NTR Dragon Movie Updates: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం డ్రాగన సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కలయికలో వస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానులు ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇందులో తారక్‌ను ప్రశాంత్ నీల్ చూపించబోతున్న తీరు ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత కథానాయికగా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్, మలయాళ నటుడు బిజు మీనన్, సీనియర్ నటి ఖుష్బూ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

డ్రాగన్ మ్యూజిక్ టీమ్‌లో ఊహించని మార్పులు

ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే పేరు సంగీత దర్శకుడు రవి బస్రూర్. ఉగ్రమ్ నుంచి కేజీఎఫ్ సిరీస్, సలార్ పార్ట్ 1 వరకు నీల్ సినిమాలకు తనదైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారు రవి బస్రూర్. ముఖ్యంగా హీరో ఎలివేషన్ సీన్లు, యాక్షన్ ఘట్టాలకు ఆయన అందించే సంగీతం సినిమాల స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్తుంటుంది. అయితే పాటల విషయంలో మాత్రం ఇటీవల ఆయనకు ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్రాగన్ మేకర్స్ మ్యూజిక్ విషయంలో ఓ కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. డ్రాగన్ సినిమాకు రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, పాటలు, అదనపు సౌండ్ ట్రాక్స్ కోసం ధురంధర్ (Dhurandhar) ఫేమ్ శాశ్వత్ సచ్‌దేవ్‌ను కూడా తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట. ధురంధర్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న శాశ్వత్.. ఇప్పుడు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్

ఒకవైపు రవి బస్రూర్ మాస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. మరోవైపు శాశ్వత్ సచ్‌దేవ్ సంగీతం తోడైతే ‘డ్రాగన్’ (Dragon movie) మ్యూజిక్ ఏ స్థాయిలో ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. అయితే ఈ వార్తపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఇటీవలే గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ఎన్టీఆర్ తిరిగి డ్రాగన్ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నాటికి చిత్రీకరణను పూర్తి చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారట. అనంతరం మిగిలిన నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసి వచ్చే ఏడాది జూన్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఎన్టీఆర్ (Jr NTR) పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రశాంత్ నీల్ మేకింగ్, రవి బస్రూర్ నేపథ్య సంగీతం, శాశ్వత్ సచ్‌దేవ్ పాటలు తోడైతే థియేటర్లలో ఎలాంటి అనుభూతి అందిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

శ్రీలంకలో భారీ యాక్షన్ సీన్స్

డ్రాగన్ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. డ్రాగన్ చిత్రంలోని భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించేందుకు చిత్ర బృందం త్వరలో శ్రీలంకకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అక్కడి సహజసిద్ధమైన అందమైన లొకేషన్లతో పాటు సముద్ర తీర ప్రాంతాల్లో భారీ బడ్జెట్‌తో స్టంట్ సీన్లను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన భారీ సెట్లను కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ అంటే యాక్షన్‌కు కేరాఫ్ అడ్రస్‌. అలాంటి డైరెక్షన్‌లో పని చేస్తున్న ఎన్టీఆర్‌తో.. భారీ సన్నివేశాలను చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా కేజీఎఫ్, సలార్‌కు మించిన వయోలెన్స్‌ ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది..