కవిత Vs కేటీఆర్.. ఆదిలాబాద్‌నే ఎందుకు ఎంచుకున్నారు..?
Kavitha vs KTR Political Issue: ఆదిలాబాద్ జిల్లా వేదికగా కేటీఆర్, కవిత వేర్వేరుగా భారీ బహిరంగ సభలు నిర్వహించారు. రెండు సభకు భారీ జనసమీకరణ చేశారు. అయితే ఇద్దరు చేసిన విమర్శలు ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారి తీశాయి.

Kavitha vs KTR Political Issue: తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న వేళ.. ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కవిత కూడా తన రాజకీయ దూకుడు పెంచారు. ఈ క్రమంలో రెండు రోజుల వ్యవధిలో ఒకే జిల్లాలో, ఒకే ప్రాంతంలో కవిత, కేటీఆర్ సభలు నిర్వహించడం రాజకీయ చర్చకు దారితీసింది. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పాంచజన్య సంకల్ప సభతో కవిత బహిరంగ సభ నిర్వహించగా.. ఆదివారం ఆదిలాబాద్‌లో రైతు గర్జన పేరుతో కేటీఆర్ సభ నిర్వహించారు. కేటీఆర్ సభకు ముందే ఇంద్రవెల్లికి చేరుకున్న కవిత.. బీఆర్ఎస్నే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఆదిలాబాద్ అభివృద్ధిని పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పట్టించుకోలేదని ఆరోపించారు. మరోవైపు కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు చేశారు. కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని రేవంత్ ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు.
తుమ్మిడిహెట్టిపై కవిత ప్రశ్నలు
ఇంద్రవెల్లి సభలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును ప్రస్తావించిన కవిత.. ప్రాణహిత నదిపై ఈ ప్రాజెక్టు నిర్మించి ఉంటే 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఈ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. అలాగే ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను ఎందుకు పునరుద్ధరించలేదని కేటీఆర్‌ను నిలదీశారు. కాగజ్‌నగర్‌లో ప్రైవేట్ కాగితపు పరిశ్రమను తెరిపించినప్పుడు.. ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ రంగ పరిశ్రమను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కేటీఆర్, హరీశ్‌రావులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు.
బడే బాయ్.. చోటే బాయ్ అంటూ కేటీఆర్ సెటైర్లు
ఆదిలాబాద్ రైతు గర్జన సభలో కేటీఆర్ ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి దోపిడీకి పాల్పడుతుంటే.. కేంద్రంలో మోదీ మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పర అవగాహనతో కాంట్రాక్టులు, వ్యాపారాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలకు రూ.15 వేలు ఇస్తామన్న రేవంత్ హామీ కూడా అమలు కాలేదన్నారు. పత్తి రైతులకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు.
కవిత విమర్శలపై కేటీఆర్ మౌనం..!
కవిత ఇంద్రవెల్లి సభలో బీఆర్ఎస్ పాలన, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు, ఆదిలాబాద్ అభివృద్ధిపై నేరుగా ప్రశ్నలు సంధించినప్పటికీ.. కేటీఆర్ తన సభలో వాటిపై స్పందించలేదు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు అంశాన్ని కూడా ప్రస్తావించలేదు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పిదాల కారణంగానే కేటీఆర్ ఈ అంశాలపై మాట్లాడలేకపోయారని కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. అయితే కేటీఆర్ తన ప్రసంగంలో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీలనే లక్ష్యంగా చేసుకున్నారు.
బస్సు యాత్రకు కేటీఆర్ సిద్ధం
మరోవైపు కేటీఆర్ బస్సు యాత్రకు సిద్ధమవుతున్నట్లు మాజీ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. నవంబర్ 11 నుంచి 14 మధ్య రెండు రోజులపాటు ఈ యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. మేడిగడ్డ నుంచి ప్రారంభమయ్యే యాత్ర గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల మీదుగా సాగుతుందని చెప్పారు. ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆధారాలతో ప్రజలకు వివరిస్తామని వెల్లడించారు.



