ప్రధానికి మించిన భద్రత..! అమితాబ్ చుట్టూ ఎందుకా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు..?
Amitabh Bachchan: బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పుడు బాలీవుడ్ కంట్రోల్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తుందా..? ముందుగానే భయపడిపోయిన అమితాబచ్చన్ ఎందుకు బుల్లెట్ ఫ్రూఫ్ షీల్డ్‌తో బయటకు వస్తున్నారు..?

Amitabh Bachchan: ఒకప్పుడు ముంబై అంటేనే అండర్‌వరల్డ్.. మాఫియా గ్యాంగ్‌ల పేరు వింటేనే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వణికిపోయేవారు. అయితే పోలీసుల కఠిన చర్యలతో మాఫియా ప్రభావం క్రమంగా తగ్గింది. దీంతో బాలీవుడ్‌లో కొన్నేళ్లుగా ప్రశాంత వాతావరణం నెలకొంది. కానీ ఇప్పుడు పరిస్థితి మళ్లీ మారుతున్నట్లు కనిపిస్తోంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో వస్తున్న బెదిరింపులు, దాడుల వార్తలు బాలీవుడ్‌ను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుంటున్నారన్న ప్రచారంతో నటీనటుల్లో ఆందోళన పెరుగుతోంది.
అమితాబ్‌కు బుల్లెట్‌ప్రూఫ్ రక్షణ..
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రతి ఆదివారం ముంబైలోని తన జల్సా నివాసం బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేయడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా కొనసాగుతోంది. అయితే తాజాగా ఆయన అభిమానులను కలిసిన తీరు చర్చనీయాంశంగా మారింది. పారదర్శకమైన రక్షణ కవచం వెనుక నిలబడి అభిమానులకు అభివాదం చేశారు. అది బుల్లెట్‌ప్రూఫ్ షీల్డ్ కావడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆయన భద్రతపై పడింది. ఇటీవల బాలీవుడ్ ప్రముఖులకు వస్తున్న బెదిరింపులు, అమితాబ్ నివాసానికి వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది. అభిమానులను కలిసే సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే రక్షణ విషయంలో మాత్రం రాజీ పడటం లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. బుల్లెట్ ఫ్రూఫ్ రక్షణతోనే బయటకు రావాలని పోలీసులు సూచనలు చేసినట్లు సమాచారం. అందులో భాగంగా అమితాబ్ బుల్లెట్‌ప్రూఫ్ షీల్డ్‌తో అమితాబ్ వచ్చినట్లు తెలుస్తోంది..
//t.co/N27ETg5Bci
— ANI (@ANI) November 1, 2026
టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కలకలం..
మరోవైపు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన కాల్పుల ఘటన బాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో టైగర్ గాయపడగా, ఆయన డ్రైవర్ పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం టైగర్ కోలుకుంటున్నారని, వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారని సమాచారం. పలువురు బాలీవుడ్ ప్రముఖులతో పాటు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఆయనను పరామర్శించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ సమాచారం. ఈ కాల్పుల వెనుక అసలు లక్ష్యం ఎవరన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. తొలుత ఆమీర్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకున్నారని, అనుకున్న సమయంలో ఆయన అందుబాటులో లేకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి చేసినట్లు రాజస్థాన్ పోలీసుల విచారణలో వెల్లడైంది.
సల్మాన్ ఖాన్‌తో మొదలైన వివాదం..
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మధ్య కొనసాగుతున్న వివాదం కూడా ఈ పరిణామాలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. రాజస్థాన్‌లో కృష్ణజింకల వేట కేసు నేపథ్యంలో సల్మాన్‌పై బిష్ణోయ్ వర్గం తీవ్ర వ్యతిరేకత పెంచుకుంది. గతంలోనూ ఆయనకు పలుమార్లు బెదిరింపులు రావడం, నివాసం వద్ద కాల్పుల ఘటన చోటుచేసుకోవడం బాలీవుడ్‌లో కలకలం రేపింది. సల్మాన్‌కు సన్నిహితంగా ఉండే వ్యక్తులను, ఆయనతో సంబంధాలున్న సినీ ప్రముఖులను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బెదిరింపుల ద్వారా డబ్బులు వసూలు చేసేందుకు గ్యాంగ్ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. జైల్లో ఉన్నప్పటికీ లారెన్స్ బిష్ణోయ్ తన నెట్‌వర్క్‌ను కొనసాగిస్తున్నాడన్న అనుమానాలు దర్యాప్తు సంస్థలకు సవాలుగా మారాయి.
షూటింగ్ సెట్స్‌లోనూ భద్రతా ఆందోళనలు..
ఈ పరిణామాలతో బాలీవుడ్ నటీనటులు తమ భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. షూటింగ్‌లకు వెళ్లడం, బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనడం, అభిమానులను కలవడం వంటి సందర్భాల్లో అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గన్‌మెన్లు, బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, ప్రత్యేక భద్రతా ఏర్పాట్లకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఒకప్పుడు కెమెరాల ముందు నిర్భయంగా కనిపించిన స్టార్ హీరోలు ఇప్పుడు బయటకు రావాలంటేనే భద్రత గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందనే చర్చ సాగుతోంది. మొత్తానికి బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో వస్తున్న బెదిరింపులు, బాలీవుడ్ ప్రముఖుల చుట్టూ చోటుచేసుకుంటున్న పరిణామాలు సినీ పరిశ్రమలో కొత్త ఆందోళనకు తెరలేపాయి. అభిమానుల మధ్య సందడి చేయాల్సిన స్టార్ హీరోలు రక్షణ కవచాల వెనుక కనిపిస్తుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఒకప్పుడు ముంబై మాఫియాను చూసిన బాలీవుడ్‌కు ఇప్పుడు మరోసారి భద్రతా భయం వెంటాడుతోంది. ఈ భయానికి ఎప్పుడు తెరపడుతుందన్నది పోలీసుల దర్యాప్తు, భద్రతా చర్యలపైనే ఆధారపడి ఉంది.



