జగన్ Vs షర్మిల.. ఎక్స్ వేదికగా సవాళ్లు, ప్రతిసవాళ్లు
YS Family Dispute: వైఎస్ కుటుంబంలో వివాదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. యలహంక ప్యాలెస్పై షర్మిలకు జగన్ లేఖ రాయగా.. ఇప్పుడు ఎక్స్ వేదికగా జగన్కు షర్మిల కౌంటర్ ఇచ్చారు. దీంతో వైఎస్ రాజశేఖర్రెడ్డి కుటుంబంలో ఏం జరుగుతుందనే దానిపై చర్చ జరుగుతోంది..

YS Family Dispute: వైఎస్ కుటుంబంలో నెలకొన్న ఆస్తుల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. వైఎస్ షర్మిల కుమార్తె అంజలిరెడ్డి వివాహ వేదిక విషయంలో మొదలైన వివాదం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధానికి దారితీసింది. జగన్, షర్మిల మధ్య మొదలైన ఈ వ్యవహారం కుటుంబ సభ్యుల పేర్లతో వెలువడుతున్న లేఖల వరకు వెళ్లింది. దీంతో అసలు వైఎస్ కుటుంబంలో ఏం జరుగుతోంది..? యలహంక ప్యాలెస్ విషయంలో వివాదానికి కారణమేంటి..? అనే చర్చ మొదలైంది.
పెళ్లి కార్డుతో మొదలైన వివాదం..
వైఎస్ షర్మిల కుమార్తె అంజలిరెడ్డి వివాహాన్ని నవంబర్ 25న బెంగళూరులోని యలహంక ప్యాలెస్లో నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే వివాహ ఆహ్వాన పత్రికలను ముద్రించి బంధువులు, రాజకీయ ప్రముఖులకు అందించారు. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు వివాహ వేదికపై వివాదానికి కారణమయ్యాయి. యలహంక ప్యాలెస్లో వివాహం నిర్వహించడానికి వీల్లేదంటూ వైఎస్ జగన్.. షర్మిలకు లేఖ రాశారు. భద్రతాపరమైన కారణాలను ప్రస్తావిస్తూ, అక్కడ వివాహం నిర్వహించకూడదని జగన్ తన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. తన పరిస్థితిని, బాధను అర్థం చేసుకోవాలని కోరినట్లు వచ్చిన ఈ లేఖ కుటుంబంలో నెలకొన్న విభేదాలను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. దీంతో కుటుంబ వ్యవహారం రోడ్డుపై పడిందని వైఎస్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యలహంక ప్యాలెస్ నాదే: షర్మిల
జగన్ లేఖ నేపథ్యంలో షర్మిల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. యలహంక ప్యాలెస్ తనకు, తన పిల్లలకు దక్కిన ఆస్తి అని స్పష్టం చేశారు. ఆస్తుల పంపకాల్లో భాగంగా ఈ ప్రాపర్టీ పూర్తిగా తన వాటాకు వచ్చిందని వెల్లడించారు. “నాది కానీ దాని కోసం ఆశపడే నీచత్వం నాది కాదు. జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక, అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ.. ఆస్తుల పంపకాల్లో భాగంగా పూర్తిగా 100 శాతం నా, నా పిల్లల వాటాకు వచ్చింది. ఇది దేవుడి సాక్షిగా నిజం” అంటూ షర్మిల పేర్కొన్నారు. తన పిల్లల హక్కుగా వచ్చిన ఆస్తి కావడంతో పాటు, తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తిరిగిన ఇల్లు కావడంతో తన కుమార్తె అంజలి కోరిక మేరకు అక్కడే వివాహం నిర్వహించాలని భావించినట్లు తెలిపారు. సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు అదృష్టమని, తన కుమార్తె కూడా తాను పెరిగిన ఇల్లే పెళ్లి వేదిక కావాలని కోరుకుందని వివరించారు. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కుమార్తె కోరికను నెరవేర్చలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వివాహ వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలతో తన కుమార్తె బాధపడినందుకు విచారం వ్యక్తం చేశారు. అదే సమయంలో వివాహం పెద్దలు కుదిర్చిన సంబంధమని, ఎలాంటి వివాదాలు, గొడవలు లేకుండా పెళ్లి జరిపించాల్సిన బాధ్యత తమపై ఉందని షర్మిల స్పష్టం చేశారు. అందుకే వైఎస్ అంజలిరెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల వివాహాన్ని యలహంక నివాసంలో కాకుండా మరో వేదికపై బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కాబోయే దంపతులకు తెలుగు ప్రజల ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
— YS Sharmila (@realyssharmila) October 31, 2026
వివాదంలోకి భారతీ రెడ్డి పేరుతో మరో లేఖ..
