ఏకగ్రీవాలపై జగన్ స్టాండ్ ఏంటి..?
YS Jagan on Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఏకగ్రీవాలపై వైసీపీ ఏం చేస్తుందనే దానిపై పార్టీ నేతల్లో చర్చ మొదలైంది. నియోజకవర్గాల్లో ఏకగ్రీవాలు జరిగితే వచ్చే ఎన్నికల్లు సీటు ఇవ్వనంటూ తేల్చి చెప్పారు. పులివెందులలో ఏకగ్రీవాలు జరిగాయి. మరీ జగన్ పరిస్థితి ఏంటని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు.

YS Jagan on Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) చేసిన వ్యాఖ్యలను కూటమి నేతలు మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. ముఖ్యంగా ఏకగ్రీవాల విషయంలో జగన్ గతంలో చేసిన హెచ్చరికలు, ప్రస్తుతం కనిపిస్తున్న రాజకీయ పరిస్థితులను పోల్చి చూస్తూ విమర్శలు చేస్తున్నారు. ఒక్క స్థానం కూడా ఏకగ్రీవం కాకూడదని, పోటీకి దూరంగా ఉంటే సహించేది లేదని అప్పట్లో గట్టిగా హెచ్చరించిన జగన్‌కు (YS Jagan). క్షేత్రస్థాయిలో రాజకీయ వాస్తవాలు ఇప్పుడు అర్థమవుతున్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో కేవలం పైస్థాయి నాయకుల హెచ్చరికలు, ఆదేశాలతోనే కిందిస్థాయి పార్టీ కార్యకలాపాలు. క్షేత్రస్థాయిలో పార్టీకి ఎంత బలం ఉంది? నాయకులు, కార్యకర్తల్లో ఎంత విశ్వాసం ఉంది? ప్రజల్లో పార్టీ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉంది? అనే అంశాలే కీలకంగా మారతాయి. ఈ విషయాన్ని వైసీపీ (YSRCP) నాయకత్వం ఇప్పటికైనా గుర్తించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఏకగ్రీవాలపై తీవ్రంగా స్పందించిన నాయకత్వం, ఇప్పుడు పెద్ద సంఖ్యలో స్థానాలు ఏకగ్రీవం అవుతున్న పరిస్థితిని ఎలా అర్థం చేసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
రాయలసీమపై ఫోకస్ పెంచిన టీడీపీ..!
ఏకగ్రీవాల విషయంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఈ తరహా వివాదాలు పెద్దగా కనిపించలేదు. నామినేషన్లు అడ్డుకున్నారనే ఆరోపణలు కూడా పెద్దగా వినిపించలేదు. కానీ రాయలసీమలో మాత్రం ఈ వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. వైసీపీకి బలమైన పట్టున్న ప్రాంతం రాయలసీమ కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఓటమి పాలైనప్పటికీ, ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే రాయలసీమలోనే ఆ పార్టీకి అత్యధికంగా ఓట్లు వచ్చాయి. అందుకే రాయలసీమలో వైసీపీని రాజకీయంగా దెబ్బతీస్తే, ఆ పార్టీ మళ్లీ కోలుకోవడం కష్టమవుతుందనే వ్యూహంతో టీడీపీ ముందుకు వెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే వైసీపీకి (YSRCP) బలమైన పట్టున్న కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలతో పాటు కర్నూలుపైనా టీడీపీ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఏకగ్రీవాలు సాధించడమే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లినట్లు కూటమి నేతలు చెబుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయకపోయి ఉంటే ఈ సంఖ్య మరింత భారీగా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పల్నాడు జిల్లాలోనూ అత్యధిక సంఖ్యలో ఏకగ్రీవాలు జరగడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఏకగ్రీవాలతో వైసీపీలో మొదలైన ఆందోళన
ఈ పరిణామాలు వైసీపీ నేతలు, కార్యకర్తల్లో కొంత నిరాశను పెంచుతున్నట్లు కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇలాగే ఉంటే పార్టీ మళ్లీ పుంజుకోవడం సాధ్యమేనా? అనే సందేహాలు కేడర్‌లో మొదలవుతున్నాయి. మొన్నటివరకు జగన్ ఏదో ఒక కార్యక్రమం పేరుతో నిర్వహించిన యాత్రలకు భారీగా జనం హాజరవుతున్నారనే ప్రచారం జరిగింది. దీంతో జగన్‌పై ప్రజల్లో క్రేజ్ తగ్గలేదని, ఆయనంటే కూటమి నేతలు భయపడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ (YSRCP) మళ్లీ అధికారంలోకి వస్తుందనే ప్రచారాన్ని పార్టీ అభిమానుల్లో కొందరు బలంగా నమ్మారు. అయితే క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ పరిణామాలు ఆ అంచనాలకు భిన్నంగా కనిపిస్తున్నాయి. వైసీపీకి బలమైన పట్టుందని భావిస్తున్న ప్రాంతాల్లోనే ఏకగ్రీవాలు ఎక్కువగా జరగడం ద్వారా ఆ పార్టీ క్షేత్రస్థాయి బలం ఎంత ఉందనే ప్రశ్నను తెరపైకి తీసుకురావాలని టీడీపీ ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
పెద్దిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డికి జగన్ టికెట్లు ఇవ్వరా?
