TDP Alliance Victory: ఊహించిందే జరిగింది. ఆశించిన ఫలితమే వెలువడింది. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. కార్పొరేషన్ల నుంచి మున్సిపాలిటీల వరకు ఎక్కడ చూసినా కూటమి పార్టీలదే ఆధిపత్యం. ఒకట్రెండు చోట్ల వైసీపీ గట్టి పోటీ ఇచ్చినట్లు కనిపించినా.. అంతిమంగా ఉత్తరాంధ్రను కూటమి క్లీన్‌స్వీప్‌ చేసింది. గత పాతికేళ్లుగా గెలుపు దక్కని ఇచ్ఛాపురం మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పీఠాన్ని సైతం ఈసారి టీడీపీ (Telugu Desam Party) కైవసం చేసుకోవడం అక్కడి రాజకీయ పరిణామాలకు అద్దం పడుతోంది. ప్రలోభాలకు అవకాశం లేదు.. బెదిరింపులకు తావులేదు.. బలవంతపు ఏకగ్రీవాలు లేవు.. రిగ్గింగ్‌లు, బూత్‌ క్యాప్చరింగ్‌లకు చోటు లేదు. నేరుగా, హోరాహోరీగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కూటమి పార్టీలు తిరుగులేని విజయాన్ని నమోదు చేశాయి.

భోగాపురంతో కూటమిపై ప్రజల్లో నమ్మకం

ప్రజల మద్దతుతో విజయభేరి మోగించాయి. ఉత్తరాంధ్ర తమ కంచుకోట అంటూ గొప్పలు చెప్పుకున్న వైసీపీకి (YSRCP Defeat) ఈ ఫలితాలు గట్టి ఎదురుదెబ్బగా మారాయి. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో ఒకప్పుడు విశాఖ ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నించిన జగన్‌మోహన్‌రెడ్డికి అసెంబ్లీ ఎన్నికల్లోనే కాకుండా, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓటర్లు గట్టి సమాధానం ఇచ్చారు. గ్రామాలైనా, పట్టణాలైనా, నగరాలైనా.. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధికే పట్టం కడతామని ఉత్తరాంధ్ర ప్రజలు తమ తీర్పు ద్వారా స్పష్టం చేశారు. తమ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసే కూటమి పార్టీలకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అభివృద్ధికి పెద్దపీట వేస్తూనే సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి లోటు రానివ్వబోమని కూటమి నేతలు ఇచ్చిన భరోసా ప్రజల్లోకి బలంగా వెళ్లినట్లు కనిపిస్తోంది.

అభివృద్ధి మంత్రంతో ఓటర్ల మనసు గెలిచిన కూటమి

ఉత్తరాంధ్రలో పరిశ్రమల రాక, విశాఖ కేంద్రంగా సాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పెరుగుతున్న ఉపాధి అవకాశాలు ఓటర్లను ప్రభావితం చేసిన అంశాలుగా కనిపిస్తున్నాయి. డేటా సెంటర్ల వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రావడం ప్రాంత భవిష్యత్తుకు శుభపరిణామమని ప్రజలు భావిస్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుంది. రహదారులు, జాతీయ రహదారుల విస్తరణతో ప్రాంతీయ అనుసంధానం మరింత మెరుగుపడుతోంది. విశాఖను దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దే సామర్థ్యం కూటమి ప్రభుత్వానికి ఉందన్న విశ్వాసం ప్రజల్లో పెరిగినట్లు ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి విజయనగరం వరకు, విశాఖపట్నం నుంచి అనకాపల్లి వరకు ఓటర్ల తీర్పు ఒకే విధంగా కనిపించింది. అభివృద్ధి, ఉపాధి, మౌలిక సదుపాయాలే తమ ప్రాధాన్యాలని ఓటర్లు స్పష్టం చేశారు.

కార్పొరేషన్లలో కూటమి విజయదుందుభి

ఉత్తరాంధ్రలోని విజయనగరం, విశాఖపట్నం కార్పొరేషన్లలోనూ కూటమి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రెండు కార్పొరేషన్లలోనూ టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. విశాఖపట్నంలో దాదాపు 90 శాతం కార్పొరేటర్ స్థానాలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. రాష్ట్ర వాణిజ్య రాజధానిగా పేరొందిన విశాఖ నగర మేయర్‌గా టీడీపీ అభ్యర్థి ముక్కా శ్రావణి ఘనవిజయం సాధించారు. గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ఎంతగా మారిందో ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. విజయనగరం కార్పొరేషన్‌లోనూ అత్యధిక కార్పొరేటర్ స్థానాలను కూటమి అభ్యర్థులే దక్కించుకున్నారు. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి అవనాపు భార్గవి విజయం సాధించారు. దీంతో ఉత్తరాంధ్రలోని రెండు ప్రధాన కార్పొరేషన్లలోనూ కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

