TDP Janasena BJP:  ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ కుట్రలు చేయాలని చూసిందని సీఎం చంద్రబాబు (Chandrababu Naidu)  ఆరోపించారు. మంగళవారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో కలిసి ఉమ్మడి ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు గురించి మాట్లాడారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు (Chandrababu Naidu) తెలిపారు. ‘‘పార్టీ బీ-ఫారం అందని నేతలు వెంటనే విత్‌డ్రా చేసుకోవాలి. కూటమి ప్రకటించిన అభ్యర్థికి మాత్రమే మద్దతు ఇవ్వాలి. 2024 ఎన్నికల ముందు చెప్పినట్లుగానే అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అందిస్తున్నాం. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నాం. చెప్పాం, చేశాం, చేస్తున్నాం.. అందుకే ధైర్యంగా ప్రజలను ఓట్లు అడుగుతున్నాం. వైసీపీ హయాంలో తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి రూ.32 వేల కోట్ల భారం ప్రజలపై మోపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రూ డౌన్ చేశాం’’ అని తెలిపారు. తమ పరిపాలనను చూసి ప్రజలు ఓట్లు వేయాలని సీఎం చంద్రబాబు కోరారు.

చంద్రబాబు వల్లే సీట్ల సర్దుబాటు అయింది: పవన్ కల్యాణ్

కూటమి సీట్ల సర్దుబాటు సమయంలో అర్నబ్ తుఫాన్ వచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. సీట్ల సర్దుబాటులో సీఎం చంద్రబాబు ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి, ఎక్కడ బుజ్జగించాలనేది తన అనుభవంతో నిర్ణయించారన్నారు. 659 జడ్పీటీసీ, 9,829 ఎంపీటీసీ స్థానాల్లో సర్దుబాటు చేయడం కూటమి స్ఫూర్తికి, చంద్రబాబు అనుభవానికి సాధ్యమైందన్నారు. ఇదే స్ఫూర్తితో కార్యకర్తలు, నాయకులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని పవన్ కల్యాణ్  (Pawan Kalyan)  పిలుపునిచ్చారు. ఇంత బిజీ సమయంలో కూడా సీఎం చంద్రబాబు అర్నబ్ తుఫాన్‌పై సమీక్షలు చేశారని కొనియాడారు. సంక్షోభ సమయంలో చంద్రబాబు పనిచేసే తీరు అందరికీ స్ఫూర్తినిస్తుందన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు కలిసి కూర్చొని అభ్యర్థులను ఖరారు చేశామని, తాము బీ-ఫారం ఇచ్చిన వారు మాత్రమే అభ్యర్థులని తెలిపారు. మిగతా వారు వెంటనే నామినేషన్లను ఉపసంహరించుకోవాలని పవన్ కల్యాణ్ కోరారు. కూటమి స్ఫూర్తిని అర్థం చేసుకోవడంతో పాటు అభ్యర్థి విజయం కోసం పనిచేయాలన్నారు. సీటు రాని అభ్యర్థులకు పార్టీ పరంగా న్యాయం చేస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

మంచి వాతావరణంలో ఎన్నికలు: బీజేపీ చీఫ్ మాధవ్

ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తున్నామని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ (BJP Madhav) అన్నారు. మంచి వాతావరణంలో స్థానిక ఎన్నికలకు వెళ్తున్నామని, కింది స్థాయిలో సమన్వయంతో సీట్ల సర్దుబాటు చేసుకుని ఎన్నికల బరిలో నిలిచామన్నారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత ఏకతాటిపైకి వచ్చామన్నారు. కూటమికి బీటలు వారుతాయేమోనని ప్రత్యర్థులు పెట్టుకున్న ఆశలకు అవకాశం ఇవ్వలేదన్నారు. కూటమి ఐక్యతతోనే సూపర్ ఎల్‌నినోతో పాటు ఇతర సవాళ్లను అధిగమించామన్నారు. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలనే లక్ష్యంతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తున్నామని తెలిపారు. ప్రజల ఆశీస్సులు తప్పనిసరిగా కావాలని పీవీఎన్ మాధవ్ కోరారు. (BJP Madhav)

జగన్ ప్రెస్‌మీట్ పెట్టి బెంగళూరు వెళ్తారు: చంద్రబాబు

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తాడేపల్లిలో ప్రెస్‌మీట్ పెట్టి, గవర్నర్‌ను కలిసి బెంగళూరు వెళ్లిపోతారని సీఎం చంద్రబాబు (Chandrababu Naidu) విమర్శించారు. గొడ్డలి పార్టీ నేతలకు ఇప్పుడు ఎన్నికలు జరగడం ఇష్టం లేదని మండిపడ్డారు. ఎన్నికలను అడ్డుకోవాలని వైసీపీ నేతలు 62 పిటిషన్లు వేశారని, చివరకు న్యాయస్థానం వాటిని కొట్టివేసిందని గుర్తుచేశారు. నామినేషన్ల సందర్భంగా హింస జరిగిందని మాజీ సీఎం జగన్ ఆరోపణలు చేస్తున్నారని, కుప్పం, పిఠాపురంలో నామినేషన్లు ఎలా వేశారని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారాలు చేయడం, వెంటనే విమానం ఎక్కి బెంగళూరుకు వెళ్లిపోవడం జగన్ నైజమని విమర్శించారు. జగన్ వెంటనే హింసను విడనాడి ప్రధాన స్రవంతిలోకి రావాలని సీఎం చంద్రబాబు (Chandrababu Naidu) సూచించారు. మొన్నటి వరకు వివేకా కుటుంబంలో సంక్షోభం వచ్చిందని, ఇప్పుడు సొంత కుటుంబంలో సంక్షోభం వచ్చిందన్నారు.