TDP Jana Sena Alliance Sweeps: ఒకప్పుడు వైసీపీకి కంచుకోటగా భావించిన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జగన్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కూటమి అభ్యర్థులు అన్ని చోట్లా విజయదుందుభి మోగించారు. చంద్రబాబు నాయుడి పాలనా దక్షత, కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి సానుకూల స్పందన లభించడంతో ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. సామాజికవర్గాల సమీకరణాలు కూడా అధికార కూటమికి అనుకూలంగా మారాయి. గోదావరి జిల్లాలు ఎప్పుడూ విలక్షణమైన రాజకీయ తీర్పును ఇస్తుంటాయి. బీసీ సామాజికవర్గాలు, కాపులు అధికంగా ఉండే ఈ జిల్లాల రాజకీయాల్లో క్షత్రియ సామాజికవర్గం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ నగరపాలక సంస్థలతో పాటు మండపేట, కొవ్వూరు, నిడదవోలు, అమలాపురం, పెద్దాపురం, పిఠాపురం, సామర్లకోట, రామచంద్రపురం, తుని, ఏలేశ్వరం, గొల్లప్రోలు, ముమ్మిడివరం మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి.

తూర్పుగోదావరిలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ

తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్సార్‌సీపీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. జిల్లావ్యాప్తంగా 96 కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు జరగగా, కేవలం మూడు చోట్ల మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మండపేటలో మొత్తం 36 వార్డులనూ కూటమి కైవసం చేసుకుంది. కొవ్వూరులో 28 వార్డులకు గాను 27 చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. నిడదవోలులో 32 వార్డులకు గాను 14 చోట్ల జనసేన, 13 చోట్ల టీడీపీ, ఒక చోట బీజేపీ విజయం సాధించాయి. మూడు చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందగా, మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.

గత ఎన్నికల అక్రమాలపై విమర్శలు

2021లో జరిగిన ఎన్నికల సమయంలో అప్పటి వైఎస్సార్‌సీపీ పాలకులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పలు చోట్ల బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని, ఎన్నికల సమయంలో అక్రమాలకు పాల్పడ్డారని, వాటిని ప్రశ్నించిన వారిపై కేసులు బనాయించారని ఆరోపణలు వచ్చాయి. అయితే ప్రస్తుత ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడంతో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ అభీష్టానికి అనుగుణంగా తీర్పునిచ్చారు. కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు మున్సిపాలిటీపై జనసేన జెండా ఎగురవేసింది. మున్సిపల్ చైర్మన్‌గా జనసేన అభ్యర్థి కడారి తమ్మయ్య నాయుడు విజయం సాధించారు. మొత్తం 19 వార్డుల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందగా, వైసీపీ ఒక్క వార్డులో కూడా విజయం సాధించలేకపోయింది. ఇతరులు నాలుగు వార్డుల్లో విజయం సాధించారు.

పిఠాపురంలో పవన్ ప్రభావం

పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోనూ జనసేన హవా కొనసాగింది. మున్సిపల్ చైర్మన్‌గా జనసేన అభ్యర్థి దానం లాజర్‌బాబు గెలుపొందారు. మొత్తం 20 వార్డుల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించగా, వైసీపీ కేవలం ఒక్క వార్డుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సామర్లకోట మున్సిపల్ పీఠాన్ని కూడా జనసేన కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్‌గా జనసేన అభ్యర్థి పిట్టా జానకిరామారావు విజయం సాధించారు. మొత్తం 23 వార్డుల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందగా, వైసీపీ కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైంది. ఏలేశ్వరం మున్సిపాలిటీలో టీడీపీ పాగా వేసింది. చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ అక్షిత విజయం సాధించారు. పెద్దాపురం మున్సిపల్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి రాజా సూరిబాబు రాజు విజయం సాధించారు. మొత్తం 23 వార్డుల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందగా, వైసీపీ కేవలం ఒక్క వార్డులో మాత్రమే విజయం సాధించింది. కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీ కూడా కూటమి ఖాతాలో చేరింది. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా జనసేన అభ్యర్థి శరగణం శ్రీలత విజయం సాధించారు.

కోనసీమలోనూ కూటమిదే పైచేయి

కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి మేడిశెట్టి శేషారావు విజయం సాధించారు. మొత్తం 21 వార్డుల్లో కూటమి అభ్యర్థులు, మూడు వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. ముమ్మిడివరం మున్సిపాలిటీని జనసేన తన ఖాతాలో వేసుకుంది. చైర్‌పర్సన్‌గా జనసేన అభ్యర్థి గుబ్బల గంగారత్నభవాని విజయం సాధించారు. మొత్తం 17 వార్డుల్లో కూటమి అభ్యర్థులు, ఆరు వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. అమలాపురం మున్సిపాలిటీపై కూడా కూటమి జెండా ఎగిరింది. మున్సిపల్ చైర్మన్‌గా జనసేన అభ్యర్థి నల్లా శ్రీధర్ విజయం సాధించారు. మొత్తం 30 వార్డుల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందగా, వైసీపీ కేవలం ఆరు వార్డులకే పరిమితమైంది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో చేరింది. చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి కంఠమని విజయలక్ష్మి విజయం సాధించారు. అన్ని వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులే గెలుపొందారు. మండపేటలోనూ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తన సత్తా చాటింది. మున్సిపల్ చైర్మన్‌గా వేగుళ్ల అజయ్‌కుమార్ విజయం సాధించారు. అన్ని వార్డులనూ కూటమి అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. నిడదవోలు మున్సిపాలిటీలో జనసేన సత్తా చాటింది. చైర్‌పర్సన్‌గా మురాల జ్యోతి విజయం సాధించారు.

కూటమి ఐక్యతకు గోదావరి తీర్పే నిదర్శనం

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు కూటమికి తిరుగులేని ఆధిక్యాన్ని అందించాయి. గోదావరి ప్రజలు చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారనే సంకేతాన్ని ఈ ఫలితాలు ఇచ్చాయి. కూటమి పార్టీల మధ్య సమన్వయం, ఐక్యత ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కావడంతో జనసేన శ్రేణులు ప్రతి మున్సిపాలిటీ ఎన్నికనూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఫలితంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.