నియోజకవర్గాల్లో ఏకగ్రీవాలు జరిగితే, నామినేషన్లు వేయకుండా ఏకగ్రీవాలకు సహకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనంటూ గతంలో జగన్ (YS Jagan) చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు వైసీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో పార్టీ నేతలు, కార్యకర్తల్లో పోరాట స్ఫూర్తి నింపేందుకు జగన్ ఈ హెచ్చరికలు చేసినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో అవే వ్యాఖ్యలు పార్టీ నేతలకు కొత్త తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా ఏకగ్రీవాలు జరిగిన నియోజకవర్గాల్లోని నాయకులకు ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన మొదలైంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాయచోటిలో గడికోట శ్రీకాంత్‌రెడ్డితో పాటు మరికొంతమంది నియోజకవర్గ సమన్వయకర్తలకు వచ్చే ఎన్నికల్లో జగన్ (YS Jagan) టికెట్లు ఇస్తారా..? లేదా..? అనే చర్చ వైసీపీలో మొదలైంది. తమ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు పోటీ లేకుండా ఏకగ్రీవం కావడం వెనుక పరిస్థితులు ఏమైనప్పటికీ, గతంలో జగన్ చేసిన హెచ్చరికల ప్రకారం ఇప్పుడు వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. మరీ ముఖ్యంగా పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అక్కడ ఏకగ్రీవమైన నాయకులందరికీ వచ్చే ఎన్నికల్లోనూ అవకాశం కల్పిస్తారా..? లేక పార్టీ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో పక్కన పెడతారా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇదే పరిస్థితి ఇతర నియోజకవర్గాల్లోనూ ఉండటంతో సమన్వయకర్తల్లో టెన్షన్ పెరుగుతోంది.
జగన్ సొంత నియోజకవర్గంలో ఏకగ్రీవాలు
ఇక అందరినీ ఆశ్చర్యపరిచే మరో విషయం పులివెందుల నియోజకవర్గంలోనూ ఏకగ్రీవాలు జరగడం. వైసీపీకి కంచుకోటగా భావించే పులివెందులలోనే ఈ పరిస్థితి ఎదురవడంతో పార్టీ అధినేత జగన్ (YS Jagan) గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే ఇబ్బందికరంగా మారాయనే చర్చ సాగుతోంది. ఏకగ్రీవాల విషయంలో ఇతర నేతలకు హెచ్చరికలు చేసిన జగన్, ఇప్పుడు తన సొంత నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఎదురైన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఏకగ్రీవాల వ్యవహారం వైసీపీకి రాజకీయంగా పెద్ద టాస్క్‌గా మారింది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఇప్పటి నుంచే టికెట్లపై అనిశ్చితి ఏర్పడటం వైసీపీ నాయకత్వానికి కొత్త సవాలుగా మారే అవకాశం ఉంది.



