రామాయణతో వెండితెరపై మరో అద్భుత ప్రపంచం
Ramayana Movie Review Telugu: ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామాయణం సినిమా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే సినిమాపై మిశ్రమ స్పందన వినిపిస్తోంది. అయితే, సినిమా ఆద్యంతం విజువల్ వండర్‌గా నిలుస్తోంది.

Ramayana Movie Review Telugu: భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పౌరాణిక చిత్రం రామాయణ (Ramayana Movie) థియేటర్లలోకి వచ్చేసింది. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా (Sai Pallavi), కన్నడ స్టార్ యష్ (Yash)రావణుడిగా నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వం వహించారు. వాల్మీకి రామాయణ ఇతిహాసాన్ని సరికొత్త టెక్నాలజీతో వెండితెరపై ఆవిష్కరించారు. పలు భారతీయ భాషల్లో 3డీ ఫార్మాట్లో రూపొందించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ ప్రీమియర్ల నుంచి వస్తున్న స్పందన చిత్రంపై ఆసక్తిని మరింత పెంచుతోంది.
రాముడిగా రణ్‌బీర్.. సీతగా సాయిపల్లవి మెరుపులు
శ్రీరాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. రాముడి పాత్రకు అవసరమైన ప్రశాంతత, గాంభీర్యం, దైవత్వాన్ని తన హావభావాల్లో చక్కగా పలికించారు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటన ప్రత్యేకంగా నిలుస్తుంది. సీతాదేవిగా సాయిపల్లవి (Sai Pallavi) మరోసారి తన సహజమైన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పాత్రకు తగ్గట్టుగా సంప్రదాయబద్ధమైన హావభావాలు, భావోద్వేగాలను పర్ఫెక్ట్గా ప్రదర్శించారు. రాముడి పాత్రతో ఆమెకు సంబంధించిన సన్నివేశాలు సినిమాకు మంచి భావోద్వేగ బలాన్ని అందించాయి. ఈ చిత్రంలో అత్యంత ఆసక్తికరమైన పాత్రల్లో రావణుడి పాత్ర ఒకటి. రాకింగ్ స్టార్ యష్ (Yash)తన పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చారు. రావణుడి పరాక్రమం, అహంకారం, వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని దర్శకుడు సరిగా చూపించారు. ముఖ్యంగా రావణుడి పది గొంతులకు సంబంధించిన సన్నివేశంలో యష్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ తనదైన ముద్ర వేశారు.
కథకు కొత్తరూపం ఇచ్చిన దర్శకుడు
రామాయణ గాథ అందరికీ సుపరిచితమే అయినప్పటికీ, దర్శకుడు నితీష్ తివారీ ఈ ఇతిహాసాన్ని కొత్త దృశ్యకోణంలో ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం చేశారు. శ్రీధర్ రాఘవన్ అందించిన స్క్రీన్‌ప్లేకు ఆధునిక సాంకేతికతను జోడించి భారీ విజువల్ ఎక్స్పీరియన్స్ అందించారు. కథలోని ప్రధాన ఘట్టాలను భావోద్వేగాలు, నాటకీయత, అద్భుతమైన విజువల్స్‌తో తెరకెక్కించారు. అయితే కొన్ని కుటుంబ నేపథ్య సన్నివేశాలు, భావోద్వేగ ఘట్టాలు ముందే ఊహించే విధంగా సాగడంతో అక్కడక్కడా కథనం కొంత నెమ్మదించినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ కీలక సన్నివేశాల్లో వచ్చే ఉత్కంఠ, అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేస్తాయి. సినిమాలోని భారీ యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకులకు కనువిందు చేస్తాయి.
హనుమంతుడిగా సన్నీ డియోల్.. సీక్వెల్‌పై ఆసక్తి..
సినిమా చివరి భాగంలో వచ్చే మరో ఆసక్తికరమైన అంశం హనుమంతుడి పాత్ర పరిచయం. ప్రముఖ నటుడు సన్నీ డియోల్ ఆంజనేయుడిగా కనిపించడం ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది. ఆయన పాత్రకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హనుమంతుడి పరిచయంతో తదుపరి భాగంపై అంచనాలు మరింత పెరిగాయి. రాబోయే కథలో ఈ పాత్ర ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకులు హ్యాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పౌరాణిక కథకు (Ramayana Movie) తగిన సంగీత వాతావరణాన్ని సృష్టించడంలో వీరి ప్రయత్నం కనిపిస్తుంది. కొన్ని కొన్ని సీన్లలో మ్యూజిక్ అంతగా బాగాలేదని ప్రేక్షకులు అంటున్నారు. మొత్తానికి దీపావళికి ముందు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా.. కలెక్షన్లలో వండర్‌గా నిలుస్తోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.



