పెద్దపల్లిలో కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు.. ఎంపీ వర్సెస్ మంత్రి..!
Peddapalli Congress Political War: పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మంత్రి శ్రీధర్‌బాబు టార్గెట్‌గా ఎంపీ గడ్డం వంశీ రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది.

Peddapalli Congress Political War:పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇప్పటివరకు పార్టీ అంతర్గత వ్యవహారంగానే కొనసాగిన ఎంపీ, మంత్రి మధ్య విభేదాలు ఇప్పుడు బహిరంగ చర్చకు దారితీశాయి. ముఖ్యంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ మధ్య రాజకీయంగా దూరం పెరుగుతోందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తాజాగా ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సభకు గైర్హాజరైన నేతలపై ఎంపీ లేఖ రాయడం ఈ వివాదానికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది.
ఢిల్లీ సభకు డుమ్మా.. ముగ్గురు నేతలపై ఎంపీ అసంతృప్తి..
నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అయితే పెద్దపల్లి జిల్లాకు చెందిన మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు మక్కాన్‌సింగ్ ఠాకూర్, విజయరమణారావు ఈ సభకు హాజరుకాలేదు. అదే రోజు మంథనిలో గణపతి సచ్చిదానంద నిర్వహించిన కార్యక్రమానికి ఈ ముగ్గురు నేతలు హాజరయ్యారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఈ కార్యక్రమానికి వెళ్లినట్లు వారు పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ పరిణామంపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ పాల్గొన్న జాతీయ స్థాయి కార్యక్రమానికి హాజరుకాకపోవడం పార్టీ పరంగా సరైన నిర్ణయం కాదన్న అభిప్రాయాన్ని లేఖ ద్వారా తెలియజేశారు. దీంతో ఈ లేఖ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
సామాన్యులకు ఒక న్యాయం.. నేతలకు మరో న్యాయమా..?
ఈ వివాదంలో ఎంపీ మరో అంశాన్ని కూడా ప్రస్తావించారు. మంథని నియోజకవర్గంలో గడ్డం వివేక్ వెంకటస్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఓ మహిళా నాయకురాలిపై పార్టీ చర్యలు తీసుకుని సస్పెండ్ చేసిందని వంశీకృష్ణ ప్రశ్నించినట్లు సమాచారం. అలాంటప్పుడు పార్టీ ముఖ్యమైన కార్యక్రమానికి హాజరుకాని మంత్రి, ఎమ్మెల్యేల విషయంలో మాత్రం ఎలాంటి చర్యలు ఉంటాయన్నది ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య కార్యకర్తలకు ఒక నిబంధన, ప్రజాప్రతినిధులకు మరో నిబంధన ఉండకూడదన్న ప్రశ్నను ఆయన లేవనెత్తుతున్నారు.
పాత విభేదాలకు కొత్త ఆజ్యం..!
వాస్తవానికి పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్‌లో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు ఇప్పటివి కావు. నియోజకవర్గాల్లో ఎంపీ ముందస్తు సమాచారం లేకుండా కార్యక్రమాలకు హాజరవుతున్నారంటూ కొందరు ఎమ్మెల్యేలు గతంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ ఉంది. మరోవైపు మంచిర్యాలలో కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం కుటుంబం మధ్య ఉన్న రాజకీయ విభేదాలు కూడా జిల్లా కాంగ్రెస్ రాజకీయాలపై ప్రభావం చూపుతున్నాయని పలువురు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తాజా పరిణామాలతో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్‌లో సమన్వయంపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవైపు మంత్రి శ్రీధర్‌బాబు, మరోవైపు ఎంపీ వంశీకృష్ణ వర్గాల మధ్య రాజకీయ దూరం పెరుగుతోందన్న చర్చ సాగుతోంది. ఈ విభేదాలు పార్టీ కార్యక్రమాలకే పరిమితమవుతాయా..? లేక భవిష్యత్తులో మరింత బహిరంగ రాజకీయ పోరుకు దారితీస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది. జిల్లా స్థాయిలో నేతల మధ్య సమన్వయం కుదిర్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు చర్చనీయాంశం. మొత్తానికి పెద్దపల్లి కాంగ్రెస్‌లో నెలకొన్న ఈ పరిణామాలు పార్టీ అంతర్గత రాజకీయాలను మరోసారి వెలుగులోకి తెచ్చాయి.