ఇదిలా ఉంటే, ఈ వివాదం మధ్యలో వైఎస్ జగన్ భార్య భారతీ రెడ్డి పేరుతో మరో లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ప్రస్తుతం జగన్ ఉంటున్న యలహంక నివాసంతో పాటు బెంగళూరులోని ఆస్తులన్నీ తనవేనంటూ ఆ లేఖలో పేర్కొన్నట్లు ప్రచారం జరిగింది. పుట్టింటి నుంచి తనకు వచ్చిన ఆస్తులకు వైఎస్ కుటుంబంతో సంబంధం లేదని, యలహంక ప్యాలెస్ తన పేరుపై ఉందని భారతీ రెడ్డి పేరుతో వైరల్ అయిన లేఖలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ వివాదంలోకి తనను లాగవద్దని కూడా అందులో పేర్కొన్నట్లు ప్రచారం సాగింది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిన లేఖపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా ఖండించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లెటర్ ఫేక్ అని ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. షర్మిలకు వైఎస్ భారతీరెడ్డి ఎలాంటి లేఖ రాయలేదని… తప్పుడు ప్రచారం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.
వైఎస్ ఉన్నప్పుడే యలహంకలో షర్మిల గృహప్రవేశం
మరోవైపు యలహంక ప్యాలెస్ యాజమాన్యానికి సంబంధించి గతంలో జరిగిన ఓ కీలక ఘటన ఇప్పుడు తెరపైకి వచ్చింది. షర్మిలకు ఆ ఇల్లు దక్కిందని చెప్పేందుకు అప్పటి పరిణామాలే ఆధారమంటూ కుటుంబ బంధువులు ప్రస్తావిస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే యలహంకలో షర్మిల గృహప్రవేశం జరిగిందని గుర్తుచేస్తున్నారు. 2009 జనవరి 16న అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ హైదరాబాద్ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఆమెకు బేగంపేట విమానాశ్రయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి వీడ్కోలు పలికారు. అనంతరం ఆయన నేరుగా బెంగళూరులోని యలహంకకు వెళ్లారు. అక్కడ మనుమరాలు అంజలిరెడ్డి ఏడో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. అదే సందర్భంగా కుమార్తె షర్మిల గృహప్రవేశ కార్యక్రమానికి కూడా వైఎస్ దంపతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నట్లు బంధువులు చెబుతున్నారు. అప్పట్లో ఈ వ్యక్తిగత కార్యక్రమానికి సంబంధించిన వార్తలు తెలుగు పత్రికల్లో పెద్దగా ప్రచురితం కాలేదని, అయితే ప్రముఖ ఇంగ్లీష్ పత్రికలో జనవరి 16, 2009న ప్రచురితమైన కథనాన్ని ఇందుకు ఆధారంగా చూపిస్తున్నారు. వైఎస్ స్వయంగా కుమార్తె గృహప్రవేశానికి హాజరైన విషయాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తూ యలహంక ఆస్తిపై షర్మిల వాదనకు మద్దతుగా ఈ వివరాలను తెరపైకి తీసుకొస్తున్నారు.
ముదురుతున్న వైఎస్ కుటుంబ విభేదాలు
మొత్తంగా అంజలిరెడ్డి వివాహ వేదికగా మొదలైన వివాదం ఇప్పుడు యలహంక ప్యాలెస్ యాజమాన్యం, కుటుంబ ఆస్తుల పంపకాల చుట్టూ తిరుగుతోంది. ఒకవైపు జగన్ భద్రతాపరమైన కారణాలను ప్రస్తావిస్తుండగా, మరోవైపు ఆస్తి తనకు, తన పిల్లలకు చెందిందని షర్మిల స్పష్టం చేస్తున్నారు. దీనికి తోడు భారతీ రెడ్డి పేరుతో వైరల్ అయిన లేఖ, గతంలో వైఎస్ హాజరైన షర్మిల గృహప్రవేశానికి సంబంధించిన వివరాలు చర్చకు వస్తున్నాయి. దీంతో వైఎస్ కుటుంబంలో నెలకొన్న విభేదాలు మరోసారి బహిరంగ వేదికపైకి వచ్చాయి.



