మణుగూరు ఆర్టీసీ కండక్టర్ మృతి
TGSRTC Conductor Pravalika Death: తెలంగాణ ఆర్టీసీలో పని చేస్తున్న మణుగూరుకు చెందిన కండక్టర్ ప్రవళిక మరణించింది. పది రోజుల క్రితం మణుగూరు బస్సులో నుంచి మహిళ తోసేయడంతో.. ప్రవళికకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న ప్రవళిక మరణించింది.

TGSRTC Conductor Pravalika Death: ఉదయం విధులకు వెళ్లిన ఆ యువతి.. తిరిగి ఇంటికి వస్తుందని ఎదురుచూసిన కుటుంబానికి చివరకు తీరని శోకాన్ని మిగిల్చింది. ప్రయాణికులకు సేవలందించాల్సిన ఓ మహిళా కండక్టర్.. అదే విధుల్లో ఉండగా జరిగిన ఘర్షణకు బలై ప్రాణాలు కోల్పోయారు. పది రోజులకు పైగా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన ఆమె.. చివరకు కన్నుమూయడంతో కుటుంబంలో విషాదం అలముకుంది. తెలంగాణ ఆర్టీసీలో చోటుచేసుకున్న ఈ ఘటన అందరినీ కలచివేస్తోంది.
బస్సులోనుంచి ప్రవళికను తోసేసిన మహిళ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డిపోలో 24 ఏళ్ల వయసున్న గుండ్ల ప్రవళిక కండక్టర్గా పనిచేస్తున్నారు. రోజూ మాదిరిగానే విధుల్లో భాగంగా అక్టోబర్ 25న పల్లె వెలుగు బస్సులో ప్రయాణికులకు సేవలందిస్తున్నారు. మిట్టగూడెం సమీపంలో బస్సు వెళ్తుండగా చిల్లర వ్యవహారంలో ఓ ప్రయాణికురాలితో ఆమెకు వాగ్వాదం మొదలైంది. మాటామాటా పెరగడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఆగ్రహంతో ఊగిపోయిన సదరు ప్రయాణికురాలు.. ఏకంగా కదులుతున్న బస్సులోంచి ప్రవళికను బయటకు తోసేసింది. ఊహించని ఈ పరిణామంతో ప్రవళిక రోడ్డుపై పడిపోయింది. దురదృష్టవశాత్తూ బస్సు వెనుక చక్రాల కింద పడటంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ముఖ్యంగా కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమించింది. విధుల్లో ఉండగానే ఇలా ప్రమాదానికి గురవడం ఆమె కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలింపు
వెంటనే ప్రవళికను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. అక్కడి ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందించారు. అయితే గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆమె ఆరోగ్యం విషమంగానే కొనసాగింది. కుటుంబ సభ్యులు, ఆత్మీయులు ఆమె కోలుకుని తిరిగి వస్తారని ఆశగా ఎదురుచూశారు. రోజులు గడుస్తున్నా పరిస్థితిలో ఆశించిన మార్పు రాలేదు. ఇలా పది రోజులకు పైగా మృత్యువుతో పోరాడిన ప్రవళిక.. చివరకు మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 24 ఏళ్లకే ఆమె జీవితం అర్ధాంతరంగా ముగియడం కుటుంబ సభ్యులకు తీరని లోటుగా మారింది. ప్రవళిక మరణవార్త తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతిపై సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. తక్షణ ఆర్థిక సాయంగా రూ.10 లక్షలు అందించడంతోపాటు ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా ఈ ఘటనకు కారణమైన నిందితురాలిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
సంతాపం వ్యక్తం చేసిన సీఎం రేవంత్రెడ్డి
మణుగూరు డిపోకు చెందిన మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, ప్రగాఢ విచారాన్ని వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్న ప్రవళిక అకాల మరణం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రవళిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, ఈ క్లిష్ట సమయంలో వారికి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు. ప్రవళిక ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ అపార దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు.
మణుగూరు డిపో మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ప్రవళిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.
— Telangana CMO (@TelanganaCMO) November 4, 2026
కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న పోలీసులు
మరోవైపు పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సులో నుంచి తోసేసిన మహిళను అదుపులోకి తీసుకోవడంతో పాటు.. అక్టోబర్ 25న జరిగిన ఘటనపై తోటి ప్రయాణికుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న యువ ఉద్యోగిని ఇలా ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన సాయం కొంత అండగా నిలిచినా.. తిరిగిరాని ఆమె ప్రాణాలకు మాత్రం ప్రత్యామ్నాయం లేదనే బాధ మిగిలింది.