ఇచ్ఛాపురంలో పాతికేళ్ల తర్వాత టీడీపీ జెండా

కార్పొరేషన్లలోనే కాదు.. ఉత్తరాంధ్ర మున్సిపాలిటీల్లోనూ కూటమి విజయపరంపర కొనసాగింది. ఒక్క మున్సిపాలిటీలోనూ వైసీపీ చైర్‌పర్సన్ పీఠాన్ని దక్కించుకోలేకపోయింది. ముఖ్యంగా ఇచ్ఛాపురం మున్సిపాలిటీ ఫలితం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. పాతికేళ్ల విరామం తర్వాత ఇచ్ఛాపురం మున్సిపాలిటీపై టీడీపీ పట్టు సాధించింది. చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి ఆసి లీలారాణి విజయం సాధించారు. మొత్తం 19 వార్డుల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందగా, వైసీపీ కేవలం ఏడు వార్డులకే పరిమితమైంది. ఈ ఫలితం ఇచ్ఛాపురంలో టీడీపీకి తిరిగి పెరిగిన ప్రజాదరణను చాటిచెప్పింది. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలోనూ తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసింది. టీడీపీ అభ్యర్థి గంగాభవాని చైర్‌పర్సన్‌గా విజయం సాధించారు. మొత్తం 31 వార్డులను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకోగా, వైసీపీ కేవలం నాలుగు వార్డులకే పరిమితమైంది.

పాలకొండ, పార్వతీపురంలో టీడీపీ విజయాలు

పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి పల్లా విజయనిర్మల విజయం సాధించారు. పార్వతీపురం మున్సిపాలిటీలో టీడీపీ అభ్యర్థి బెలగాం కరుణ గెలుపొందారు. సాలూరులో స్వతంత్ర అభ్యర్థి గుల్ల మంజీర విజయం సాధించారు. ఆమె టీడీపీ (Telugu Desam Party) రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించడం విశేషం. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి మున్సిపాలిటీలోనూ తెలుగుదేశం పార్టీ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టీడీపీ అభ్యర్థి రాంబార్కి రేణుకాదేవి స్వప్న చైర్‌పర్సన్‌గా విజయం సాధించారు. మొత్తం 23 వార్డుల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందగా, వైసీపీ మూడు వార్డులకే పరిమితమైంది. మరో వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.

అనకాపల్లిలో అయ్యన్న కుటుంబం పట్టు.. యలమంచిలిలో బీజేపీ జయకేతనం

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో చింతకాయల కుటుంబం మరోసారి తన రాజకీయ పట్టును నిరూపించుకుంది. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి విజయం సాధించారు. నర్సీపట్నంలో కూటమి సాధించిన ఘనవిజయంతో అయ్యన్నపాత్రుడు రాజకీయ ప్రాబల్యం మరోసారి చర్చనీయాంశమైంది. ఇక్కడ మొత్తం 37 వార్డులను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. మరోవైపు యలమంచిలి మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ తన సత్తా చాటింది. బీజేపీ అభ్యర్థి పిళ్లా రమాకుమారి చైర్‌పర్సన్‌గా భారీ మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 21 వార్డుల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందగా, వైసీపీ కేవలం ఆరు వార్డులకే పరిమితమైంది.

ఉత్తరాంధ్రలో వైసీపీకి గట్టి రాజకీయ ఎదురుదెబ్బ

మొత్తంగా చూస్తే ఉత్తరాంధ్రలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి సాధించిన విజయాలు వైసీపీకి గట్టి రాజకీయ ఎదురుదెబ్బగా నిలిచాయి. ఒకప్పుడు ఉత్తరాంధ్ర తమకు తిరుగులేని రాజకీయ అడ్డా అని భావించిన వైసీపీకి ప్రజల తీర్పు ఊహించని షాక్ ఇచ్చింది. అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలు, సంక్షేమం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకెళ్తున్న కూటమికి ప్రజలు మరోసారి తమ మద్దతు ప్రకటించినట్లు ఈ ఫలితాలు తెలియజేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజాభిమానం తగ్గలేదని కూటమి నిరూపించుకుంది. ఉత్తరాంధ్రలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయనే సంకేతాలను ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టంగా ఇచ్చాయి.