VMC – కేరాఫ్ వంగవీటి మున్సిపల్ కార్పొరేషన్
Vangaveeti Radha Victory: విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధా భారీ మెజార్టీ సాధించారు. వైసీపీ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మీ కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. ఇక మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు అయితే డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయారు.

Vangaveeti Radha Victory: బెజవాడ గడ్డపై మరోసారి వంగవీటి కుటుంబ రాజకీయ ప్రభావం స్పష్టంగా కనిపించిందా.. విజయవాడ రాజకీయాల్లో వంగవీటి పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. జనసేన తరఫున మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన వంగవీటి రాధాకృష్ణ సుమారు 1.30 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారన్న ప్రచారం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఈ విజయంతో విజయవాడలో కూటమి తన రాజకీయ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుందని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. ముఖ్యంగా మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య ఏర్పడిన సమన్వయం రాధాకృష్ణ విజయానికి కీలకంగా మారింది. మరోవైపు, ఈ విజయం కేవలం ఒక ఎన్నికల ఫలితానికే పరిమితం కాకుండా బెజవాడలో వంగవీటి కుటుంబ రాజకీయ వారసత్వానికి మరోసారి గుర్తింపు తెచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బెజవాడలో వంగవీటి ప్రభావం మళ్లీ మొదలు
విజయవాడ రాజకీయాలను ప్రస్తావించినప్పుడు వంగవీటి కుటుంబం పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది. అయితే వంగవీటి రాధాకృష్ణ రాజకీయ ప్రయాణం సాఫీగా సాగలేదు. 2000 సంవత్సరంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన అప్పటి నుంచి పలు పార్టీలతో కలిసి పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించడం ఆయన రాజకీయ జీవితంలో కీలక మలుపు. ఆ విజయంతో ప్రత్యక్ష రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నారు. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీలో చేరి పోటీ చేసినప్పటికీ ఓటమి ఎదురైంది. అనంతరం 2014 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసినా విజయం దక్కలేదు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన రాధాకృష్ణ ఆ తర్వాత కొంతకాలం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. విజయవాడ మేయర్ పదవి జనరల్ కేటగిరీ కేటాయించారు. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన ఆయన మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. చివరకు భారీ విజయాన్ని అందుకోవడంతో ఆయన రాజకీయ ప్రస్థానంలో మరో కీలక అధ్యాయం మొదలైనట్లయింది.
అమరావతికి గేట్వేగా ఉన్న విజయవాడ అభివృద్ధే లక్ష్యం..
విజయవాడ నగరం ఆంధ్రప్రదేశ్ రాజకీయ, ఆర్థిక, వాణిజ్య రంగాల్లో కీలక స్థానం కలిగి ఉంది. అమరావతికి గేట్వేగా ఉన్న విజయవాడను అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని వంగవీటి రాధా పేర్కొన్నారు. రాధాకృష్ణ విజయంతో ఆయన అభిమానులు, అనుచరుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఇప్పటివరకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌ను వీఎంసీగా పిలుస్తూ వచ్చారు. అయితే ఇకపై దానిని వంగవీటి మున్సిపల్ కార్పొరేషన్‌గా పిలుస్తామంటూ ఆయన అభిమానులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. వంగవీటి కుటుంబానికి ఉన్న అభిమానాన్ని, రాధాకృష్ణ విజయంపై అనుచరుల్లో నెలకొన్న ఉత్సాహంతో ఈ కామెంట్లు చేశారని రాధా అభిమానులు అంటున్నారు.
ఏబీ వెంకటేశ్వరరావుకు ఘోర పరాభవం
ఒకవైపు వంగవీటి రాధాకృష్ణ భారీ విజయంతో సంబరాలు చేసుకుంటుంటే, మరోవైపు మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు మాత్రం తీవ్ర నిరాశ ఎదురైంది. బెజవాడ మేయర్ ఎన్నికల్లో ఆయన చేసిన రాజకీయ ప్రయోగం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. వామపక్షాలు, కాంగ్రెస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఏబీ వెంకటేశ్వరరావు కేవలం 12,642 ఓట్లకే పరిమితమయ్యారు. డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. ఒకప్పుడు పోలీసు అధికారిగా ఉన్నతస్థాయిలో పనిచేసిన అనుభవం, ప్రజల్లో తనకున్న గుర్తింపు, రాజకీయ పార్టీల మద్దతు తనకు అనుకూలంగా మారుతాయని భావించారు. కానీ ఎన్నికల ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి. ఏబీ వెంకటేశ్వరరావు ఓటమిపై మరో ఆసక్తికరమైన పోలిక కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి సీపీఎం తరఫున పోటీ చేసిన బాబురావుకు 29 వేలకుపైగా ఓట్లు వచ్చాయి. అయితే ఈసారి కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో బరిలోకి దిగిన ఏబీ వెంకటేశ్వరరావుకు మాత్రం 12,642 ఓట్లే రావడం చర్చనీయాంశమైంది.



