Varanasi Movie Big Update: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’పై (Varanasi) రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ బయటకు వచ్చినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది. ముఖ్యంగా సినిమా విడుదల తేదీ విషయంలో గత కొంతకాలంగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారీ స్థాయిలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం అనుకున్న సమయానికి విడుదల కావడం కష్టమేనని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలన్నింటికీ ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తెరదించారు. ఓ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను మీడియా ప్రతినిధులు వారణాసి విడుదల తేదీపై ప్రశ్నించగా.. నిర్మాతలు ప్రకటించిన తేదీ అయిన ఏప్రిల్ 7నే సినిమా థియేటర్లలోకి వస్తుందని స్పష్టం చేశారు. దీంతో వాయిదా ప్రచారానికి ఒక్కసారిగా తెరపడినట్లయింది. అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

సినిమాపై పెరుగుతున్న ఆసక్తి

కాగా, ‘బాహుబలి’, ‘RRR’ వంటి అంతర్జాతీయ స్థాయి విజయాల తర్వాత రాజమౌళి (SS Rajamouli) రూపొందిస్తున్న సినిమా కావడంతో ‘వారణాసి’పై ప్రపంచవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో మహేశ్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ప్రియాంక చోప్రా (Priyanka Chopra), పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, అద్భుతమైన విజువల్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా మహేశ్ బాబు (Mahesh Babu) లుక్, పాత్ర స్వభావం, రాజమౌళి ఎంచుకున్న కథా నేపథ్యం ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాను రూపొందిస్తుండటంతో భారతీయ సినీ పరిశ్రమలోనే కాకుండా విదేశాల్లోనూ ‘వారణాసి’పై చర్చ జరుగుతోంది.

చివరి దశలో మహేశ్‌బాబు సీన్స్ షూటింగ్

సినిమా టైటిల్‌ను 2025 నవంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించిన గ్లోబ్‌ట్రోటర్ ఈవెంట్‌లో అధికారికంగా ప్రకటించారు. ఆ సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఉత్కంఠను రేకెత్తించింది. మంచుతో కప్పుకున్న అంటార్కిటికా నుంచి ఆఫ్రికా అడవుల వరకు, వారణాసిలోని (Varanasi) మణికర్ణిక ఘాట్ నుంచి పురాతన కాలం నాటి నేపథ్యాల వరకు సాగిన విజువల్స్ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ కథలో కాల ప్రయాణం, చారిత్రక అంశాలు, పౌరాణిక నేపథ్యం, హై వోల్టేజ్ యాక్షన్ వంటి ఆసక్తికరమైన అంశాలు మిళితమై ఉండనున్నట్లు గ్లింప్స్ ద్వారా స్పష్టమైంది. అంతేకాకుండా సినిమాకు సంబంధించి షూటింగ్ చివరి దశకు వచ్చినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సీజీ వర్క్‌ను విదేశాల్లో జరుగుతుందని… సినిమా పనులు సవ్యంగా జరుగుతున్నట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.

డేట్ ఫిక్స్‌ చేసిన దర్శకధీరుడు రాజమౌళి

ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేశ్ బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రాల్లో ఒకటిగా ‘వారణాసి’ నిలవనుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ సినిమాపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిని పెంచాయి. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలతో విడుదల తేదీపై స్పష్టత రావడంతో అభిమానుల ఎదురుచూపులు మరింత పెరిగాయి. అధికారికంగా ప్రకటించిన ప్రకారం 2027 ఏప్రిల్ 7న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. మరి వెండితెరపై రాజమౌళి (SS Rajamouli) ఎలాంటి అద్భుతాన్ని ఆవిష్కరిస్తారో చూడాలి