Telangana Congress: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వమే ఉన్నప్పటికీ, సొంత పార్టీపైనే అసమ్మతి రాగాలు వినిపించాల్సిన దుస్థితి ఏర్పడిందని వారు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా నియోజకవర్గాల అభివృద్ధి నిధుల విషయంలో తమను అస్సలు పట్టించుకోవడం లేదని ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు నిధుల కోసం అడిగి చూశామని, ఇకపైనా తమ డిమాండ్లను నిర్లక్ష్యం చేస్తే ఆమరణ నిరాహార దీక్షలు చేస్తామని పార్టీ పెద్దలకు అల్టిమేటం జారీ చేస్తున్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఆత్మహత్యలకైనా వెనుకాడబోమని కొందరు ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో హెచ్చరిస్తుండడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

అభివృద్ధి నిధుల కేటాయింపులో వివక్ష..?

నియోజకవర్గాల అభివృద్ధి నిధుల కేటాయింపులో తీవ్ర వివక్ష ఎదురవుతోందని హస్తం పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. గతంలో జరిగిన సీఎల్పీ సమావేశాల్లోనూ తాము పడుతున్న ఇబ్బందులను స్పష్టంగా ప్రస్తావించామని వారు గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ముందు సైతం తమ ఆవేదనను వెళ్లగక్కినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. మంత్రుల నియోజకవర్గాలకు బడ్జెట్ నుంచి కోట్ల రూపాయల నిధులు ఇస్తున్న ప్రభుత్వం, సాధారణ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని నేరుగా ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలమైనప్పటికీ నిధుల విషయంలో తీవ్ర వివక్షను ఎదుర్కోవడం వల్ల క్షేత్రస్థాయిలో ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

సీఎం అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూపులు!

నియోజకవర్గాల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంలో ఉన్న అత్యంత కీలకమైన వ్యక్తిని ఎన్నిసార్లు అపాయింట్‌మెంట్ అడిగినా కనీసం కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతికష్టం మీద సమయం దొరికినా గంటల తరబడి సీఎం ఓఎస్‌డీలు, పీఏల వద్ద వేచి చూడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే మూడేళ్లు కావస్తోంది. ఐదేళ్ల పదవీకాలంలో ఇక చేతిలో ఉన్నది కేవలం రెండేళ్లు మాత్రమే. అందులోనూ చివరి ఆరు నెలల సమయం ఎన్నికల హడావిడి, ప్రచారం, నోటిఫికేషన్లకే సరిపోతుంది. అంటే క్షేత్రస్థాయిలో పనులు జరగడానికి కేవలం ఏడాదిన్నర సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ లోపల నియోజకవర్గాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుందామంటే కీలక స్థానాల్లో ఉన్న నేతల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోందని ఎమ్మెల్యేలు మదనపడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయని, సొంత పార్టీని ఏమీ అనలేక లోలోన కుమిలిపోతున్నామని కొందరు నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నట్లు గాంధీభవన్‌లో వర్గాలు చెబుతున్నాయి.

నిధులివ్వకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా!

ఇటీవల జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఈ అంశాన్ని బహిరంగంగానే ప్రకటించి కలకలం రేపారు. తన నియోజకవర్గానికి పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. నిధులు లేకపోవడంతో గ్రామాల్లో ఎమ్మెల్యేలు తిరగలేకపోతున్నామని, కనీసం ఏడాదికి ఒక నియోజకవర్గానికి రూ.25 కోట్ల ఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం నియోజకవర్గ అభివృద్ధి కోసం డబ్బులు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఈ సంక్షోభ తీవ్రతను చూపిస్తోంది.

నెలకు రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్!

గతంలో జరిగిన సీఎల్పీ సమావేశాల్లో ఎమ్మెల్యేలంతా ఏకతాటిపైకి వచ్చి ఈ సమస్యను లేవనెత్తారు. ఆ సమయంలో ప్రతి నెల కనీసం రూ.2 కోట్ల బిల్లులను ఎమ్మెల్యేలకు మంజూరు చేయాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మొదట్లో కొన్ని రోజుల పాటు ఎమ్మెల్యేలకు నిధులు విడుదలైనప్పటికీ, ఆ తర్వాత మధ్యలోనే బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం ఎమ్మెల్యేలకు నెలకు కనీసం రూ.50 లక్షలు కూడా రావడం లేదని సమాచారం. ఓపిక నశించిన ప్రతిసారీ ఎవరో ఒక ఎమ్మెల్యే బహిరంగంగా తిరుగుబాటు చేస్తుండడంతో పార్టీ పెద్దలు బుజ్జగింపులకు దిగుతున్నారు. మరి ఎన్నికల ముంగిట ఎమ్మెల్యేల సమస్యకు ప్రభుత్వం ఎలాంటి ముగింపు పలకనుందో చూడాలి.