YS Sharmila vs Jagan: షర్మిల.. బ్రదర్ ఆఫ్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఇద్దరూ రెండు కళ్లు. కానీ 2019 తర్వాత పరిస్థితి మారిపోయింది. వైఎస్ మరణానికి ముందే ఆస్తులు సమానంగా పంచి ఇచ్చారని సన్నిహితులు, బంధువులు చెబుతుంటారు. కానీ ఇద్దరి మధ్య ఆస్తుల విషయంలోనే పంచాయతీ వచ్చింది. ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జగన్‌ను విభేదించిన షర్మిల.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతటితో తన పొలిటికల్ జర్నీకి బ్రేకులు వేయకుండా.. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలి పదవిని తీసుకున్నారు. ఆ తర్వాత కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ‘మా అన్న జగన్‌మోహన్‌రెడ్డి అవినీతిపరుడని.. మా బాబాయ్‌ను చంపించింది ఎవరో విచారణ చేయించకుండా అడ్డుపడ్డ ఘనుడంటూ’ నోటికి వచ్చినట్లు చెప్పేశారు. ఫలితంగా 2024 ఎన్నికల్లో ఇంటిపోరు చేసిన నష్టంతో ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా షర్మిల కూల్‌గా ఉంటుందా అంటే నథింగ్.. నా దారి రహదారి కాదు.. అడ్డదిడ్డమైన దారి.. అది జగన్‌మోహన్‌రెడ్డికి ఎదురెళ్లే దారి అంటూ విమర్శల డోసు పెంచారు.

మున్సిపల్ ఎన్నికల ముందు యలహంక పంచాయతీ

మన పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెబుతుంటారు. ఇంటిపోరుతో బయట ఏం సాధించలేమని.. అదే సరిగ్గా యాప్ట్ అయింది జగన్‌మోహన్‌రెడ్డికి. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపాలిటీ, పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి యాక్షన్‌లోకి దిగిపోయారు. ‘నియోజకవర్గాల్లో ఏకగ్రీవాలు జరిగితే సీటు ఇచ్చేది లేదు’ అంటూ జగన్‌మోహన్‌రెడ్డి తన నోటి నుంచి ఆర్డర్ పాస్ చేశారు. అంతే.. వెంటనే నియోజకవర్గ సమన్వయకర్తలు హుటాహుటిన గ్రామాల్లో, పట్టణాల్లో పోటీకి ఆసక్తి చూపిస్తున్న వారు ఎవరంటూ వారి లిస్ట్‌ను రెడీ చేయించారు. అభ్యర్థులు సిద్ధమని అనుకున్నారు. కానీ సరిగ్గా అదే సమయంలో మరోసారి వైఎస్ షర్మిల ఎంట్రీ ఇచ్చారు. ‘నా కుమార్తె పెళ్లిని యలహంక ప్యాలెస్‌లో చేస్తున్నాను’ అంటూ ఇన్విటేషన్ కార్డులను పంచిపెట్టారు. అప్పటి వరకు షర్మిల కుమార్తె అంజలిరెడ్డి వివాహం ఏదో కన్వెన్షన్‌లో చేస్తారని జగన్‌మోహన్‌రెడ్డి అనుకున్నారు. కానీ పెళ్లి కార్డుల్లో యలహంక ప్యాలెస్ పేరు ఉండటంతో ఒక్కసారిగా షాక్‌కు గురైనట్లు సమాచారం. వెంటనే యలహంకలో పెళ్లి చేయడానికి వీల్లేదని.. భద్రతా సమస్యలు వస్తాయని మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా షర్మిలకు లేఖను పంపించారు. ఇన్నాళ్లూ యలహంక ప్యాలెస్ గురించి వినడమే తప్ప.. ఎప్పుడూ చూడలేదనుకునే వారు.. షర్మిల కుమార్తె వివాహంతో ఆ లోటు తీరిపోతుందని భావించారు.

ఎలక్షన్స్‌కు బ్రేక్.. ఫ్యామిలీ పంచాయతీల్లో జగన్

ఓ వైపు ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపాలిటీలు, పరిషత్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న సమయంలో జగన్‌కు యలహంక పంచాయతీ తలనొప్పిగా మారింది. పార్టీ కార్యక్రమాలకు ఒకరోజు హాజరై వెంటనే బెంగళూరు వెళ్లిపోయేవారు. అలా ఎలక్షన్స్ ముందు జగన్ ఫోకస్ చేయలేకపోయారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దానికి కారణం షర్మిల కుమార్తె అంటూ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. 25 రోజులుగా ఈ వ్యవహారం గురించి రోజూ కుటుంబ సభ్యులు, సన్నిహితులతో చర్చించినట్లు సమాచారం. చివరకు పులివెందుల్లో ఓటు వేసి తిరిగి వద్దామనుకున్న జగన్‌కు నిరాశ తప్పలేదు. వైసీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి రానివ్వడం లేదంటూ ఆర్వో కార్యాలయం దగ్గర ధర్నా చేశారు. చివరకు ఓటు వేయకుండా జగన్ పులివెందుల నుంచి బెంగళూరు వెళ్లిపోయారు. మున్సిపల్ ఎన్నికల రోజున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ జరిగినా.. జగన్ మాత్రం వాటిని పట్టించుకోలేదని.. ఫ్యామిలీ పంచాయతీలో బిజీ అయ్యారంటూ వైసీపీ నేతలే బాహాటంగా చెప్పుకొచ్చారు.

చెల్లి దెబ్బ.. టీడీపీ ఖాతాలోకి పులివెందుల

పులివెందుల.. కేరాఫ్ వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోట. అలాంటి పులివెందులను టీడీపీ కైవసం చేసుకుంది. ఎన్నడూ లేని విధంగా పులివెందుల మున్సిపాలిటీలో అత్యధిక వార్డులను తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడంతో పాటు.. చైర్‌పర్సన్ అభ్యర్థిని సైతం విజయం సాధించారు. దీంతో 1974 తర్వాత తొలిసారి వైఎస్ కుటుంబం నుంచి పులివెందుల చేజారిపోయింది. వైనాట్ పులివెందుల అంటూ చంద్రబాబు స్లోగన్‌ను కూటమి కార్యకర్తలు నిజం చేశారు. 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పులివెందుల, కడప మున్సిపాలిటీలను వైసీపీ గెలిచింది. కానీ తాజా ఎన్నికల్లో కడప, పులివెందుల మున్సిపాలిటీల్లో జగన్ పార్టీ నేతలు ఘోర ఓటమి పాలయ్యారు. షర్మిల కుమార్తె వివాహ వేడుక వ్యవహారం పార్టీ ఓడిపోయేలా చేసిందంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఇంటిపోరుతో వచ్చే నష్టం అంతా ఇంతా కాదని చెప్పడానికి నిదర్శనమే జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహారమంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది..