November Telugu Movies: తెలుగు, తమిళ, హిందీ, హాలీవుడ్ చిత్రాలతో నవంబర్ నెల సినీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు సిద్ధమవుతోంది. స్టార్ హీరోల కొత్త సినిమాల ప్రకటనలు, భారీ చిత్రాల టీజర్లు, క్రేజీ ప్రాజెక్టుల విడుదలలతో ఈ నెలలో ప్రతి వారం సినీ సందడి నెలకొననుంది. ముఖ్యంగా రామ్ చరణ్–సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమా నుంచి రష్మిక మందన్న మైసా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హైందవ వరకు పలు చిత్రాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

నవంబర్ 1 నుంచే బిగ్ మూవీస్ సందడి

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించనున్న తదుపరి సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది. పెద్ది తర్వాత ఆయన చేయబోయే ఈ క్రేజీ ప్రాజెక్టుకు సుకుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా నవంబర్ 1న ప్రారంభం కానున్నట్లు సమాచారం. దీంతో నెల మొదటి రోజే మెగా అభిమానుల్లో సందడి మొదలుకానుంది. ఇక నవంబర్ 2న బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కింగ్ మూవీ టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్ 4న రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న రామాయణం–1 ప్రివ్యూ ప్రదర్శించనుండగా, నవంబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. వీటితో పాటు సూర్య నటించిన సీన్, నయనతార మహాశక్తి, విజయ్ ఆంటోనీ నాన్నకుట్టి వంటి సినిమాలు కూడా ప్రేక్షకులను పలకరించనున్నాయి. మొత్తానికి నవంబర్ తొలి వారమే సినీ ప్రియులకు భారీ వినోదాన్ని అందించనుంది.

రెండో వారంలో భోగి హవా

నవంబర్ 12న శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కిన భోగి విడుదల కానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అదే రోజున గోట్ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. నవంబర్ 13న దొంగ నా కొడుకు, ఇట్లు అర్జునతో పాటు డార్క్ చాక్లెట్, రోమియో–జూలియట్, టాల్కమ్ పౌడర్, డానీ వంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. విభిన్న కథలు, భిన్నమైన జానర్లలో రూపొందిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

మూడో వారంలో రీ-రిలీజ్‌తో పాటు కొత్త సినిమాల సందడి

నవంబర్ మూడో వారం కూడా సినీ అభిమానులకు ప్రత్యేకంగా నిలవనుంది. నవంబర్ 19న కల్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ఈ నగరానికి ఏమైంది రీ-రిలీజ్ కానుంది. మరోవైపు నవంబర్ 20న సన్నీ డియోల్ నటించిన సూర్య విడుదల కానుంది. అదే రోజున దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటించిన ఆకాశంలో ఒక తార, ధనుష్–మమ్ముట్టి కాంబినేషన్‌లో రూపొందిన ఓమ్–చాప్టర్ 1: ఉధిరమ్, మెట్రో లవర్ వంటి చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అంతేకాదు, హాలీవుడ్ నుంచి ది హంగర్ గేమ్స్: సన్‌రైజ్ ఆన్ ది రీపింగ్ కూడా విడుదల కానుంది. దీంతో మూడో వారంలో అన్ని భాషల సినిమాల మధ్య ఆసక్తికరమైన పోటీ కనిపించనుంది.

చివరి వారంలో మైసా, హైందవపై భారీ అంచనాలు

నవంబర్ చివరి వారం తెలుగు ప్రేక్షకులకు మరింత ప్రత్యేకంగా మారనుంది. నవంబర్ 27న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన హైందవ, రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైసా (Maayasa) విడుదలకు సిద్ధమవుతున్నాయి. వీటితో పాటు హై అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక బాలీవుడ్ నుంచి ఇమ్రాన్ హష్మీ నటించిన గన్ మాస్టర్ జీ-9, ఆయుష్మాన్ ఖురానా నటించిన యే ప్రేమ్ మోలియా సినిమాలు అదే రోజున విడుదల కానున్నాయి. దీంతో నెల చివరి వారంలోనూ బాక్సాఫీస్ వద్ద సందడి తగ్గేలా కనిపించడం లేదు. మొత్తంగా చూస్తే నవంబర్ నెల సినీ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాంటి వినోదాన్ని అందించనుంది. ముఖ్యంగా తెలుగు సినిమాల విషయానికి వస్తే రెండో వారంలో శర్వానంద్ భోగి, మూడో వారంలో ఈ నగరానికి ఏమైంది రీ-రిలీజ్, దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార, చివరి వారంలో రష్మిక మైసా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హైందవ సినిమాలపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. స్టార్ హీరోల క్రేజ్, ఆసక్తికరమైన కథలు, భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాల్లో ఏవి హిట్ టాక్ సొంతం చేసుకుంటాయి..? ఏ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి..? మరి కొన్ని రోజుల్లోనే తేలిపోనుంది..?