Dark Heroism Trend in Tollywood: సినిమాల్లో హీరో ఎప్పుడూ మంచివైపే ఉంటాడు. అన్యాయాన్ని ఎదిరించడం, ఆపదలో ఉన్నవారిని కాపాడటం, సమాజంలో చెడును అంతం చేయడం కథానాయకుడి ప్రధాన లక్షణాలు. అయితే కాలం మారుతున్న కొద్దీ హీరోల వ్యక్తిత్వంతో పాటు వారి పోరాట విధానం కూడా మారుతోంది. ఒకప్పుడు న్యాయం కోసం పోరాడే హీరోలు ఇప్పుడు అదే లక్ష్యం కోసం మరింత క్రూరమైన మార్గాలను ఎంచుకుంటున్నారు. ప్రత్యర్థులపై కనికరం లేకుండా విరుచుకుపడుతూ, రక్తపాతంతో కూడిన పోరాటాలకు తెరతీస్తున్నారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో ఈ మార్పే ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్తపుంతలు తొక్కుతోంది..

స్టార్ హీరోల సినిమాల్లోనూ డార్క్ షేడ్స్

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న పలు భారీ చిత్రాల్లో డార్క్ హీరోయిజం ప్రధాన ఆకర్షణగా మారుతోంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న స్పిరిట్‌లో కథానాయకుడు పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నప్పటికీ, ఆయన పాత్రలో బలమైన డార్క్ షేడ్స్ ఉంటాయనే ప్రచారం సాగుతోంది. సాధారణంగా పోలీస్ పాత్ర అంటే చట్టాన్ని గౌరవిస్తూ నేరస్తులను శిక్షించే వ్యక్తిగా చూపిస్తారు. కానీ ఈ సినిమాలో హీరో వ్యక్తిత్వం, నేరాలను ఎదుర్కొనే విధానం భిన్నంగా ఉండబోతున్నాయనే ఆసక్తి నెలకొంది. మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ కూడా డార్క్ హీరోయిజం కోణంలోనే చర్చకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలతో ఈ సినిమాలో కథానాయకుడి పాత్ర ఎంతటి తీవ్రతతో ఉండబోతోందనే ఆసక్తి పెరిగింది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న రాకాలో మూడు విభిన్న పాత్రలు కనిపించనున్నాయనే ప్రచారం ఉండగా, వాటిలో ఒక పాత్ర పూర్తిగా డార్క్ షేడ్స్‌తో సాగుతుందనే ప్రచారం వినిపిస్తోంది.

ప్రేక్షకుల అభిరుచిలో మార్పే ప్రధాన కారణమా..?

డార్క్ హీరోయిజం పెరగడానికి ప్రేక్షకుల అభిరుచిలో వస్తున్న మార్పులు ఒక ముఖ్యమైన కారణంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యువతలో తీవ్రమైన యాక్షన్, క్రూరమైన పోరాటాలు, ప్రతీకారంతో కూడిన కథలపై ఆసక్తి పెరుగుతోంది. హీరో కేవలం విలన్లను ఓడించి విజయం సాధించడం కంటే, తనకు ఎదురైన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ఎంతటి విధ్వంసానికైనా సిద్ధపడే పాత్రలను ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. గతంలో హీరో పోరాటంలో ధైర్యం, తెగువ, న్యాయం ప్రధానంగా కనిపించేవి. ఇప్పుడు వాటితో పాటు ఆవేశం, క్రూరత్వం, ప్రతీకార భావన కూడా కథానాయకుడి పాత్రలో భాగమవుతున్నాయి. ప్రత్యర్థులను ఓడించడమే కాకుండా, వారిని పూర్తిగా తుదముట్టించే స్థాయిలో హీరో పాత్రను తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలోనే గ్రే షేడ్స్, డార్క్ షేడ్స్ ఉన్న కథానాయకులకు ఆదరణ పెరుగుతోంది.

