Ramayana Movie: ఇండియాలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన చిత్రంగా రామాయణ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చోపచర్చలు సాగుతున్నాయి. భారీ బడ్జెట్, అద్భుతమైన విజువల్స్, స్టార్ కాస్టింగ్‌తో ఈ చిత్రం వార్తల్లో నిలుస్తోంది. అయితే అన్నింటినీ మించి శ్రీరాముడి పాత్రలో కనిపించనున్న రణబీర్ కపూర్‌పై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. దాదాపు రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో రామాయణ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఇందులో మొదటి భాగం నవంబర్ 5న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయని, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.50 కోట్ల మేర ప్రీ-సేల్స్ నమోదైనట్లు సమాచారం. నితేశ్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా, నటుడు యశ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సాయి పల్లవితో దక్షిణాదిలో మరింత ఆసక్తి

ఈ సినిమాలో దక్షిణాదికి చెందిన యశ్, సాయిపల్లవి నటిస్తుండటంతో తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో కొంత ఆసక్తి నెలకొంది. అయితే పౌరాణిక చిత్రాలకు పెట్టింది పేరైన తెలుగు నేలపై మాత్రం రామాయణకు ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ కాలేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారీ క్యాస్టింగ్, హైఎండ్ టెక్నికల్‌గా రూపొందుతున్నప్పటికీ తెలుగు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి ఎందుకు అంతగా కనిపించడం లేదన్నది చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే.. ఉత్తరాది ప్రేక్షకుల మదిలో కొన్ని దశాబ్దాలుగా శ్రీరాముడంటే గుర్తొచ్చే పేరు అరుణ్ గోవిల్. రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణ టెలివిజన్ సీరియల్‌లో శ్రీరాముడిగా ఆయన అభినయం ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. అలాంటి అరుణ్ గోవిల్‌ను రణబీర్ కపూర్ మరిపించగలడా..? ఆయన స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందగలడా? అన్న చర్చ బాలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరో విశేషం ఏమిటంటే.. గతంలో శ్రీరాముడిగా అలరించిన అరుణ్ గోవిల్ ఇప్పుడు ఇదే రామాయణలో దశరథుడి పాత్రలో కనిపించనున్నారు.

రణబీర్ కపూర్‌కు అరుణ్ గోవిల్‌తో అసలైన పరీక్ష

భారతీయ పురాణగాథలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించడంలో తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీనివాసుడు, మహాశివుడు వంటి దేవతామూర్తుల పాత్రల్లో నటరత్న ఎన్టీఆర్ ప్రేక్షకులను మెప్పించిన తీరు ఇప్పటికీ ప్రత్యేకమే. ఆ పాత్రల్లో ఆయన చూపించిన అభినయం, వ్యక్తిత్వం, తెరపై పలికించిన హావభావాలు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. ఆ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటులు మరొకరు లేరనే అభిప్రాయం ఇప్పటికీ చాలామందిలో ఉంది. ఆ తర్వాతి కాలంలో రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణ సీరియల్‌లో అరుణ్ గోవిల్ తనదైన చిరునవ్వు, ప్రశాంతమైన అభినయంతో శ్రీరాముడి పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారు. అప్పట్లో ఈ సీరియల్ దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది. కరోనా మహమ్మారి సమయంలో 2020లో మరోసారి బుల్లితెరపై ప్రసారమై నవతరం ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. దీంతో శ్రీరాముడి పాత్రకు అరుణ్ గోవిల్ రూపం మరింత బలంగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. అందుకే ఇప్పుడు రణబీర్ కపూర్ శ్రీరాముడిగా ఏ మేరకు మెప్పిస్తాడన్న ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

థియేటర్లలో బోల్తా పడిన ప్రభాస్ ఆదిపురుష్..!

మరోవైపు తెలుగులో ఆదిపురుష్ చిత్రంలో శ్రీరాముడిగా నటించిన ప్రభాస్‌కు కూడా ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదనే అభిప్రాయం కొందరిలో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రణబీర్ కపూర్ నటిస్తున్న రామాయణపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి ఏ మేరకు పెరుగుతుందన్నది ప్రశ్నగా మారింది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు పౌరాణిక చిత్రాలపై ఉన్న ప్రత్యేక అభిరుచిని దృష్టిలో పెట్టుకుంటే, ఈ సినిమా వారిని ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. రామాయణ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండటంతో పాటు దీపావళి పండుగ సమయంలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాదిలో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే దక్షిణాదిలో మాత్రం పరిస్థితులు కొంత భిన్నంగా కనిపిస్తున్నాయి. రామాయణ విడుదలైన మరుసటి రోజే తమిళ స్టార్ హీరో సూర్య నటించిన సీన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ముఖ్యంగా తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి నెలకొంది.

రామాయణ సినిమాపై భారీ అంచనాలు

ఇప్పటికే వేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రంగా రామాయణపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇంతటి భారీ పెట్టుబడిని తిరిగి రాబట్టి లాభాల బాట పట్టడం అంత సులభమైన విషయం కాదు. ఉత్తరాదిలో ఉన్న అంచనాలు, దక్షిణాదిలో కనిపిస్తున్న పరిస్థితులు, ఇతర చిత్రాల నుంచి ఎదురయ్యే పోటీ.. ఇవన్నీ ఈ సినిమా వసూళ్లపై ప్రభావం చూపే అవకాశముంది. మరి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ భారీ పౌరాణిక చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుంది..? రణబీర్ కపూర్ శ్రీరాముడిగా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటాడా..? అన్నది తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.