Murasu Cyclone News: ఆంధ్రప్రదేశ్‌పై ప్రకృతి మరోసారి పంజా విసురుతోంది. ఇప్పటికే అర్నబ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. తుఫాను నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం కూడా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నివేదికలు సిద్ధం చేస్తోంది. ఈ పరిస్థితుల్లోనే రాష్ట్రంపై మరో తుఫాను ముప్పు ముంచుకొస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మురసు తుఫాను తీవ్ర తుపానుగా బలపడి తీర ప్రాంతాల వైపు దూసుకొస్తోంది. దీంతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలను ముమ్మరం చేసింది. గత ఆరు గంటలుగా గంటకు 22 కిలోమీటర్ల వేగంతో మురసు తుఫాను కదులుతోంది. ప్రస్తుతం నెల్లూరుకు 160 కిలోమీటర్లు, చెన్నైకి 180 కిలోమీటర్లు, కావలికి 180 కిలోమీటర్లు, ఒంగోలుకు 210 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 240 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము మధ్య నెల్లూరు-నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో తీర ప్రాంత జిల్లాల్లో ఆందోళన నెలకొంది.

 

నాలుగు జిల్లాలపై తీవ్ర ప్రభావం

ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాలపై తుఫాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. మురసు తుఫాను నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఆర్టీజీఎస్, విపత్తుల నిర్వహణ సంస్థ సమన్వయంతో చర్యలు చేపట్టారు. తుఫాను తీవ్రత, ప్రభావిత ప్రాంతాలు, సహాయక చర్యలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. తుఫాను పరిస్థితుల దృష్ట్యా సీఎం చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనను కూడా వాయిదా వేసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా తుఫాను అనంతరం విద్యుత్ పునరుద్ధరణ చర్యలకు సంబంధించి సీఎం చంద్రబాబు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో మాట్లాడారు. ఏపీలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను త్వరగా పునరుద్ధరించేందుకు అవసరమైన సిబ్బందిని పంపించాలని కోరారు. చంద్రబాబు చేసిన విజ్ఞప్తికి తమిళనాడు సీఎం విజయ్ సానుకూలంగా స్పందించార.

విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి

మరోవైపు తుఫాను తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అవసరమైన ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 48 గంటల్లోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని లక్ష్యంగా నిర్దేశించారు. అవసరమైతే పొరుగు రాష్ట్రాల నుంచి అదనపు సిబ్బంది, యంత్రాలను తెప్పించేందుకు సిద్ధంగా ఉన్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం 24 గంటలూ అందుబాటులో ఉండేలా 1912 టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశారు. ఏపీసీపీడీసీఎల్ పరిధిలో డివిజన్ల వారీగా కంట్రోల్ రూమ్‌లను కూడా ఏర్పాటు చేశారు. జలవనరుల శాఖపైనా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. రిజర్వాయర్లలో నీటి ప్రవాహాలను ప్రతి రెండు గంటలకోసారి పరిశీలించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. వాగులు, వంకల వద్ద ప్రజల సంచారాన్ని పూర్తిగా నిలిపివేయాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

అర్నబ్ నుంచి కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్..

ఇప్పటికే అర్నబ్ తుఫాను సృష్టించిన ప్రభావం నుంచి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు కోలుకునేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేంద్ర బృందం నష్టాన్ని పరిశీలించి నివేదికలు సిద్ధం చేస్తున్న తరుణంలోనే మరో తుఫాను ముంచుకొస్తుండటం రాష్ట్రానికి సవాలుగా మారింది. మురసు తుఫాను తీరం దాటే సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం విద్యుత్, సాగునీరు, రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖలను సమన్వయం చేస్తూ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఒక తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీకి మురసు రూపంలో మరో ప్రకృతి పరీక్ష ఎదురవుతోంది.