AP Ration Shop Subsidy Prices

ఎల్‌నినో ప్రభావంతో దేశంలో నిత్యవసర సరుకులు ఆకాశాన్ని తాకుతున్నాయి. గడిచిన రెండు నెలల కాలంలోనే నిత్యావసర ధరలు రెట్టింపు అయ్యాయి. మార్కెట్‌కి రూ.1000 తీసుకెళ్తే కవర్ నిండా కూడా సరుకులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో సమాన్యుడు కడుపు నిండా తినే పరిస్థితి లేకుండా పోయింది. పెరుగుతున్న నిత్యావసరాలతో ప్రజలు పడుతున్న కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఈక్రమంలోనే ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. సామాన్యులకు ఉపశమనం కల్పించేలా వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే నాణ్యమైన బియ్యం, ఉల్లిపాయలు రైతు బజార్లలో తక్కువ ధరకే అందిస్తున్నారు. ఇప్పుడు నిత్యావసర సరుకుల(AP Ration Shop Subsidy Prices) విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ధరల నియంత్రణపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సామాన్యులకు అవసరమైన నిత్యావసరాలను తక్కువ ధరకు అందించేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవస్థను దీపావళి నుంచి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

దీపావళి నుంచి తక్కువ ధరకే సరుకులు
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కందిపప్పు, పామాయిల్‌, గోధుమ పిండి వంటి సరుకులను అందుబాటు ధరల్లో అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వంపై నెలకు రూ.100 కోట్లకు పైగా భారం పడినా సరే ప్రజలకు మేలు చేకూరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈక్రమంలో బహిరంగ మార్కెట్‌లో కిలో రూ. 150 నుంచి రూ. 200 పలుకుతున్న కందిపప్పును రేషన్‌ కార్డు దారులకు కేవలం రూ. 100 లకే అందించాలని సర్కార్‌ నిర్ణయించింది. అదే విధంగా లీటర్ పామాయిల్ రూ. 125, గోధుమ పిండి రూ. 25 కే ప్రజలకు సరఫరా చేయాలని స్పష్టం చేసింది. దీపావళి పండుగ నాటికి అన్ని రేషన్‌ డిపోలలో సబ్సిడీ సరుకులు(AP Ration Shop Subsidy Prices) అందుబాటులో ఉంచి ప్రజలకు పంపిణీ చేయాలని ఆదేశించారు సీఎం.

అన్నిచోట్ల ధరణి బియ్యం విక్రయాలు
మరోవైపు ఇప్పటికే నగరాల్లోని రైతు బజార్లలో ధరణి బ్రాండ్‌ పేరుతో నాణ్యమైన బియ్యాన్ని సామాన్యులకు అందిస్తోంది ఏపీ కూటమి ప్రభుత్వం. బయట మార్కెట్‌లో రూ. 70 పలుకుతున్న బియ్యాన్ని.. కేవలం రూ.50లకే అందిస్తోంది. ఇప్పటివరకు సిటీలకే పరిమితమైన ఈ ధరణి బ్రాండ్ బియ్యాన్ని.. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, మండల కేంద్రాలకు విస్తరించాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే మొబైల్ వాహనాల ద్వారా ప్రజల దగ్గరకే వెళ్లి ఫైన్ రకం బియ్యం కిలో రూ. 49 కి, సూపర్ ఫైన్‌ రకం బియ్యాన్ని రూ. 50 చొప్పున విక్రయించాలని స్పష్టం చేశారు. బీపీటీ స్టీమ్ బియ్యాన్ని కిలో రూ. 66కు, సాధారణ స్టీమ్ బియ్యాన్ని రూ. 47కు మించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రజలకు మేలు చేసేలా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈపథకాలు పక్కదారి పట్టకుండా అధికారులు చెక్ పోస్టుల దగ్గర భద్రత పెంచాలని సీఎం సూచించారు.

ప్రభుత్వ లక్ష్యం అదే..
ఇక పెరిగిన ఉల్లి ధరలను నియంత్రించేలా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రైతు బజార్లలో కేవలం కిలో రూ. 35 లకే అందిస్తోంది. త్వరలో మరో 800 మెట్రిక్ టన్నుల ఉల్లిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అందరికి ఉల్లిపాయలు అందేలా చర్యలు తీసుకోవాలని .. ధరలు(AP Ration Shop Subsidy Prices) మరింత తగ్గేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. మరోవైపు అధికారులు కూడా ఎప్పటికప్పుడు నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ .. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నప్పటికీ.. ధరల పెరుగుదల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించడమే కూటమి సర్కార్‌ లక్ష్యమన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లక్షలాది మంది సామాన్య ప్రజలకు మంచి చేకూరనుంది. ప్రభుత్వం నిర్ణయంపై హర్షం వ్యక్తంఅవుతోంది.