AP Cyclone Alert

అర్నబ్ గాయం మానక ముందే మరో తుపాన్‌ హెచ్చరిక ఏపీని భయపెడుతోంది. మరో ఉపద్రవం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా(AP Cyclone Alert) మారింది. ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్ర ప్రాంతాల్లో ఇది కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో ఆదివారం సాయంత్రానికి తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని IMD తెలిపింది. పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతున్న ఈ వాయుగుండం, సోమవారం సాయంత్రం నాటికి ఏపీలో తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరీ ముఖ్యంగా నవంబర్‌ 2, 3 తారీఖుల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మరికొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వార్నింగ్ పాస్ చేసింది.

IMD హెచ్చరికతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తుగా అలర్ట్ అయింది. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాలను అప్రమత్తం చేస్తోంది. అల్పపీడనం(AP Cyclone Alert) ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అంచనా వేస్తోంది. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.