పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు.. డోంట్ కేర్ అంటున్న ప్రజలు
Indian Wedding Season: వచ్చే రెండు నెలలు తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ మొదలవుతోంది. ఎల్‌నినో ఉన్నప్పటికీ.. 38 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.

Indian Wedding Season: ఒకవైపు ఎల్‌నినో భయాలు.. మరోవైపు ఆర్థిక, ఆరోగ్య, వాతావరణ పరిస్థితులపై ఆందోళనలు.. అయినా పెళ్లిళ్ల విషయంలో మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. చేయాల్సిన శుభకార్యాలను ఎలాగైనా పూర్తి చేయాలనే ఆలోచనతో కుటుంబాలు సిద్ధమవుతున్నాయి. దీపావళి తర్వాత ప్రారంభం కానున్న పెళ్లిళ్ల సీజన్‌పై ఇప్పటికే వ్యాపార వర్గాల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోయినా, పెళ్లిళ్ల రూపంలో జరిగే వ్యాపారం మాత్రం ఈసారి కూడా జోరుగా సాగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేస్తోంది. గత ఏడాది ఇదే సమయంలో దేశవ్యాప్తంగా దాదాపు 32 లక్షలకు పైగా వివాహాలు జరగ్గా, సుమారు రూ.4 లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు అంచనాలు చెబుతున్నాయి. మరి ఈసారి ఎక్కడ ఎంత వ్యాపారం జరగనుంది.. ఏ రంగానికి ఎంత మేర లాభం చేకూరనుంది.. అన్నది ఆసక్తికరంగా మారింది.
నవంబర్, డిసెంబర్లో శుభముహూర్తాలు ఇవే
ఈ సంవత్సరం నవంబర్ నెలలో 1, 21, 24, 25, 26 తేదీల్లో శుభప్రదమైన ముహూర్తాలు ఉన్నాయి. అలాగే డిసెంబర్లో 2, 3, 4, 5, 6, 11, 12 తేదీల్లో శుభముహూర్తాలు ఉండటంతో ఈ తేదీల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగే అవకాశం ఉంది. ఈ సీజన్‌లోని మంచి ముహూర్తాల్లో తెలుగు రాష్ట్రాల్లో సుమారు 38 లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉందని ఒక అంచనా. దీంతో మెయిన్‌లైన్ రిటైల్ రంగంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా ప్రకారం వివాహాల ఖర్చుల ఆధారంగా వ్యాపారం ఈ విధంగా ఉండనుంది. రూ.3 లక్షల లోపు ఖర్చుతో సుమారు 7 లక్షల వివాహాలు, రూ.6 లక్షల లోపు ఖర్చుతో 8 లక్షల వివాహాలు, రూ.10 లక్షల లోపు ఖర్చుతో 10 లక్షల వివాహాలు, రూ.15 లక్షల లోపు ఖర్చుతో 7 లక్షల వివాహాలు, రూ.25 లక్షల లోపు ఖర్చుతో 5 లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉంది. అలాగే రూ.50 లక్షల లోపు ఖర్చుతో 50 వేల వివాహాలు, రూ.కోటి దాటిన ఖర్చుతో మరో 50 వేల వివాహాలు జరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పెళ్లంటే గుర్తుకు వచ్చేది బంగారం
పెళ్లి ముహూర్తాలు ఈ ఏడాది బాగానే ఉండటంతో నిర్వాహకులు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారు. పెళ్లంటే ముందుగా కొనుగోలు చేయాల్సింది బంగారు ఆభరణాలే. స్వర్ణకారులు వేల సంఖ్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ వృత్తిపై ఆధారపడి ఉంటారు. దసరా, దీపావళి పండుగలతో పాటు వివాహాల సమయంలో ప్రముఖ పట్టణాల్లో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. అమ్మాయి తల్లిదండ్రులు తమ కుమార్తె వివాహ సమయంలో కొత్త అల్లుడికి బంగారు ఆభరణాన్ని కానుకగా ఇవ్వడం ఆనవాయితీ. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర భారీగా ఉన్నప్పటికీ, ప్రజలు తమ స్థాయిని బట్టి ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయక తప్పని పరిస్థితి. మరోవైపు ముంబై, చెన్నై, హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల నుంచి వ్యాపారులు ఆభరణాలతో పాటు బంగారు బిస్కెట్ల రూపంలో కూడా కొనుగోళ్లు చేసి తీసుకొస్తుంటారు. అయితే ధరలు పెరగడంతో ప్రస్తుతం అమ్మకాలు సగానికి పడిపోయాయని వర్తకులు వాపోతున్నారు.
భారీ ఆశలు పెట్టుకున్న వ్యాపారులు
మొత్తానికి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభానికి ముందే మార్కెట్లో సందడి మొదలైంది. బంగారం, వస్త్రాలు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్, క్యాటరింగ్, డెకరేషన్, ఫంక్షన్ హాళ్లు.. ఇలా ప్రతి రంగానికీ ఈ సీజన్ కీలకం కానుంది. ఒకవైపు ఎల్‌నినో భయాలు, మరోవైపు పెరిగిన ధరలు వెంటాడుతున్నా.. మన దగ్గర శుభకార్యాల విషయంలో మాత్రం వెనకడుగు వేసే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే ఈ పెళ్లిళ్ల సీజన్‌పై వ్యాపార వర్గాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి.



