RGV Six Pack Comments

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా.. ఏం చెప్పినా ఈసోషల్ మీడియా కాలంలో సంచలనమే. తాజాగా సినిమాల్లో హీరో అంటే సిక్స్ ప్యాక్ బాడీ, ఉక్కులాంటి కండరాలు, ప్రత్యర్థులను మట్టికరిపించే శారీరక సామర్థ్యం.. కానీ నిజ జీవితంలో అసలైన శక్తికి ఈ లక్షణాలతో పనిలేదంటూ ట్వీట్ చేశారు. వెండితెరపై కండలు తిరిగిన దేహాన్ని బలానికి ప్రతీకగా చూపిస్తున్నా.. వాస్తవ ప్రపంచంలో మాత్రం అధికారమే అసలైన ఆయుధమని విశ్లేషించారు. సిక్స్ ప్యాక్ ఉన్న వ్యక్తి సైతం దేహదారుఢ్యం గురించి ఏమాత్రం పట్టించుకోని వ్యక్తి కింద పనిచేయాల్సి వస్తుందని తన ‘ఎక్స్’ ఖాతాలో ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘ది ఐరనీ ఆఫ్ టఫ్ హీరోస్ హైడింగ్ బిహైండ్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్’ అంటూ మొదలుపెట్టిన ఆయన.. ‘బాహుబలి’కి ముందు, ఆ తర్వాత వచ్చిన సినిమాలు సైతం ఈ వాస్తవాన్ని విస్మరించాయని వ్యాఖ్యానించారు. నిజ జీవితంలో శక్తిమంతులుగా చలామణి అయ్యేవారు సినిమాల్లో(RGV Six Pack Comments) చూపించే హీరోల మాదిరిగా కండలు తిరిగిన శరీరంతో ఉండాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు.తన వాదనకు చరిత్రతో పాటు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన వ్యక్తులను ఉదాహరణలుగా తీసుకొచ్చారు ఆర్జీవీ.

బెల్లం ఉంటేనే చీమలు..
సినిమాలు శరీర సౌష్టవాన్ని హీరోయిజంగా చూపిస్తే.. నిజజీవితం మాత్రం అధికారం వెనుక ఉన్న అసలు బలాన్ని బయటపెడుతుందని వర్మ అభిప్రాయపడ్డారు. సిక్స్ ప్యాక్ ఉన్న వ్యక్తికి జీతం ఇచ్చేది, అతని సేవలను వినియోగించుకునేది కూడా శారీరకంగా బలంగా లేని వ్యక్తే కావచ్చని గుర్తుచేశారు. అంటే కండబలం ఒకరి దగ్గర ఉంటే.. దాన్ని శాసించే అధికార బలం మరొకరి చేతిలో ఉంటుందన్నమాట. ‘చేతిలో అధికారం ఉంటేనే చుట్టూ బలం చేరుతుంది’ అన్నట్లుగా, సిక్స్ ప్యాక్ అనేది శక్తికి కొలమానం(RGV Six Pack Comments) కాదని, కేవలం శరీరానికి సంబంధించిన అలంకారమని ఆర్జీవీ తనదైన శైలిలో చురకలంటించారు. చివరికి కండలు తిరిగిన వ్యక్తి సైతం తన శరీర సౌష్టవాన్ని పట్టించుకోని వ్యక్తి కింద పనిచేయాల్సి వస్తుందన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెరతీస్తున్నాయి.

కండబలం కాదు.. బుద్దిబలం
నెపోలియన్, స్టాలిన్ వంటి నేతలు భారీ శరీర సౌష్టవం కలిగినవారు కాకపోయినా.. వారి ఆదేశాల మేరకు వేలాది మంది సైనికులు పనిచేశారని గుర్తుచేశారు. అల్ కపోన్, పాబ్లో ఎస్కోబార్, దావూద్ ఇబ్రహీం వంటి మాఫియా డాన్లు కూడా కండలు తిరిగిన దేహంతో భయపెట్టలేదని, వారి కోసం ప్రాణాలకు తెగించే అనుచరులే శారీరకంగా బలంగా ఉండేవారన్నారు. భారత రాజకీయాల్లోనూ ఇదే తరహా పరిస్థితి కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. సాధారణ శారీరక సామర్థ్యం(RGV Six Pack Comments) ఉన్న నాయకుల చుట్టూ ఆరడుగుల ఎత్తున్న బాడీగార్డులు రక్షణగా నిలబడటం, సైన్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సైనికులు యుద్ధరంగంలోకి వెళ్లడం వంటివి అధికారానికి, శారీరక బలానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేస్తాయని విశ్లేషించారు.