ఆ పథకాన్ని రద్దు చేయండి సారూ!.. ఎమ్మెల్యేకు వింత విజ్ఞప్తి
కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి వింత అభ్యర్థన ఎదురైంది. తన భార్య కనిపించకుండా పోవడానికి కారణం ఉచిత బస్సు పథకం అని ఓ వ్యక్తి ఎమ్మెల్యేతో అన్నారు. మీకు రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నా.. వెంటనే ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయాలని కోరాడు.

Free Bus Scheme Controversy
తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ఫ్రీ బస్సు పథకం సూపర్ సక్సెస్ అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. వన్ ఇయర్లో ఇప్పటికే 290 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయని.. దీంతో 10వేల కోట్లకు పైగా మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆదా అయిందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 100 కోట్లకు పైగా ప్రయాణాలు జరిగితే.. స్త్రీ శక్తి పథకం ద్వారా 3,550 కోట్లకు పైగా మహిళలకు ఆదా జరిగిందంటూ ఏపీ ప్రభుత్వం లెక్కలతో సహా తెలిపింది. ప్రభుత్వాల లెక్కలు పక్కనపెడితే.. ఫ్రీ బస్సు పథకం ద్వారా రోజువారి కూలీలు, చిన్న వ్యాపారులు, మహిళలు ఎంతో లబ్ధిపొందుతున్నారు. అయితే అక్కడక్కడ ఈపథకాలకు కొంత వ్యతిరేకత(Free Bus Scheme Controversy) ఎదురవుతోంది. బస్సులు సరైన మొత్తంలో నడపడం లేదనో.. ఫ్రీ బస్సు పథకం వల్ల అందరూ మహిళలే ఎక్కుతున్నారనో.. లేదంటే చిన్న చిన్న స్టేజ్‌ల దగ్గర బస్సులు ఆపడం లేదనో ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. మనిషి అన్నాక.. మంచి, చెడు ఎలాగో.. పథకం అన్నాక రెండు ఉంటాయనేది వాస్తవం. మహిళలకు ఫ్రీ బస్సు పథకం వచ్చిన దగ్గర నుంచి కూలీలు సరైన టైంలో దొరకడం లేదని మరోవైపు రైతులు ఆరోపిస్తున్నారు. ఏదైనా పండుగ వస్తే చాలు ఒకరిని చూసి మరోకరు దేవాలయాలకు క్యూ కడుతున్నారని.. దీంతో పొలం పనులకు కూలీలు ఆగిపోతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి వింత అభ్యర్థన ఎదురైంది. బెజ్జంకి మండలం రేగులపల్లిలో జరిగిన ఓ సమావేశానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ఈసమావేశంలో బండి కనకయ్య అనే వ్యక్తి తన కుటుంబ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. తన భార్యకు తనకు మధ్య గొడవ జరగిందని.. కోపంలో మందలించడంతో.. ఆమె ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత బస్సు(Free Bus Scheme Controversy) ఎక్కి వెళ్లిపోయిందని కనకయ్య తెలిపాడు. రెండు, మూడు రోజులుగా వెతుకుతున్నా ఆమె ఆచూకీ లభించలేదని ఎమ్మెల్యేతో చెప్పి బాధపడ్డాడు. ఇప్పటికే ఆమెను వెతికేందుకు రెండు, మూడు వేలకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. తన భార్య కనిపించకుండా పోవడానికి కారణం మీ సర్కార్ తీసుకువచ్చిన ఉచిత బస్సు పథకమే సారు అని కనకయ్య అన్నారు. మీకు రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నా.. వెంటనే ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయండి లేదంటే.. సంసారాలు నాశనం అవుతున్నాయని కోరాడు. కనకయ్య మాటాలతో ఒక్కసారి ఎమ్మెల్యే షాక్ గురయ్యాడు. అతని బాధను తెలుసుకుని ఓదార్చాడు. మహిళ ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులకు ఫిర్యాదు చేయాలని కనకయ్యకు సూచించారు. మీ ఒక్కరి విషయంలోనే ఇలా జరిగింది. రాష్ట్రంలో సర్కార్ తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకం వల్ల ఎంతో మంది మహిళలు ప్రయోజనం పొందుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు.



