రాప్తాడులో నరరూప రాక్షసుడి ఘాతుకం
Rapthadu School Attack: అనంతపురం జిల్లా రాప్తాడులో దారుణం జరిగింది. స్కూల్లో పాఠాలు వింటున్న విద్యార్థినిపై నరరూప రాక్షసుడు రంపంతో దాడికి తెగబడ్డాడు.

Rapthadu School Attack: అనంతపురం జిల్లా రాప్తాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రశాంతంగా పాఠాలు వింటున్న పదో తరగతి విద్యార్థినిపై ఓ ఉన్మాది చెట్లు నరికే యంత్రంతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఒక్కసారిగా పాఠశాలలోకి ప్రవేశించిన దుండగుడు.. తరగతి గదిలో ఉన్న బాలిక వద్దకు వెళ్లి చేతిలోని యంత్రంతో ముఖం, తల, వీపు భాగాలపై దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక రక్తపు మడుగులో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఆమెను కాపాడేందుకు మరో విద్యార్థిని అడ్డుగా వెళ్లగా.. దుండగుడు ఆమెపైనా దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఓ ఉపాధ్యాయుడికి కూడా గాయాలైనట్లు స్థానికులు చెబుతున్నారు. దాడి అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. పాఠశాలలో జరిగిన ఈ ఘటనతో విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తమ కళ్ల ముందే తోటి విద్యార్థినిపై దాడి జరగడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న విద్యార్థినిని పరామర్శించారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
అనంతపురం జిల్లా రాప్తాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దాడి ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తరగతి గదిలో విద్యార్థినిపై రంపంతో అత్యంత అమానుషంగా దాడి చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు అందుతున్న వైద్య చికిత్స వివరాలపై ఆరా తీశారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని జిల్లా పోలీసు అధికారులను సీఎం ఆదేశించారు.
చెల్లిని చూసి కన్నీళ్లు ఆగడం లేదు: మంత్రి లోకేశ్
రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై జరిగిన దాడి ఘటనపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ఉన్మాదుల ఆగడాలను ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. గాయపడిన చిన్నారిని తరగతి గదిలో రక్తపు మడుగులో చూసిన తర్వాత కన్నీళ్లు ఆగడం లేదని, గుండె బరువెక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాప్తాడులో జరిగిన ఈ దారుణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఆడపిల్లలు, మహిళల వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించే వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
— Lokesh Nara (@naralokesh) October 31, 2026
నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం: మంత్రి అనిత
రాప్తాడులో విద్యార్థినిపై జరిగిన అమానుష దాడి ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై అనంతపురం జిల్లా ఎస్పీతో మాట్లాడిన మంత్రి.. దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
— Anitha Vangalapudi (@Anitha_TDP) October 31, 2026



