H-1B visa Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తీసుకుంటున్న వలస విధాన నిర్ణయాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా H-1B visaలపై విధించిన భారీ రుసుము టెక్‌ కంపెనీలు, ఉద్యోగులు, వివిధ సంస్థల్లో ఆందోళనకు కారణమైంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అమెరికా ఫెడరల్‌ కోర్టులో న్యాయపోరాటం కొనసాగుతోంది. గతంలో అంతర్జాతీయ వాణిజ్యంపై ట్రంప్‌ ప్రభుత్వం విధించిన సుంకాలను కోర్టుల్లో సవాలు చేసినట్లుగానే, ఇప్పుడు H-1B వీసా రుసుము వ్యవహారం కూడా న్యాయస్థానానికి చేరింది. ఈ కేసులో తదుపరి పరిణామాలపై వీసా దరఖాస్తుదారులు, కంపెనీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

H-1B visaపై లక్ష డాలర్ల రుసుము.. కోర్టును ఆశ్రయించిన సంస్థలు

అమెరికాలోని టెక్నాలజీ రంగంతో పాటు ఇతర ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లో విదేశీ నిపుణులు పనిచేసేందుకు H-1B వీసా కీలకంగా ఉంది. అయితే, ఈ వీసా ప్రక్రియకు లక్ష డాలర్ల రుసుము విధిస్తూ ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది. దీంతో పలు సంస్థలు, కంపెనీలు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఈ రుసుము విధింపు చట్టవిరుద్ధమని పిటిషనర్లు వాదిస్తున్నారు. మరోవైపు, అమెరికా ఉద్యోగులకు ప్రాధాన్యం కల్పించాలన్న ప్రభుత్వ విధానంపై కూడా చర్చ కొనసాగుతోంది. H-1B వీసా దరఖాస్తులపై విధించిన లక్ష డాలర్ల రుసుమును సవాలు చేస్తూ దాఖలైన కేసులో త్వరితగతిన తుది తీర్పు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ఇందుకోసం సమ్మరీ జడ్జిమెంట్‌ ఇవ్వాలని కాలిఫోర్నియాలోని ఫెడరల్‌ కోర్టును అభ్యర్థించారు. అయితే, అప్పీల్‌ కోర్టు నిర్ణయం వెలువడే వరకు జిల్లా కోర్టులో విచారణను నిలిపివేయాలని ట్రంప్‌ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ కేసు ‘గ్లోబల్‌ నర్స్‌ ఫోర్స్‌ వర్సెస్‌ ట్రంప్‌’ పేరిట కొనసాగుతోంది.

అప్పీల్‌ కోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం

అక్టోబర్‌ 20న కోర్టుకు సమర్పించిన సంయుక్త నివేదికలో పిటిషనర్లు తమ వాదనలను మరోసారి ప్రస్తావించారు. H-1B వీసా ప్రాసెసింగ్‌కు లక్ష డాలర్ల రుసుము విధించడాన్ని వారు చట్టపరంగా సవాలు చేశారు. ఇదిలా ఉండగా, సెప్టెంబర్‌ 30న వెలువడిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ అక్టోబర్‌ 9న నైన్త్‌ సర్క్యూట్‌ అప్పీల్‌ కోర్టును ఆశ్రయించినట్లు ప్రభుత్వం తెలిపింది. అప్పీల్‌ కోర్టులో నిర్ణయం వెలువడే వరకు జిల్లా కోర్టులో విచారణ కొనసాగించడం వల్ల ప్రయోజనం ఉండదని వాదించింది. ఈ స్టే పిటిషన్‌పై 2027 జనవరి 14న విచారణ జరగనుంది. అప్పీల్‌ కోర్టు నిర్ణయం, అనంతరం జిల్లా కోర్టులో జరిగే పరిణామాలు H-1B వీసా రుసుము వ్యవహారంలో కీలకంగా మారనున్నాయి.

భారతీయ ఐటీ నిపుణులపై ఎలాంటి ప్రభావం?

అమెరికాలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు H-1B వీసా విధానం అత్యంత కీలకం. వీసా రుసుముపై న్యాయస్థానాల నిర్ణయం, ప్రభుత్వ విధానంలో వచ్చే మార్పులు కంపెనీల నియామక ప్రణాళికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే, ఈ కేసులో తుది తీర్పు ఇంకా వెలువడనందున లక్ష డాలర్ల రుసుము విషయంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది స్పష్టత రావాల్సి ఉంది. కోర్టుల నిర్ణయాలు వెలువడే వరకు ఈ అంశంపై ఉత్కంఠ కొనసాగనుంది.