మరోసారి డీలిమిటేషన్ బిల్లు.. త్వరలో పార్లమెంటు ముందుకు
Delimitation Bill in Parliament: పార్లమెంటు చరిత్రలో రికార్డు నమోదైంది. పార్లమెంటు సమావేశాలు ముగిసి 88 రోజులు అయినప్పటికీ.. ఇప్పటివరకు ఉభయ సభలను ప్రొరోగ్ చేయలేదు. దీంతో మరోసారి డీలిమిటేషన్ బిల్లు తెరపైకి వచ్చింది. త్వరలో పార్లమెంటు సమావేశాలు జరిగే అవకాశం ఉందని.. ఆ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుతోపాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

Delimitation Bill in Parliament: మరోసారి డీలిమిటేషన్ బిల్లు తెరపైకి వచ్చింది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును మళ్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గత ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడిన పార్లమెంటు ఉభయ సభలు ఇప్పటికీ అధికారికంగా ముగియకపోవడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 88 రోజులు గడిచిపోవడంతో 2008లో యూపీఏ ప్రభుత్వ హయాంలో నమోదైన 87 రోజుల రికార్డు సైతం అధిగమించింది.
ప్రొరోగ్ చేయని రాష్ట్రపతి.. పక్కా బీజేపీ వ్యూహం
సాధారణంగా పార్లమెంటు సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత రాష్ట్రపతి ప్రొరోగ్ ప్రకటన జారీ చేస్తారు. అయితే ప్రస్తుత సమావేశాల విషయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇప్పటివరకు ప్రొరోగ్ ప్రకటన విడుదల చేయలేదు. దీంతో పార్లమెంటు సమావేశాలు అధికారికంగా ముగియనట్లుగానే కొనసాగుతున్నాయి. సభలను ప్రొరోగ్ చేయకుండా ఉంచడం ద్వారా కేవలం రెండు రోజుల నోటీసుతోనే ఎప్పుడైనా తిరిగి సమావేశపరిచే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. 2008లో యూపీఏ ప్రభుత్వ హయాంలో పార్లమెంటు ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేసిన తర్వాత 87 రోజుల పాటు ప్రొరోగ్ చేయకుండా ఉంచారు. ఇప్పుడు ఆ రికార్డును తాజా పరిణామాలు అధిగమించాయి. నిరవధిక వాయిదా తర్వాత సభలను ఎంతకాలంలో ప్రొరోగ్ చేయాలనే విషయంలో రాజ్యాంగంలో నిర్దిష్ట కాలపరిమితి లేదని, అందువల్ల ప్రస్తుత విధానం నిబంధనలకు విరుద్ధం కాదని బీజేపీ వాదిస్తోంది. కొత్త పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేయాలంటే కనీసం 14 రోజుల ముందస్తు నోటీసు అవసరమని, అయితే ఇప్పటికే కొనసాగుతున్న సమావేశాలను తిరిగి పొడిగించేందుకు కేవలం రెండు రోజుల నోటీసు సరిపోతుందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు.
మహిళా రిజర్వేషన్.. డీలిమిటేషన్‌పై మళ్లీ చర్చ
గతంలో ఏప్రిల్ 17న లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ అమలు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. ఇప్పుడు అదే అంశాన్ని మరోసారి పార్లమెంటు ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లోక్‌సభ స్థానాలను ప్రస్తుతమున్న 543 నుంచి 850కి పెంచేలా డీలిమిటేషన్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురావాలనే ప్రయత్నాలపై బీజేపీ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఈ బిల్లుపై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించే అవకాశాలు కూడా ఉన్నాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నిరవధికంగా వాయిదా పడిన సమావేశాలను అధికారికంగా ప్రొరోగ్ చేయకపోవడంతో, అవసరమైతే తక్కువ వ్యవధిలోనే సభలను తిరిగి సమావేశపరిచేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉంటుందనే వాదన వినిపిస్తోంది.
ప్రతిపక్షాల బలాబలాలపై బీజేపీ ఆశలు
గతంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియతో పాటు పలు అంశాలపై ఇండియా కూటమి నేతలు ఆందోళనలు చేపట్టడంతో పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలు సజావుగా సాగలేదు. దీంతో ఆగస్టు 13న సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. తాజాగా రాజకీయ సమీకరణాల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. టీఎంసీ, ఎన్సీపీ-ఎస్పీ, శివసేన (UBT), ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు బీజేపీలో చేరడంతో పాటు.. ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్న పార్టీల్లో చేరిపోయారు. అంతేకాకుండా ఇండియా కూటమికి డీఎంకే దూరంగా ఉంటోందని రాజకీయ పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ మారిన రాజకీయ పరిస్థితులను అనుకూలంగా మలుచుకుని, డీలిమిటేషన్‌తో పాటు మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన మద్దతు కూడగట్టుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే మరోసారి ఈ బిల్లును తెరపైకి తీసుకొచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.



