతో ఎన్నికల సంఘం వరుస సమావేశాలు నిర్వహించి, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై సమీక్ష చేపట్టింది. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, పోలింగ్ కేంద్రాలు, భద్రతా ఏర్పాట్లు, ఓటర్ల జాబితా, ఎన్నికల సామగ్రి వంటి అంశాలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. జిల్లాల వారీగా ఉన్న పరిస్థితులను అంచనా వేస్తూ ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం సూచించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించే దిశగా ఇప్పటి నుంచే అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని భావిస్తోంది. దీంతో రానున్న రోజుల్లో ఎన్నికల ఏర్పాట్లు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది.