Miyapur Land Political War: తెలంగాణ రాజకీయాల్లో మియాపూర్ భూముల వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. మియాపూర్‌లోని వందల ఎకరాల (Miyapur Land) విలువైన ప్రభుత్వ భూములపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించడంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ మాటల యుద్ధం మొదలైంది. సుప్రీంకోర్టు తీర్పు తమ పోరాట ఫలితమేనని కాంగ్రెస్ నేతలు చెబుతుండగా, ఆ భూములను విక్రయించకుండా పేదలు, అమరవీరులు, తెలంగాణ ఉద్యమకారులకు కేటాయించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, (Revanth Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

మియాపూర్ భూములపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లోని (Miyapur Land) సర్వే నంబర్ 100లో 277 ఎకరాలు, సర్వే నంబర్ 101లో 273 ఎకరాల భూములు రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా నమోదై ఉన్నాయి. అయితే ఈ భూములపై హక్కులు తమకే ఉన్నాయని పేర్కొంటూ కొందరు ప్రైవేట్ వ్యక్తులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ వివాదంపై సుదీర్ఘకాలంగా న్యాయపోరాటం కొనసాగుతోంది. ఈ కేసుల్లో 1997లో ప్రత్యేక న్యాయస్థానం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అనంతరం 2003లో హైకోర్టు కూడా ప్రభుత్వ వాదనను సమర్థించింది. అయితే ఈ తీర్పులను సవాల్ చేస్తూ ప్రైవేట్ వ్యక్తులు సుప్రీంకోర్టును (Supremecourt) ఆశ్రయించారు. దీంతో దాదాపు 23 ఏళ్లుగా ఈ కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఇరుపక్షాల వాదనలు సుదీర్ఘంగా విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లేందుకు కోర్టు అనుమతించబోదని స్పష్టం చేసింది. సదరు భూములు ప్రభుత్వానికే చెందుతాయని తేల్చిచెప్పింది. దీంతో మియాపూర్‌లోని వందల ఎకరాల భూములపై నెలకొన్న వివాదానికి తెరపడినట్లయింది.

భూములను వేలం వేస్తాం.. అభివృద్ధి, సంక్షేమానికి నిధులు: సీఎం రేవంత్‌రెడ్డి

సుప్రీంకోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) స్పందిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. నాటి సీఎం కేసీఆర్, ఆయన బంధువు దామోదర్‌రావు, గోల్డ్ స్టోన్ ప్రసాద్ ద్వారా విలువైన మియాపూర్ భూములను కొల్లగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారని ఢిల్లీలో ఆరోపించారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా ఉన్న విలువైన భూములను కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు కబ్జా చేయాలని చూశారని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ భూకబ్జా వ్యవహారాలపై పోరాటం చేశానని రేవంత్‌రెడ్డి (Revanth Reddy) గుర్తుచేశారు. ఈ కారణంగానే తనపై కక్షగట్టి జైలుకు కూడా పంపించారని ఆరోపించారు. మియాపూర్ భూముల వ్యవహారంలో దామోదర్‌రావుకు ముందుగానే విలాసవంతమైన కార్లను లంచంగా ఇచ్చారని, కేసీఆర్‌కు నగదు రూపంలో ముడుపులు అందాయని సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూముల పరిరక్షణ కోసం న్యాయస్థానంలో బలమైన వాదనలు వినిపించిందని తెలిపారు. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో భూముల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఈ భూములను వేలం వేయాలని ప్రభుత్వం భావిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తామని ప్రకటించారు.

పేదలు, అమరవీరులు, ఉద్యమకారులకు కేటాయించాలి: కేటీఆర్

మరోవైపు మియాపూర్ భూముల వేలం ప్రతిపాదనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మియాపూర్‌లోని 550 ఎకరాల ప్రభుత్వ భూమి వస్తే విక్రయిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారని విమర్శించారు. విలువైన ప్రభుత్వ భూములను అమ్మి సొమ్ము చేసుకోవాలని చూడటం సరైన నిర్ణయం కాదన్నారు. ఆ భూములను పేదలు, అమరవీరులు, తెలంగాణ ఉద్యమకారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. మియాపూర్‌లోని 550 ఎకరాల భూముల వినియోగంపై కేటీఆర్ తన ప్రతిపాదనను కూడా వెల్లడించారు. ఇందులో 200 ఎకరాలను పేదల ఇళ్ల కోసం కేటాయించాలని, 100 ఎకరాలను అమరవీరులకు, మరో 100 ఎకరాలను తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వాలని సూచించారు. మిగిలిన భూమిలో పాఠశాలలు, కళాశాలలు నిర్మిస్తే మనస్ఫూర్తిగా స్వాగతిస్తామని చెప్పారు. ప్రభుత్వ భూములను ప్రజల అవసరాలకు వినియోగించాల్సిందే తప్ప వేలం వేసి విక్రయించకూడదన్నది తమ అభిప్రాయమని కేటీఆర్ స్పష్టం చేశారు. అంతేకాకుండా మియాపూర్ భూములను ఎవరూ కొనుగోలు చేయడానికి ప్రయత్నించవద్దని హెచ్చరించారు.

మియాపూర్ భూములపై సమయం వచ్చినప్పుడు మాట్లాడతా: కల్వకుంట్ల కవిత

మియాపూర్ భూముల వ్యవహారంపై సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఉద్యమకారులకు భూములు కేటాయించే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఆమె తప్పుబట్టారు. ఎర్రవల్లి దూరమైతే జన్వాడ ఫామ్‌హౌస్ దగ్గర్లోనే ఉందని వ్యాఖ్యానించారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి ఎర్రవల్లి గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీది ఉల్లిగడ్డ శాస్త్రం అని, సలహాలు మాత్రమే ఇస్తారు కానీ వాటిని పాటించరంటూ విమర్శించారు. జనగామలో లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించి, ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలను పట్టించుకున్న తర్వాత సలహాలు ఇస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. సెల్ఫ్ బ్యూటిఫికేషన్ కోసం రూ.10 కోట్లు ఖర్చు చేసే వారు ఉద్యమకారుల గురించి మాట్లాడితే బాగుంటుందని వ్యాఖ్యానించారు. మియాపూర్ భూములను ఉద్యమకారులకు ఇవ్వాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కవిత పరోక్షంగా కౌంటర్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.