యానిమల్, ధురంధర్‌తో మరింత పెరిగిన క్రేజ్

డార్క్ హీరోయిజం ట్రెండ్‌కు ఇటీవల కాలంలో వచ్చిన కొన్ని చిత్రాలు మరింత ఊపునిచ్చాయి. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్‌లో కథానాయకుడి పాత్రలో కనిపించిన విపరీతమైన ఆవేశం, హింసాత్మక ప్రవర్తన, ప్రతీకార భావన ప్రేక్షకుల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అలాగే ఆదిత్య ధర్ రూపొందించిన ధురంధర్ చిత్రాల సిరీస్‌లోనూ తీవ్రమైన యాక్షన్, రక్తపాతంతో కూడిన సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాల విజయాలు, వాటిపై ప్రేక్షకుల్లో ఏర్పడిన ఆసక్తి మేకర్స్‌ను కూడా కొత్త తరహా కథల వైపు ఆలోచించేలా చేస్తున్నాయి. కేవలం మంచితనంతో కూడిన హీరో పాత్రలకే పరిమితం కాకుండా, లోపాలు, ఆవేశం, ప్రతీకార స్వభావం కలిగిన కథానాయకులను సృష్టిస్తున్నారు.

గ్రే హీరోయిజం నుంచి డార్క్ హీరోయిజం వరకు..

గతంలో తెలుగు సినిమాల్లో కథానాయకుడి పాత్ర చాలా స్పష్టంగా ఉండేది. మంచి కోసం నిలబడటం, చెడును ఎదిరించడం, అమాయకులను రక్షించడం వంటి లక్షణాలే హీరో పాత్రకు ప్రామాణికంగా ఉండేవి. ఆ తర్వాత కథల్లో మార్పులు రావడంతో చట్టాన్ని సైతం పక్కనపెట్టి బాధితుల తరఫున పోరాడే కథానాయకులు తెరపైకి వచ్చారు. ఇలాంటి పాత్రల్లో హీరో చేసే పనులు పూర్తిగా సరైనవేనా అనే ప్రశ్నకు అవకాశం ఉండేది. అయినప్పటికీ అతడి లక్ష్యం మంచిదనే కోణంలో కథను నడిపించేవారు. ఇదే క్రమంలో గ్రే షేడ్స్ ఉన్న హీరో పాత్రలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ప్రత్యర్థులపై కనికరం చూపకుండా దాడి చేయడం, ప్రతీకారం కోసం విధ్వంసానికి దిగడం వంటి అంశాలు కథల్లో కీలకంగా మారుతున్నాయి. దీంతో గ్రే హీరోయిజం దాటి డార్క్ హీరోయిజం వైపు తెలుగు సినిమా ప్రయాణిస్తోంది.

సెన్సార్ నిబంధనలు.. మేకర్స్‌కు పెరిగిన స్వేచ్ఛ

సినిమాల్లో హింసను చూపించే విషయంలోనూ గతంతో పోలిస్తే పరిస్థితులు మారాయి. ఒకప్పుడు కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని హింసాత్మక సన్నివేశాలపై మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు. కథకు అవసరమైన మేరకే పోరాటాలను చూపిస్తూ, అతిగా రక్తపాతం లేకుండా జాగ్రత్తపడేవారు. కానీ ఇప్పుడు కథ స్వభావాన్ని బట్టి హింసాత్మక సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాంటి చిత్రాలకు ఏ సర్టిఫికెట్ తీసుకుని విడుదల చేసేందుకు కూడా నిర్మాతలు సిద్ధమవుతున్నారు. అవసరాన్ని బట్టి సెన్సార్ సూచించే మార్పులు, కట్స్‌ను పరిగణనలోకి తీసుకుంటూ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. దీంతో దర్శకులు తమ కథల్లోని చీకటి కోణాలను మరింత బలంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే డార్క్ హీరోయిజం పేరుతో ప్రతి సినిమాలోనూ హింసను అతిగా చూపించడం ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.