KTR: గురువుపై పొగడ్తలు.. శిష్యుడిపై విమర్శలు
KTR Praises Chandrababu Naidu: సీఎం చంద్రబాబుపై పొగడ్తలు కురిపించిన కేటీఆర్

KTR Praises Chandrababu Naidu: తెలంగాణలో గోదావరి, కృష్ణా జలాల చుట్టూ రాజకీయం మరింత వేడెక్కుతోంది. ఎల్‌నినో సమయంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి ముందుచూపు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడుతోంది. అంతేకాకుండా ప్రభుత్వం సకాలంలో గోదావరి జలాలను తరలించకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని కేటీఆర్ (KTR) ప్రెస్‌మీట్ పెట్టి మరీ తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఇదంతా ఒక ఎత్తయితే.. మరోవైపు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై (Chandrababu Naidu) మాజీ మంత్రి కేటీఆర్ పొగడ్తల వర్షం కురిపించారు. సీఎం చంద్రబాబు ముందుచూపు వల్ల ఏపీపై ఎల్‌నినో ప్రభావం పడలేదని అన్నారు.
కరువు ప్రభావం ఏపీలో పెద్దగా లేదు: KTR
తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలన (Chandrababu Naidu), నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ కరువు పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్న ఆయన, చంద్రబాబు (Chandrababu Naidu) తన సమర్థవంతమైన పాలనతో కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటున్నారని అన్నారు. అందువల్లే ఏపీలో కరువు తీవ్రత అంతగా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమయ్యారని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కమీషన్లు ఇస్తేనే పనులు జరుగుతున్నాయని ఆరోపించారు.
మూసీ పేరుతో దోపిడీకి సిద్ధమయ్యారు: KTR
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ (KTR) సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో 17 నుంచి 20 శాతం మాత్రమే వర్షపాతం లోటు ఉందన్నారు. అయితే తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎల్‌నినోను తీసుకొచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ మూసీ సుందరీకరణ పేరుతో లక్ష కోట్ల రూపాయల దోపిడీకి సిద్ధమయ్యారని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ (Congress) పాలిత రాష్ట్రాల్లో పరిపాలన ఎలా సాగుతుందో రాహుల్ గాంధీకి తెలుసా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు కరువుతో తెలంగాణ ప్రజలు అల్లాడిపోతుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సుందరీకరణ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. ముందుగా కరువు నివారణకు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
చంద్రబాబుపై గతంలో తీవ్ర విమర్శలు
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుపై (Chandrababu Naidu) కేటీఆర్ (KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టయినప్పుడు హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఆ సమయంలో చంద్రబాబుపై కేటీఆర్ విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అరెస్టు చేస్తే తెలంగాణలో ఆందోళనలు ఎందుకు? అని ప్రశ్నించారు. అంతేకాకుండా ఐటీ ఉద్యోగుల ఆందోళనలకు నాటి బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై (Chandrababu Naidu) కేటీఆర్ ప్రశంసలు కురిపించడం సంచలనంగా మారింది. తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందా..? అనే రాజకీయ చర్చ ప్రస్తుతం తెలంగాణలో నడుస్తోంది.
పట్టిసీమ నుంచి ఐదు వందల టీఎంసీల నీటి తరలింపు
విపత్కర ఎల్‌నినో ప్రభావంతో లోటు వర్షపాతంతో అల్లాడుతున్న అన్నదాతకు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అండగా నిలిచింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలకు ఈ ప్రాజెక్టు ఎంతో మేలు చేసింది. దీనిద్వారా గోదావరి జలాలు పారకపోతే అన్నపూర్ణగా పేరొందిన కృష్ణా డెల్టా ఎడారిగా మారి ఉండేది. 2015 నుంచి డెల్టా రైతులకు పట్టిసీమ పథకం ఆయువుపట్టుగా మారింది. ఆ ఏడాది ట్రయల్ రన్ నిర్వహించిన నాటి నుంచి ఇప్పటి వరకు 500 టీఎంసీల నీటిని ఎత్తిపోసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది సుమారు 60 టీఎంసీల నీటిని ప్రకాశం బ్యారేజీకి తరలించినట్లు ప్రభుత్వ లెక్కలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా పోలవరం ఎడమ కాలువ నుంచి విశాఖపట్నానికి నీటిని తరలించే ప్రయత్నాలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. గోదావరి జలాలను ఒడిసిపట్టుకోవడం వల్లే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు సస్యశ్యామలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.



