Cyclone Arnab:  ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను అర్నబ్‌ తుపాను వణికిస్తోంది. బలమైన ఈదురుగాలులు, కుండపోత వర్షాలతో పలు జిల్లాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. యానాంకి దక్షిణంగా, నరసాపురం సమీపంలో తుపాను తీరం దాటే ప్రక్రియ కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం దాటే సమయంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. విశాఖపట్నం నుంచి బాపట్ల వరకు తుపాను ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. తీరం దాటిన తర్వాత తుఫాన్ ప్రభావం మరింత ఉధృతంగా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు.. ఉత్తరాంధ్రపై అర్నబ్ (Cyclone Arnab) తీవ్ర ప్రభావం చూపించింది.

గోదావరి జిల్లాల్లో తుపాను అలజడి

అర్నబ్‌ తుపాను ప్రభావంతో గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉధృతమైన గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. కొన్ని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాకినాడ జిల్లా కుంభాభిషేకం రేవు వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలల ఉద్ధృతికి దెబ్బతిన్న బోట్లను ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పరిశీలించారు. తుని మండలం డి.పోలవరం వద్ద భారీ చెట్టు కూలిపోవడంతో తుని–నర్సీపట్నం మధ్య రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది చెట్టును తొలగించే పనులు చేపట్టారు.

అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu) అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఇప్పటివరకు ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు సీఎంకు వివరించారు. కొన్ని జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ, ఈదురుగాలుల తీవ్రత కొనసాగుతోందని కలెక్టర్లు తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని తగ్గించడంతో పాటు ప్రజలకు అవసరమైన సహాయక చర్యలను వేగవంతం చేయాలని సీఎం సూచించారు.

విశాఖలో కూలిన చెట్లు.. నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు

తుపాను ప్రభావంతో విశాఖపట్నంలోని (Vizag) పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. ఆంధ్రా యూనివర్సిటీ ఔట్‌గేట్‌, షీలానగర్‌, సీతమ్మధార, కేఆర్‌ఎం కాలనీ, హెచ్‌బీ కాలనీ, ఎంవీపీ డబుల్‌ రోడ్‌ తదితర ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. బిర్లా జంక్షన్‌ నుంచి ఊర్వశి జంక్షన్‌ వరకు సర్వీస్‌ రోడ్డుపై కూడా చెట్లు పడటంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. గాజువాకలోని లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. షీలానగర్‌, హరిజన జగ్గయ్యపాలెం ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. విశాఖపట్నంలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సమాచారం. అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో తొమ్మిది సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ వర్షపాతం నమోదైంది. కాకినాడ పరిసర ప్రాంతాల్లో బలమైన గాలులు వీచినట్లు అధికారులు వెల్లడించారు. అమలాపురం ప్రాంతంలోనూ భారీ వర్షాలు కురిశాయి.

పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షపాతం

అనకాపల్లి జిల్లా కన్నూరుపాలెంలో 26.1 సెంటీమీటర్లు, విజయనగరం జిల్లా భోగాపురం, విశాఖ జిల్లా (Vizag) ముడసర్లోవలో 25.9 సెంటీమీటర్లు, అనకాపల్లి జిల్లా తాడి, పరవాడలో 24.5 సెంటీమీటర్లు సోమలింగంపాలెం, అచ్యుతాపురంలో 23.9 సెంటీమీటర్లు, విశాఖ జిల్లా సింహాచలంలో 23.6 సెంటీమీటర్లు, చామలపల్లెలో 23.5 సెంటీమీటర్లు, విజయనగరం జిల్లా వేపాడలో 22.7 సెంటీమీటర్లు, విశాఖ జిల్లా పద్మనాభపురంలో 22.5 సెంటీమీటర్లు, అనకాపల్లి జిల్లా దేశపాత్రునిపాలెంలో 22.4 సెంటీమీటర్లు, విజయనగరం జిల్లా కొత్తవలసలో 22.3 సెంటీమీటర్లు, ఇదిలా ఉండగా, అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో విద్యుత్‌ షాక్‌కు గురై ఓ మహిళ మృతి చెందినట్లు సమాచారం.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

తుపాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు, వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని, విద్యుత్‌ స్తంభాలు, తెగిపడిన వైర్లు, నేలకొరిగిన చెట్లకు దూరంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసే తాజా హెచ్చరికలను అనుసరించాలని అధికారులు కోరారు. ఇదిలా ఉంటే తమిళనాడులో సముద్రం అల్లకల్లోలంగా మారింది. నార్త్ చెన్నైలో సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానికఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తూత్తుకుడిలో మూడు రోజులుగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లడం లేదు. (Cyclone Arnab)